సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను విశ్లేషించడంతోపాటు పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ, కార్యకర్తల జీవిత బీమా వంటి అంశాలపై సమీక్షించేందుకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అధ్యక్షతన బుధవారం ఆ పార్టీ కార్యనిర్వాహక సమావేశం జరగనుంది. పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణ పురోగతి, ఇతర అంశాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను ఆహ్వానించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పలు కారణాలతో ఇంకా పెండింగ్‌లోనే: టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశంతో 2021-23కి సంబంధించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ ఏడాది ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. ఫిబ్రవరి నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పూర్తి చేసి మార్చిలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగత కమిటీల నిర్మాణం, ఏప్రిల్ 27న పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేలా షెడ్యూల్ ప్రకటించారు. అయితే శాసనమండలిలో పట్టభద్రుల కోటా ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్ తదితర కారణాలతో సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి కాలేదు. మరోవైపు 2019 జూలై 27న అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూమి పూజ చేసినా ఇప్పటివరకు సిద్దిపేట మినహా ఇతర జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభం కాలేదు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి వసంత్ విహార్ ఏరియాలో భూమి కేటాయించినా శంకుస్థాపన వాయిదా పడుతూ వస్తోంది. బుధవారం జరిగే సమావేశంలో సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి సమీక్ష జరగనుంది.
ఏందీ? పార్టీ సభ్యత్వాలు ఎందాకా వచ్చాయి?
Published Wed, Jul 14 2021 3:18 AM | Last Updated on Wed, Jul 14 2021 3:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment