ఒకేసారి 9 ‘వందేభారత్‌’ల పరుగు | PM Modi to inaugurate 9 Vande Bharat Express trains | Sakshi
Sakshi News home page

ఒకేసారి 9 ‘వందేభారత్‌’ల పరుగు

Published Sat, Sep 23 2023 2:39 AM | Last Updated on Sat, Sep 23 2023 8:17 PM

PM Modi to inaugurate 9 Vande Bharat Express trains - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వందేభారత్‌ రైళ్లను మరింత వేగంగా పట్టాలెక్కించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. గతంలో మాదిరిగా ఒక్కో రైలును ప్రారంభించటం కాకుండా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా ఈ నెల 24న ఒకేసారి తొమ్మిది వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీ వర్చువల్‌గా వాటిని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇందులో కాచిగూడ–­యశ్వంత్‌పూర్‌ మధ్య నడిచే వందేభారత్‌తోపాటు విజయవాడ–చెన్నై సర్వీసు కూడా ఉంది.

అలాగే ఉదయ్‌పూర్‌–జైపూర్, తిరునెల్వేలి–చెన్నై, పట్నా–హౌరా, కాసర్‌గాడ్‌–తిరువనంతపురం, రౌర్కెలా–భువనేశ్వర్‌–పూరీ, రాంచీ–హౌరా, జామ్‌నగర్‌–అహ్మదాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను కూడా ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. వాస్తవానికి రెండు నెలల క్రితమే కాచిగూడ–యశ్వంత్‌పూర్‌ సర్వీసు ప్రారంభం కావాల్సి ఉండగా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో రైళ్లను ప్రారంభించేందుకు వీలుగా దాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.

అన్నీ చిన్న రైళ్లే..
గతంలో ప్రారంభించిన వందేభారత్‌ రైళ్లు 16 కోచ్‌లతో ఉండగా ఇప్పుడు ఒకేసారి 9 రైళ్లు ప్రారంభించనున్నందున ఎనిమిది కోచ్‌లతోనే వాటిని సిద్ధం చేశారు. ఇందులో ఒక ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్, ఏడు ఎకానమీ చైర్‌కార్‌ కోచ్‌లు ఉండనున్నాయి. విశాఖ, తిరుపతి సర్వీసులు 120 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో పరుగుపెడుతున్నాయి. కొత్తగా ప్రారంభమయ్యేవి కూడా అదే స్థాయి డిమాండ్‌తో నడిస్తే వాటి కోచ్‌ల సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ఐటీ నగరాల మధ్య నాలుగో రెగ్యులర్‌ సర్వీసు.. 
హైదరాబాద్‌–బెంగుళూరు మధ్య ఐటీ నిపుణులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తు తం రెండు నగరాల మధ్య రెగ్యులర్‌ సర్వీసులు మూడే ఉన్నాయి. కాచిగూడ–బెంగుళూరు–­మైసూ రు,  కాచిగూడ–యలహంక, నిజాముద్దీన్‌–బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు నిత్యం నడుస్తున్నాయి.

ఇవి కాకుండా వారానికి మూడు రోజులు గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్, ఒక్కో రోజు చొప్పున కాచిగూడ–యశ్వంత్‌పూర్‌ జబల్‌పూర్‌–­యశ్వంత్‌పూర్‌ లక్కో–యశ్వంత్‌పూర్‌లున్నాయి. ఇప్పుడు నాలుగో రెగ్యులర్‌ సర్వీసుగా వందేభారత్‌ ప్రారంభమవుతోంది. ఈ రైలు మహబూబ్‌నగర్‌ మీదుగా ప్రయాణించనుంది. ఫలితంగా తొలిసారి మన వందేభారత్‌ రైలు మూడు రాష్ట్రాల మీదుగా (తెలంగాణ–ఏపీ–కర్ణాటక) ప్రయాణించినట్లు కానుంది.



తగ్గనున్న ప్రయాణ సమయం...
ప్రస్తుతం హైదరాబాద్‌–బెంగుళూరు మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌లు గమ్యం చేరుకొనేందుకు పదకొండున్నర గంటల సమయం తీసుకుంటున్నాయి. ఒక్క రాజధాని ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే 10 గంటల్లో చేరుకుంటోంది. ఇప్పుడు కొత్తగా పట్టాలెక్కబోతున్న వందేభారత్‌ సర్వీసు ఎనిమిదిన్నర గంటల్లోనే గమ్యం చేరుకోనుంది.

కాచిగూడలో ఉదయం ఐదున్నరకు (ఇంకా సమయాలు అధికారికంగా వెల్లడి కాలేదు) ప్రారంభమై మధ్యాహ్నం 2:15కు బెంగుళూరు చేరుకోనుంది. తిరిగి అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11:15కు కాచిగూడకు చేరుకోనుంది. ఈ రైలు మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురంలలో మాత్రమే ఆగనుందని సమాచారం. మరో రెండు స్టేషన్‌ల కోసం డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement