సాక్షి, హైదరాబాద్: సహకార చట్టం నిబంధనలను బేఖాతరు చేస్తూ జూబ్లీహిల్స్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ నుంచి ఏడెనిమిది వందల మంది షేర్ హోల్డర్లను తొలగించడం పట్ల సొసైటీ మేనేజింగ్ కమిటీపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సొసైటీని ఉద్ధరిస్తారని ఓటేస్తే మా సభ్యత్వాలకే ఎసరు తెస్తారా? ప్రశ్నించిన వారి గొంతు నొక్కే విధంగా ఇష్టానుసారం సభ్యత్వాలను తొలగించడం ఏమిటి?’ అని మండిపడుతున్నారు.
ఇటీవల జరిగిన సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఏడెనిమిది వందల మంది సభ్యులను తొలగిస్తున్నట్టుగా తీర్మానించారు. నిబంధనల ప్రకారం సభ్యులను తొలగించాలంటే సొసైటీలో ఉన్న 5 వేల మంది సభ్యుల్లో.. కనీసం 2,500 మంది హాజరై అందులో 75 శాతం మంది చేతులెత్తి అంగీకరించడం ద్వారా ఏదైనా తీర్మానం అమలు అవుతుంది. కానీ ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో ఇదేమీ లేకుండానే తోచిన విధంగా తొలగింపు పర్వం చేపట్టినట్టు ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఖరీదైన ఆస్తులపై కన్ను
జూబ్లీహిల్స్ సొసైటీలో ఇంకా జీహెచ్‌ఎంసీకి చెందిన ఖాళీ స్థలాలున్నాయి. కొందరు ఇతర దేశాల్లో ఉండటంతో వారి ప్లాట్లు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటిపై కొందరు కన్నేసినట్టు తెలుస్తోంది. మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులను బెదరగొడుతూ, లొంగదీసుకుంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు తట్టుకోలేక, సదరు చానెల్ కార్యాలయంలోకి పదేపదే వెళ్లలేక కార్యదర్శిగా ఎన్నికైన మురళీ ముకుంద్ ధిక్కార స్వరం వినిపించారు. దీనిపై ఆగ్రహించిన ప్రెసిడెంట్ తండ్రి కక్ష పెంచుకుని.. మురళీ ముకుంద్‌ను పదవిలో లేకుండా చేయడానికి కుట్రపన్నారు. కోర్టులో మురళీ ముకుంద్ గెలిచినా ఇప్పటికీ సదరు మేనేజ్‌మెంట్ ఒప్పుకోవడం లేదు. షేర్‌హోల్డర్‌ను తొలగించడం చట్ట ప్రకారం సరికాదని చెప్తున్నా వినిపించుకోవడం లేదు.
ప్రభుత్వం ఏం చేస్తోంది?
జూబ్లీహిల్స్ సొసైటీలో ఏడాది నుంచి ఆరోపణలు, ప్రత్యారోపణలు, అవినీతి అక్రమాల విమర్శలు వస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కోర్టులను ఆశ్రయించడం, సమావేశాల్లో ధిక్కార స్వరాలు వినిపించడం, సస్పెన్షన్ల పర్వం కొనసాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో స్పందన లేదు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నోరు మెదపడం లేదు. సహకార శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్‌రావు, రిజి్రస్టార్ వీరబ్రహ్మంలలో ఎవరూ సొసైటీ కార్యకలాపాలపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి.
కోట్లాది రూపాయల విలువ చేసే ఖాళీ ప్లాట్లపై కొందరు కన్నేసి, కాజేస్తున్నా సదరు సహకార శాఖ అధికారులకు పట్టడం లేదు. కనీసం విచారణకు కూడా ఇప్పటివరకు ఆదేశించిన దాఖలాలు లేవు. సొసైటీ ఫైళ్లు ఎటు వెళ్తున్నాయి, సంతకాలు ఎవరు చేస్తున్నారన్న విషయంలో ఏ ఒక్కరికి శ్రద్ధ లేకుండా పోయిందని.. విలువైన స్థలాలున్న జూబ్లీహిల్స్ సొసైటీ విషయంలో ప్రభుత్వం ఎందుకిలా వ్యవహరిస్తోందన్నది అంతుపట్టడం లేదని సభ్యులు వాపోతున్నారు. ఇప్పటికైనా సహకార శాఖ ఉన్నతాధికారులు కలి్పంచుకొని.. సొసైటీ ఫైళ్లు ఎటు వెళ్తున్నాయి, ఏం జరుగుతోందన్న విషయంలో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు.
డమ్మీ ప్రెసిడెంట్..
గత నెలలో నన్ను సొసైటీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడంపై కోర్టును ఆశ్రయించాను. ఆ రోజు సొసైటీ తరఫున వాదించిన న్యాయవాది తాము ఎవరినీ తొలగించలేదన్నారు. ఆ మరునాడే హడావుడిగా నాతోపాటు మరికొందరిని తొలగిస్తున్నట్టు వాట్సాప్ మెసేజ్‌లు పంపారు. కోర్టులో చెప్పింది ఒకటి, బయట చేసింది మరొకటి. ఇదంతా సదరు చానెల్ కార్యాలయంలో జరుగుతున్న కుట్ర. సొసైటీ ప్రెసిడెంట్ డమ్మీయే. ఆయన తండ్రి మొత్తం అధికారాన్ని చేతుల్లోకి తీసుకొని వ్యవహారం నడిపిస్తున్నారు. సొసైటీ ఫైళ్లన్నీ సదరు చానల్ కార్యాలయానికే తరలాయి. ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు అన్నీ అక్కడే రూపొందుతున్నాయి. ఇటీవల నాతోపాటు మరికొందరిని లక్ష్యంగా చేసుకొని కరపత్రాలను పంపిణీ చేస్తూ సొసైటీ పరువు ప్రతిష్టలను బజారుకీడ్చారు. ఆసియాలోనే అతి పెద్ద టౌన్షిప్ అయిన జూబ్లీహిల్స్ సొసైటీని అప్రతిష్ట పాలు చేస్తున్నారు.
– ఎ.మురళీ ముకుంద్, కార్యదర్శి, జూబ్లీహిల్స్ సొసైటీ
ఎవరిని తొలగించినదీ లెక్కలేదు!
సొసైటీలో సభ్యులంతా షేర్ హోల్డర్లే. వీరిని తొలగించాలంటే చట్టం ప్రకారం నడుచుకోవాలి. రిజిస్ట్రార్ అనుమతి కూడా కావాలి. అయితే జూబ్లీహిల్స్ సొసైటీ విషయంలో మాత్రం జూబ్లీహిల్స్ రోడ్ నం.1 లోని ఓ టీవీ చానల్ కార్యాలయంలో సస్పెన్షన్ల అంశం పురుడు పోసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు చానల్ కార్యాలయంలోనే సభ్యులపై కుట్రలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. సదరు చానెల్ ఎదురుగా ఉన్న 6 వేల గజాల స్థలంపై కన్నేసిన యజమాని.. ముందుగా తన కుమారుడిని సొసైటీలోకి ప్రవేశపెట్టి మెల్లగా ఆక్రమణల పర్వానికి తెరలేపుతున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించినవారి సభ్యత్వాలు తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎంతమంది సభ్యులను తొలగించారన్న దానిపై సరైన లెక్క కూడా లేదని.. ఆ పేర్ల జాబితాను కూడా ప్రకటించలేదని పేర్కొంటున్నారు.
చదవండి: వానాకాలం సీఎంఆర్‌పై నీలినీడలు
Comments
Please login to add a commentAdd a comment