తొమ్మిది ప్రాంతాల్లోని రాజీవ్ స్వగృహ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం
వచ్చే నెలలోనే ప్రక్రియ.. త్వరలో నోటిఫికేషన్... 760 ఫ్లాట్లు,
179 ప్లాట్ల విక్రయానికి ఏర్పాట్లు
కనీస ధరలు ఖరారు చేసిన
అధికారుల కమిటీ... తదుపరి మిగతా స్వగృహ ఆస్తుల వేలం
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్మించిన ఇళ్లలో మిగిలిపోయినవి, అసంపూర్తిగా ఉన్నవి, ఓపెన్ ప్లాట్లను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత తొమ్మిది ప్రాజెక్టులను ఎంపిక చేసింది. గతంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ తొమ్మిది ప్రాంతాల్లోని ఫ్లాట్లు, ప్లాట్లకు ధరలను ఖరారు చేసిన నేపథ్యంలో.. నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతోంది. వచ్చే నెలలోనే ఈ తొమ్మిది ప్రాంతాల్లోని ఆస్తులను వేలం వేయనున్నారు. ఇందులో ఒక బీహెచ్‌కే నుంచి 3 బీహెచ్‌కే వరకు ఉన్న 760 ఫ్లాట్లు... 200 గజాల నుంచి 2,200 గజాల వరకు ఉన్న 179 ప్లాట్లు.. అసంపూర్తిగా ఉన్న 5 నుంచి 9 అంతస్తుల 6 టవర్లు (ఇళ్ల సముదాయాలు) ఉన్నాయి. అన్నింటినీ కూడా ఉన్నవి ఉన్నట్టుగా (యథాతథ స్థితిలో) విక్రయించనున్నారు. తర్వాత మిగతా ప్రాజెక్టుల్లోని ఆస్తులను వేలం వేస్తారు.
ఈ ఆస్తులు ఎక్కడెక్కడ?
⇒ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ, పోచారంలలో ఫ్లాట్లు ఉన్నాయి. వాటిల్లో కొన్ని పూర్తయినవి, కొన్ని అసంపూర్తివి ఉన్నాయి. బండ్లగూడలో 129 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సెమీ ఫినిష్డ్ స్థాయిలో ఆగిపోయినవి. ఇక ఇప్పటికిప్పుడు గృహప్రవేశం చేసుకునేలా పంతొమ్మిది 2 బీహెచ్‌కే ఫ్లాట్లు, పదకొండు 3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ మోడల్ ఫ్లాట్లు కావడంతో వెల్ ఫర్నిష్‌డ్ కావడం విశేషం. వీటికి కనీస ధర చదరపు అడుగుకు రూ.3 వేలుగా నిర్ణయించారు. 3 బీహెచ్‌కే ఫ్లాట్ల ధర రూ.37.23 లక్షల నుంచి రూ.48.51 లక్షల వరకు పలికే అవకాశం ఉంది. ఇదే తరహాలో మిగతా కేటగిరీల ఫ్లాట్ల ధరలు కూడా ఉంటాయి.
⇒ పోచారంలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 255, 2 బీహెచ్‌కే ఫ్లాట్లు 340, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు 6 ఉన్నాయి. బండ్లగూడ కంటే వీటి ధరలు కొంత తక్కువగా ఖరారు చేశారు.
⇒ కొన్ని ఐదు అంతస్తులు, కొన్ని 9 అంతస్తులతో అసంపూర్తిగా ఉన్న 6 టవర్లను కూడా అమ్మకానికి ఉంచారు. వీటిల్లో ఫ్లాట్లను విడివిడిగా కాకుండా.. మొత్తం భవనాలను గంపగుత్తగా వేలం వేయనున్నారు.
⇒ ఇక చందానగర్‌లో మూడు భారీ టవర్లు నిర్మించేందుకు సిద్ధం చేసిన మూడు భారీ ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఇవి 2 వేల గజాల నుంచి 2,200 చదరపు గజాల వరకు విస్తీర్ణంతో ఉన్నాయి. వీటికి కనీస ధరను గజం రూ.40 వేలుగా నిర్ణయించారు.
⇒ 200 గజాల నుంచి 500 గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. నగర శివార్లలోని బహదూర్‌పల్లిలో 69, తొర్రూరులో 514, భూత్పూరు సమీపంలోని పోతులమడుగులో 111, మహబూబ్‌నగర్ పట్టణంలో 45 ప్లాట్లు అమ్మకానికి సిద్ధం చేశారు.
అప్పట్లో రూ.1,940 కోట్లు.. ఈసారి రూ.850 కోట్లు!
రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా 2022–23లో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో స్వగృహ ఫ్లాట్లను వేలం వేసింది. అప్పట్లో ప్రభుత్వానికి రూ.1,940 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి తొలి దఫా వేలం ద్వారా రూ.850 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం బండ్లగూడ, పోచారం ప్రాజెక్టులలో మిగిలిన ఫ్లాట్లన్నింటినీ వేలంలో ఉంచారు. ఇంతకాలం ఆ ఇళ్ల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది. ఇప్పుడు అన్నీ అమ్ముడైతే ఈ భారం తగ్గుతుంది. ఇక గతంలో స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇళ్లు నిర్మించేందుకు సిద్ధం చేసిన స్థలాలనూ ఇప్పుడు వేలానికి పెడుతున్నారు. అవి అమ్ముడైతే ఆ ప్రాజెక్టులు కూడా ముగిసిపోయినట్టే.
Comments
Please login to add a commentAdd a comment