trs membership
-
ఏందీ? పార్టీ సభ్యత్వాలు ఎందాకా వచ్చాయి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను విశ్లేషించడంతోపాటు పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ, కార్యకర్తల జీవిత బీమా వంటి అంశాలపై సమీక్షించేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అధ్యక్షతన బుధవారం ఆ పార్టీ కార్యనిర్వాహక సమావేశం జరగనుంది. పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణ పురోగతి, ఇతర అంశాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. తెలంగాణ భవన్లో జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను ఆహ్వానించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పలు కారణాలతో ఇంకా పెండింగ్‌లోనే: టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశంతో 2021-23కి సంబంధించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ ఏడాది ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. ఫిబ్రవరి నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పూర్తి చేసి మార్చిలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగత కమిటీల నిర్మాణం, ఏప్రిల్ 27న పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేలా షెడ్యూల్ ప్రకటించారు. అయితే శాసనమండలిలో పట్టభద్రుల కోటా ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్ తదితర కారణాలతో సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి కాలేదు. మరోవైపు 2019 జూలై 27న అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూమి పూజ చేసినా ఇప్పటివరకు సిద్దిపేట మినహా ఇతర జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభం కాలేదు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి వసంత్ విహార్ ఏరియాలో భూమి కేటాయించినా శంకుస్థాపన వాయిదా పడుతూ వస్తోంది. బుధవారం జరిగే సమావేశంలో సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి సమీక్ష జరగనుంది. -
బెదిరించి టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు
సాక్షి, హుజూర్నగర్: కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమకేసులు బనాయించి, కొట్టించి, బెదిరించి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం చింతలపాలెంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, పోలీస్ స్టేషన్లను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ వారు గలీజు రాజకీయాలు పాల్పడుతున్నారన్నారు. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిస్పందిస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. పులిచింతల ప్రాజెక్ట్ ముంపు బాధితులకు మెరుగైన జీవితం అందించాలనే ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతో ఆర్అండ్ఆర్ సెంటర్లను కట్టిచినం. దే«శంలో ఏరాష్ట్రంలో ఎక్కడా కూడా ఇలాంటి పునరావాస కేంద్రాలు కట్టలేదని స్పష్టం చేశారు. గత ఆరేళ్లుగా పులిచింతల బాదితులకు మంత్రి జగదీశ్‌రెడ్డి ఒక్క రూపాయి మంజూరు చేశాడా అని ప్రశ్నించారు. అటువంటి వారు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు దుయ్యబట్టారు. ఉప ఎన్నికలు.. మన ఆత్మగౌరవానికి జరిగే ఎన్నికలన్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకు హుజూర్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మావతి పోటీ చేస్తుందని. ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తొలుత ఉత్తమ్‌ను పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, నాయకులు చిలకల శ్రీనివాసరెడ్డి, మోర్తాల సీతారెడ్డి, కొట్టే సైదేశ్వరరావు, శాగంరెడ్డి గోవిందరెడ్డి, అరుణ్‌కుమార్ దేశ్‌ముఖ్, అల్లం ప్రభాకర్‌రెడ్డి, నర్సింహమూర్తి, తోట శేషు, ఇంద్రారెడ్డి, మంజూ నాయక్ నవీన్ నాయక్, మోతీలాల్, రామిరెడ్డి, పుల్లారెడ్డి, వీరారెడ్డి, కాశయ్య వివిద గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ సభ్యత్వ పుస్తకాల పంపిణీలో ఉద్రిక్తం
నల్లగొండ: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పుస్తకాల పంపిణీ అర్థంతరంగా ఆగిపోయింది. గురువారం పెద్దవూరలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ నేతలు సభ్యత్వ పుస్తకాల పంపిణీ చేపట్టారు. అయితే, పెద్దవూర మండలానికి సంబంధించిన పుస్తకాలను ఒక వర్గం వారికే అప్పగిస్తున్నారంటూ మరో వర్గం వారు ఆందోళనకు దిగారు. జిల్లా నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గమనించిన పార్టీ నేతలు పెద్దవూర మండలానికి పుస్తకాల పంపిణీని వాయిదా వేసి మిగతా మండలాలకు అందజేశారు.