హైదరాబాద్: చిన్నప్పటి నుంచి తనను అందరిలా పెంచలేదని.. అందరిని చూసినట్లు తనను చూడలేదని తాతను కత్తితో పొడిచి చంపేశాడు ఓ మనవడు. అడ్డుకోబోయిన కన్నతల్లిని గాయపరిచాడు. ఈ దారుణ ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎస్ మక్తాలో నివాసం ఉండే వి.చంద్రశేఖర జనార్దన్ రావు (86) వ్యాపారవేత్త. ఇతను వెల్జాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్త్రీ చైర్మన్.
ఆయనకు సరోజ అనే కూతురు. ఆమె భర్త బెంగళూరులో ఉండగా.. సరోజ తండ్రి జనార్దన్ రావుతో కలిసి బీఎస్ మక్తాలో ఉంటోంది. సరోజ కొడుకు కిలారు కార్తి తేజ (29) అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి నగరానికి తిరిగి వచ్చాడు. తాత ఆస్తి కోసం నిత్యం గొడవ పడేవాడు. అందరినీ చూసినట్లు తనను చూడడంలేదని.. అందరిలా తనను పెంచలేదంటుండేవాడు. ఈ విషయంలో తాతతో విభేదించి కార్తితేజ ల్యాంకోహిల్స్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. గురువారం రాత్రి బీఎస్ మక్తాకు వచ్చి ఆర్థిక లావాదేవీల గురించి తల్లి, తాతతో గొడవకు దిగాడు.
తన వెంట తెచ్చుకున్న కత్తితో తాత జనార్దన్ రావు కడుపులో పొడిచాడు. అడ్డుకున్న తల్లి సరోజను గాయపరిచాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతలోపే కార్తి తేజ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అప్పటికే జనార్దన్ రావు మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయాలపాలైన సరోజను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు కార్తి తేజ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment