![Old Man Ends Life In Hyderabad](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/1445.jpg.webp?itok=j0-NHXH-)
ఆస్తి కోసమే తాతను చంపిన మనవడు
వివరాలు సేకరించిన పంజగుట్ట పోలీసులు
పంజగుట్ట: ఆస్తి కోసం ఉన్మాదిలా మారి తాతను అత్యంత పాశవికంగా పలుమార్లు కత్తితో పొడిచి హత్య చేసిన మనవడి కేసులో పంజగుట్ట పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు కిలారు కార్తి తేజ (29)ను శనివారం అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరుకు చెందిన వి.చంద్రశేఖర జనార్దన్ రావు (86) వెలిజ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. రెండో కూతురు సరోజ భర్త వేరే ప్రాంతంలో ఉండగా.. ఆమె తండ్రితో కలిసి సోమాజిగూడలో నివసిస్తోంది.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా మరొకరిని నియమించారని..
సరోజ కొడుకు కార్తి తేజ అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి 2018లో నగరానికి వచ్చాడు. కార్తి తేజ తనకు తాత ఆస్తిలో వాటా సరిగా ఇవ్వడం లేదని, చిన్నతనం నుంచి అందర్నీ పెంచినట్లు తనను పెంచలేదని మనసులో కక్ష పెంచుకున్నాడు. ల్యాంకో హిల్స్‌లో స్నేహితులతో కలిసి ఉంటూ.. తాత, తల్లితో తరచూ గొడవపడుతుండేవాడు. ఇటీవల జనార్దన్ రావుకు సంబంధించిన ఒక సంస్థకు సరోజ అక్క కొడుకును బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా నియమించడంతో కార్తి తేజ జీర్ణించుకోలేక పోయాడు.
ఎలాగైనా తాతను చంపాలని నిర్ణయించుకున్నాడు. గురువారం రాత్రి 11 గంటలకు సోమాజిగూడలోని తాత జనార్దన్‌రావు ఇంటికి వచ్చాడు. కుర్చీలో కూర్చుని ఉన్న తాతను తన వెంట తెచ్చుకున్న కత్తితో సుమారు 60 నుంచి 70 సార్లు విచక్షణారహితంగా పొడిచాడు. జనార్దన్ రావు గట్టిగా కేకలు వేయడంతో వంటింట్లో ఉన్న కార్తి తేజ తల్లి సరోజ బయటకు వచ్చి అడ్డుకోబోగా ఆమెను కూడా కత్తితో ఆరు పోట్లు పొడిచాడు. బయట విధుల్లో సెక్యురిటీ గార్డు ఇంట్లోకి రాగా.. చంపేస్తానంటూ అతడిని కత్తితో బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు.
తనను అందరిలా పెంచలేదని తాతను చంపిన మనవడు
మంచి వితరణశీలిగా పేరు..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి జనార్దన్ రావు అప్పటికే మృతి చెందాడు. కుమారుడి చేతిలో కత్తిపోట్లను గురైన తల్లి సరోజను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. జనార్దన్ రావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం ఏలూరుకు తరలించారు. శనివారం సోమాజిగూడలోని భీమా జ్యువెలరీ షాపు వద్ద సంచరిస్తున్న కార్తి తేజను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. జనార్దన్ రావు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఆస్పత్రులు, టీటీడీకి కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మంచి మనిషి మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment