పట్టణాల్లో ఒకలా, పల్లెల్లో మరోలా..  | Petition in the High Court on the rule of three children | Sakshi
Sakshi News home page

పట్టణాల్లో ఒకలా, పల్లెల్లో మరోలా.. 

Published Sun, Dec 3 2023 1:29 AM | Last Updated on Sun, Dec 3 2023 1:29 AM

Petition in the High Court on the rule of three children - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ చట్టం 2018లోని సెక్షన్‌ 213ని సవాల్‌ చేస్తూ న్యాయవాది, సామాజిక కార్యకర్త రాపోలు భాస్కర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నా రు.

‘పోటీ చేసే అభ్యర్థులకు ముగ్గురు పిల్లల నిబంధన గ్రామాల్లో ఒకలా.. పట్టణాల్లో మరో లా ఉంది. సెక్షన్‌ 213 ప్రకారం ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సహా ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అన ర్హులు. ఈ నిబంధన పట్టణ ఎన్నికలకు వర్తించదు. తెలంగాణ మునిసిపాలిటీ చట్టం ప్రకారం కౌన్సిలర్, మేయర్, కార్పొరేటర్, చైర్మన్‌ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు పిల్లల సంఖ్యతో సంబంధం లేదు.

రెండు చట్టాల మధ్య ఈ వ్యత్యాసం రాజ్యాంగంలోని 13, 14, 19 అధికరణలను ఉల్లంఘించడమే కాదు.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. దీన్ని పరిగణనలోకి తీసుకుని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ చట్టం 2018లోని సెక్షన్‌ 213 రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలి. పట్టణ, గ్రామీణ అభ్యర్థుల మధ్య వివక్షను సరిదిద్దేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి’అని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement