సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: సికింద్రాబాద్ మౌలాలీలోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (జడ్‌ఆర్‌టీఐ)లో ఉన్న 200 ఏళ్ల నాటి వారసత్వ బావిని పునరుద్ధరించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతోషం వ్యక్తంచేశారు. నీటి సంరక్షణ, నీటి వనరుల పునరుద్ధరణ కోసం దక్షిణ మధ్య రైల్వే చేసిన కృషి అభినందనీయమని ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. ‘హరిత కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ సికింద్రాబాద్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోని 200 ఏళ్లనాటి వారసత్వ బావి పునరుద్ధరించారు.
నీటి సంరక్షణ సులభతరం చేయడానికి దాని చుట్టూ రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ పిట్‌లను నిర్మించారు’ అన్న రైల్వేశాఖ ట్వీట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. దీనివల్ల నీటివనరులను కాపాడుకునేందుకు, సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రూ.6 లక్షలతో దక్షిణ మధ్య రైల్వే ఈ బావి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టింది. దీనివల్ల రూ.5 లక్షల వరకు ఆదా అవుతుందని అంచనా.
సుమారు 50 అడుగుల లోతు ఉన్న ఈ హెరిటేజ్ బావి రోజుకు 1 లక్ష లీటర్ల నీటిని అందజేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ వారసత్వ మెట్ల బావి 200 ఏళ్ల నాటిది. నిజాం కాలంనాటి ఈ బావికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. సర్ మీర్ తురాబ్ అలీఖాన్, సాలార్‌జంగ్–1 (1829–1883) దీన్ని మామిడి తోటలకు కావాల్సిన నీటికోసం నిర్మించారు. నీటిపారుదల సిబ్బంది నివాసం కోసం బావికి ఉత్తరం వైపు ప్రత్యేకంగా 10 గదులను నిర్మించారు. 1966లో ఈ బావి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment