ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం | Phone tapping case: Accused Withdraws Bail Petition At Namplally Cpurt | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం

Published Mon, Apr 15 2024 3:55 PM | Last Updated on Mon, Apr 15 2024 5:59 PM

Phone tapping case: Accused Withdraws Bail Petition At Namplally Cpurt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టైన నలుగురు పోలీస్‌ అధికారులు బెయిల్‌ పిటిషన్‌ను విత్‌ డ్రా చేసుకున్నారు.నలుగురు నిందితులపై పోలీసులు సెక్షన్‌ 70 ఐటీ యాక్ఠ్‌ కింద కేసు నమోదు చేయగా.. 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్షపడే సెక్షన్‌ కావడంతో సెషన్‌ కోర్టుకు వెళ్లాలన్న నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో నాంపల్లి ఏసీఎంఎం కోర్టులో వేసిన బెయిల్‌ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. మంగళవారం నాంపల్లి సెషన్‌ కోర్టులో కొత్తగా బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు నిందితులు.

కాగా గత ఎన్నికల సందర్భంగా పోలీసు వాహనాల్లో నగదును అక్రమంగా తరలించిన విషయం ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు సందర్భంగా వెలుగుచూడటంతో హైదరాబాద్‌ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీనికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా కొందరు ప్రజాప్రతినిధులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగిన ఈ అక్రమ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఇప్పటికే సిట్‌ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు.

2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2020లో జరిగిన దుబ్బాక, 2021 అక్టోబర్‌లో జరిగిన హుజూరాబాద్, 2022 అక్టోబర్‌ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఈ నగదు అక్రమ రవాణా ఎక్కువగా జరిగినట్లు తేల్చారు. ఇక ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరుగుతోందని నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశం పైనా త్వరలో వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement