పల్నాడు జిల్లాలో టీడీపీ గూండాగిరీకి చెట్టుకొకరు.. పుట్టకొకరు
గ్రామంలో ఉండొద్దంటూ వైఎస్సార్‌సీపీకి చెందిన వందల కుటుంబాల గెంటివేత
టీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగంలో బతకలేక తెలంగాణలో బంధువుల ఇళ్లలో తలదాచుకున్న బాధితులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఏపీలో అధికారమే అండగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రక్తపుటేర్లు పారించడం తెలిసిందే. ఇప్పుడు అధికారం కూడా తోడవడంతో వారు స్వైరవిహారం చేస్తున్నారు.
పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను ఊరి నుంచి తరిమేశారు. మహిళలు, వృద్ధులు, పిల్లలను సైతం తరిమికొట్టారు. చివరకు పోలీసులు కూడా టీడీపీ నేతలకే వంతపాడుతూ.. వెళ్లిపొమ్మని ఒత్తిడి చేయడంతో గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం వదిలి అజ్ఞాతవాసం చేస్తున్నారు. చెట్టుకొకరు, పుట్టకొకరు మాదిరిగా భయంతో పారిపోయి తలదాచుకుంటున్నారు.
ఇలా పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన వందల కుటుంబాలు గెంటివేతకు గురయ్యాయి. రాష్ట్రాన్ని వదిలేసి తెలంగాణకు వలస వెళ్లి అక్కడక్కడ కొందరు అద్దె ఇళ్లు తీసుకొని జీవనం సాగిస్తుండగా మరికొందరు బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇలా తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కృష్ణపట్టె ప్రాంతానికి తరలి వచ్చిన కుటుంబాలను కదిలిస్తే ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ.
వందల ఇళ్లు ధ్వంసం..
టీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగంలో పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు గ్రామంలో బతకలేని పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్‌సీపీ వారెవరూ గ్రామంలో ఉండడానికి వీల్లేదని గ్రామంలో దండోరా వేయించారంటే టీడీపీ నేతల దురాగతాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. టీడీపీ గూండాలు దాడులు చేస్తూ అక్కడి ప్రజలను కట్టుబట్టలతో గ్రామాల నుంచి గెంటివేశారు.
ఇంకోవైపు కాపాడాల్సిన పోలీసులే ‘మీరు గ్రామంలో ఉండొద్దు.. ఉంటే గొడవలవుతాయి.. కాబట్టి వెళ్లిపోండి’ అంటూ గ్రామస్తులను వేరే చోటకు పంపించివేస్తున్నారు. గ్రామంలో దాదాపు 3,700 కుటుంబాలు ఉంటే ఇప్పటివరకు 1,035 కుటుంబాలను వెళ్లగొట్టినట్లు చెబుతున్నారు. మరోవైపు 150 వరకు తాళాలు వేసి ఉన్న ఇళ్లు, కిటీకీలు పగులగొట్టి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
చివరకు ఇళ్లలో ఉన్న బియ్యాన్ని కూడా వదలకుండా పారబోసినట్లు వాపోయారు. గ్రామంలో ఉన్న దాదాపు 7 వేల ఓట్లలో వైఎస్సార్‌సీపీ కంటే టీడీపీకే 60 ఓట్లు అత్యధికంగా వచ్చినా, అసలు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులెవరూ గ్రామంలో ఉండడానికి వీల్లేదన్నట్టు వెళ్లగొట్టారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వలస కూలీలుగా బతకాల్సిన దైన్యం
గ్రామంలో వైఎస్సార్‌సీపీ పార్టీ నేతలు, కార్యకర్తల్లో అత్యధికంగా బడుగు, బలహీన వర్గాల వారే. అయినా పేదలనే కనికరం లేకుండా వారిని టీడీపీ నేతలు వెళ్లగొట్టారు. దీంతో గ్రామంలో భూములు ఉండటంతో వ్యవసాయం చేసుకున్న రైతులు ఇప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. మరికొందరు చిన్నాచితకా పనులు చేసుకుంటున్నారు.
ఎంపీటీసీగా ఉండొద్దని హుకుం జారీ చేశారు..
మాది పిన్నెల్లి గ్రామం. ఎంపీటీసీ భర్తను. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. దీంతో ఎంపీటీసీగా ఉండడానికి వీల్లేదని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. మా గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ నేత చింతపల్లి అన్ని గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందినవారెవరూ ఉండడానికి వీల్లేదని మమ్మల్ని బయటకు తరిమే శారు. పోలీసులు వారికే కొమ్ముకాస్తున్నారు. – చింతపల్లి పెద్దసైదా (మాస్టర్), వైఎస్సార్‌సీపీ మండల అధికార ప్రతినిధి, మాచవరం
కట్టుబట్టలతో గ్రామం విడిచివచ్చాం
టీడీపీ నేతలు మమ్మల్ని వెళ్లగొడితే కట్టుబట్టలతో గ్రామం విడిచివచ్చాం. మాకు వ్యవసా యం తప్ప వేరే పని తెలియదు. దీంతో కుటుంబ సభ్యులతో తెలంగాణలోని కృష్ణపట్టెకు వ చ్చి వ్యవసాయ పనులు చేస్తున్నాం. ఇక్కడే రెండెకరాల పొలం కౌలుకు తీసుకున్నా. కొంత చెల్లించినా మిగతావి కట్టేందుకు డబ్బుల్లేవు. – తొండా సైదు, రైతు, పిన్నెల్లి
మా ఇంటిని ధ్వంసం చేశారు..
ఎన్నికల్లో టీడీపీ గెలవగానే మా ఇంటిని క్రేన్‌తో ధ్వంసం చేశారు. బైకును తగలబెట్టారు. బీరువాలో ఉన్న డబ్బులు, బంగారం ఎత్తుకుపోయారు. మాకు 8 ఎకరాల పొలం ఉన్నా ప్రాణభయంతో వచ్చేశాం. మా ఇంటిలో ఉన్న పిల్లల సర్టిఫికెట్లు తీసుకురమ్మని మా బంధువులను పంపితే వారిని కూడా కొట్టి పంపారు. తిరిగి మా పైనే కేసులు పెట్టారు. – గుంటూరు జమీల, పిన్నెల్లి
ఆడపిల్లలను బూతులు తిడుతూ బట్టలు తగలబెట్టారు..
టీడీపీ వాళ్లు మా ఇంటి తాళాలు పగులగొట్టి సీసాలు పగులగొట్టి ఇంట్లో వేశారు. ఇల్లంతా చిందర వందర చేశారు. మా అమ్మాయిలను బూతులు తిడుతూ బట్టలు తగలబెట్టారు. – గుంటూరు బషీరున్, పిన్నెల్లి
Comments
Please login to add a commentAdd a comment