
సాక్షి, హైదరాబాద్: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల(ఈఎంఆర్‌ఎస్)లకు వీలైనంత త్వరగా శాశ్వత భవనాలను నిర్మించాలని రాష్ట్ర గిరిజన, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం డీఎస్‌ఎస్ భవన్‌లో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంనుంచి ఈఎంఆర్ స్కూళ్లన్నీ శాశ్వత భవనాల్లోనే కొనసాగించాలని, అందుకోసం పనులు వేగవంతం చేయాలన్నారు.
ప్రస్తుతం 44 విద్యా సంస్థల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, వాటిలో 21 భవనాల నిర్మాణం పూర్తి అయ్యిందని, మరో 23 భవనాలు వివిధ దశల్లో ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు మంత్రికి వివరించారు. నిర్మాణాలు పూర్తయిన భవనాలకు త్వరలో శంకుస్థాపన కోసం ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. కొత్త భవనాల్లో వీలైనంత త్వరలో వేడినీటి వసతి కల్పించాలని రెడ్కో ప్రతినిధులను సూచించారు. ఈ సమీక్షలో గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, అదనపు కార్యదర్శి నవీన్ నికోలస్, చీఫ్ ఇంజనీర్ శంకర్ తదితరులు ఉన్నారు.