సాక్షి, హైదరాబాద్: ‘అవినీతి, కుటుంబ పాలన అనేవి ప్రజాస్వామ్యానికి మొదటి శత్రువులు. తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. పేదలను లూటీ చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోం. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రజలను దోచుకునే వారెవరినీ వదిలిపెట్టబోనని నేను ఎర్రకోట సాక్షిగా ప్రమాణం చేశా. అవినీతిపరులు దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు కూటమిగా మారే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఇదంతా చూస్తున్నారు. వారికి అంతా అర్థమవుతోంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
తెలంగాణ పేరుతో వచ్చిన కొందరు విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. తెలంగాణలో అవినీతి, కుటుంబపాలన రాజ్య మేలుతోందని.. దీనిని అంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కు అవకాశం ఇవ్వాలని.. అన్ని వర్గాలను, అన్ని రంగాలను అభివృద్ధి చేసి చూపిస్తామని పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోదీ.. బేగంపేటలో బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. టీఆర్‌ఎస్, కేసీఆర్‌ల పేర్ల ను ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించా రు. ప్రసంగం వివరాలు మోదీ మాటల్లోనే..
‘తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టం. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు భారతమాత సేవ కోసం నిష్టతో కృషి చేస్తున్నారు. వారికి నా అభినందనలు. తెలంగాణతో బీజేపీకి బలమైన అనుబంధం ఉంది. 1984లో బీజేపీకి పార్లమెంటులో కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. అందులో ఒకటి తెలంగాణ నుంచి జంగారెడ్డి గెలిచి, బీజేపీకి అండగా నిలిచినదే. ఇప్పుడు బీజేపీ పార్లమెంటులో మూడు వందలకు పైగా సీట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు పలు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ప్రజలకు సంక్షేమ రాజ్యాన్ని అందిస్తోంది. త్వరలో తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇక్కడి ప్రజల మద్దతును చూస్తే తెలుస్తోంది.
తెలంగాణ ప్రజలకు విశ్వాస ఘాతుకం చేశారు
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉంది. అవినీతిమయమై కుటుంబ పాలనలో చిక్కుకుంది. తెలంగాణ పేరుతో ముందుకొచ్చిన కొందరే అభివృద్ధి చెందారు. వారు విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ అవినీతిని, కుటుంబ పాలనను అంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది. మునుగోడులో ఓటర్లు ఇచ్చిన మద్దతుతో తెలంగాణలో కమల వికాసం ఖాయమనిపిస్తోంది. తెలంగాణ ప్రజల్లో బీజేపీ పట్ల పెరిగిన ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది.
మూఢ నమ్మకాల ప్రభుత్వాన్ని తరిమేద్దాం
సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మూఢ నమ్మకాలను ప్రభుత్వాలు పాటించడం బాధాకరంగా ఉంది. మూఢ నమ్మకాలను పాటిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. కార్యాలయాలు ఎక్కడుండాలి? ఎవరెవరిని మంత్రులు చేయాలి? ఎవరిని మంత్రివర్గం నుంచి తీసేయాలి అని చూస్తోంది. ఈ తంతును దేశప్రజలంతా గమనిస్తున్నారు. అవినీతి, కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి ప్రధాన విరోధులు. బీజేపీలో కుటుంబ పాలన లేదు. మూఢ నమ్మకాలు లేవు. అవినీతి, అక్రమాలు లేవు. ప్రజలను దోచుకుకునే వారెవరినీ వదిలిపెట్టబోనని నేను ఎర్రకోట సాక్షిగా ప్రమాణం చేశాను.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఇళ్లు ఇవ్వలేకపోయాం
పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తున్నాం. పలు రాష్ట్రాల్లో పథకాన్ని విజయవంతంగా అమలు చేసినా తెలంగాణలో ఇక్కడి ప్రభుత్వం వైఖరి కారణంగా చేయలేకపోయాం. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఒక్కరికీ పీఎం ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వలేదు. ఇక డబుల్ బెడ్రూం ఇళ్లు ఎవరికి ఇచ్చారో ప్రజలకు తెలుసు. ఇక దేశంలోని ఏ వ్యక్తి ఆకలితో చనిపోవద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసి ఉచిత బియ్యాన్ని అందిస్తోంది. తెలంగాణలో ఏకంగా 2 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నాం. ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేసి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశాం.
నన్ను తిట్టడమే వారి పని
తెలంగాణలో అధికారంలో ఉన్నవారు మోదీని, బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కొత్త తిట్లు వెతికి మరీ తిడుతున్నారు. ప్రజలకు మేలు జరుగుతుందంటే, ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయంటే.. బీజేపీని, నన్ను ఎన్ని తిట్లు తిట్టినా భరిస్తాం.. పెద్దగా పట్టించుకోబోం. కానీ తెలంగాణ ప్రజలను తిడితే.. వారికి అన్యాయం చేస్తే.. వారి కలలను, ఆశలను వమ్ముచేస్తే ఊరుకునేది లేదు. ఇతర పార్టీల నాయకులు తిట్టే తిట్లకు బీజేపీ కార్యకర్తలెవరూ నిరాశ పడొద్దు. ప్రజల సమస్యలు తీరుతాయంటే.. ప్రాంతం అభివృద్ధి జరుగుతుందంటే తిట్లు తిట్టినా పట్టించుకోకుండా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు కదలండి. ప్రతివార్డులో ప్రతి ఇంటి తలుపుతట్టండి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయో, లేదో తెలుసుకొండి. అందని వారికి లబ్ధి చేకూర్చే పనిలో నిమగ్నం కండి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment