సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా ‘ఆపరేషన్ నిఘా’పేరుతో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్ కోసం చేపట్టిన వేట ముమ్మరంగా సాగుతోంది. శనివారం రాత్రి కదంబా ఎన్‌కౌంటర్‌లో భాస్కర్ తృటిలో తప్పించుకోవడంతో అతని కోసం సమీపంలోని అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ కూంబింగ్‌లో పెద్ద ఎత్తున సివిల్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ దళాలు పాల్గొన్నాయి. మూడునెలలుగా పోలీసులు తనను నీడలా వెంటాడుతున్నా.. ఆసిఫాబాద్‌ను వీడకుండా.. భాస్కర్ ఇక్కడే ఎందుకు ఉంటున్నాడన్న విషయం పోలీసులకు తొలుత అంతుచిక్కలేదు. తర్వాత ఈ విషయంలో పోలీసులు ఒక స్పష్టతకు వచ్చినట్లు సమాచారం.
రిక్రూట్‌మెంట్ కోసం ఇక్కడే..!
సాధారణంగా మావోయిస్టులు నిరంతరం స్థావరాలు మారుస్తారు. కానీ, ఆసిఫాబాద్ అడవుల్లో సివిల్, సీఆర్‌పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ దళాలు తనను పట్టుకునేందుకు నీడలా అనుసరిస్తోన్నా.. భాస్కర్ అక్కడే ఎందుకు తచ్చాడుతున్నాడన్న దానిపై పోలీసులకు కొంత సమచారం లభించింది. తెలంగాణలో తిరిగి పూర్వవైభవం కోసం తపిస్తోన్న మావోయిస్టులు ఆసిఫాబాద్ నుంచి రిక్రూట్‌మెంట్ చేసుకునేందుకు భారీగా సన్నాహాలు చేశారు. ఇందులో కొంతమేరకు సఫలీకృతమయ్యారన్న అనుమానాలు ఉన్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కోటేశ్వరరావు ఆదేశాల మేరకు మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్ మాజీ సానుభూతిపరులు, ఇన్‌ఫార్మర్లను కలుస్తున్నాడన్నది పోలీసులకు లభించిన సమాచారం. తిర్యాణి మండలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పోలీసులకు లభించిన డైరీలో లభ్యమైన 15 మంది పేర్లు సానుభూతిపరులవా? లేక రిక్రూట్ అయ్యారా? అన్న విషయంలో పోలీసులకు ఇంకా స్పష్టత లేదు. ఆ జాబితాలో కొందరు అనుమానితులను గుర్తించిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. మిగిలిన వారి కోసం వెదుకులాట ఇప్పటికే ప్రారంభమైంది.
మూడోసారి...
జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తుంటే.. భాస్కర్ లాక్‌డౌన్ కాలంలో స్థానికంగా పలువురిని రిక్రూట్ చేసుకున్నాడని, పాత సానుభూతిపరులతో తిరిగి పరిచయాలు పెంచుకున్నాడన్న అభిప్రాయానికి పోలీసులు వచ్చారు. మహారాష్ట్ర సరిహద్దు నుంచి కాగజ్‌నగర్, ఈస్గాం వరకు భాస్కర్ దళం దాదాపు 40 కిలోమీటర్లు లోనికి వచ్చి స్వేచ్చగా సంచరించడం వెనక స్థానికుల సహకారం ఉండి ఉంటుందని పోలీసులు బలంగా విశ్వసిస్తున్నారు. జూలై 12వ తేదీన తొలుత తిర్యాణి మండలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నాక పోలీసులు అతని కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ తరువాత ఇటీవల భాస్కర్ జైనూరు మండలం షార్పల్లిలో తలదాచుకున్నాడన్న సమాచారంతో గ్రేహౌండ్స్ పోలీసులు గ్రామంలోకి రాత్రిపూట వెళ్లారు. ఇది తెలుసుకున్న గూడెం ప్రజలు పోలీసులను అడ్డుకున్నారు. వాగ్వాదం చెలరేగడంతో గ్రేహౌండ్స్ బలగాలపై రాళ్లదాడికి దిగారు. దీంతో పోలీసులు వెనకడుగు వేశారు. అలా భాస్కర్ రెండోసారి తప్పించుకున్నాడు. కదంబా ఎన్‌కౌంటర్‌లో మూడోసారి తమ కళ్ల ముందునుంచి భాస్కర్ పారిపోయాడని పోలీసులు వివరించారు. మైదానాల్లోకి వెళితే.. డ్రోన్ కెమెరాలకు చిక్కే ప్రమాదముండటంతో దట్టమైన అడవుల్లోకి వెళ్లాడని పోలీసులు అంటున్నారు. పోలీసుల వేట ముమ్మరమైన ప్రతీసారి మహరాష్ట్ర– తెలంగాణ సరిహద్దుల్లోని అడవుల్లో తలదాచుకుంటున్నాడన్న సమాచారం పోలీసుల వద్ద ఉంది.
సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి కుట్ర భగ్నం..
ఇటీవల మావోయిస్టులు చర్ల మండలంలోని తిప్పాపురం సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడికి కుట్రపన్నారు. 200 మందికిపైగా మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొనేందుకు సమాయత్తమయ్యారు. ఈనెల 13వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లో వాగు దాటుతున్న వందలాదిమంది మావోయిస్టులు ఈ దాడి కోసమే బయల్దేరారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు బందోబస్తు పటిష్టం చేశారు. ఈ వీడియోలు మీడియాలో వైరల్ కావడంతో తెలిసిందే. వారిని ఎదుర్కొనేందుకు భారీగా బలగాలతో కూంబింగ్ చేపట్టారు. దీంతో తెలంగాణలోకి మావోయిస్టులు రాకుండా సీఆర్పీఎఫ్ క్యాంపు దాడిని పోలీసులు సమర్థంగా అడ్డుకోగలిగారు. భారీ విధ్వంసాలకు దిగాలన్న వ్యూహాలకు ముందుగానే చెక్‌పెట్టారు.
భాస్కర్ వ్యూహమేంటి?
Published Mon, Sep 21 2020 4:34 AM | Last Updated on Mon, Sep 21 2020 8:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment