సాక్షి, హైదరాబాద్: ‘సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఏకీకృత భారతావని (ఏక్‌భారత్)కి శ్రీకారం చుట్టారు. పటేల్ కృషి వల్లే నిరంకుశ, నియంతృత్వ పాలన నుంచి విముక్తి పొంది హైదరాబాద్ సంస్థానం (తెలంగాణ) భారత్‌లో విలీనమైంది. ప్రజలకు పటేల్ ఇచ్చిన బహుమతే భాగ్యనగరం. ఇప్పుడు ఉన్నతమైన, గొప్ప భారత్ (శ్రేష్ట్ భారత్)ను నిర్మించడం బీజేపీ ముందున్న చరిత్రాత్మక బాధ్యత. ఈ లక్ష్య సాధన కోసం పార్టీ కార్యకర్తలంతా సంయమనం, సమతౌల్యం, సమన్వయం వంటి లక్షణాలతో ముందుకు సాగాలి’అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా రెండ్రోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ముగింపు సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణతోపాటు కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులు చేస్తున్న కృషిని అభినందించారు. 2019 నుంచి తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, పార్టీ యంత్రాంగం కృషి ప్రతి విజయంలో కనిపించిందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించాలని పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ప్రధాని ప్రసంగ వివరాలను ఆ పార్టీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.
తృప్తి నుంచి సంతుష్టి దిశగా..
‘ఆకర్షణ రాజకీయాలతో ప్రజలను కేవలం తృప్తిపరిచే స్థాయి నుంచి వారిని పూర్తిగా సంతుష్టులను చేసే స్థాయికి దేశాన్ని తీసుకెళ్లడమే బీజేపీ లక్ష్యం కావాలి. ఇది అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి (సబ్ కా వికాస్)కి దోహదపడుతుంది. సమాజంలోని ప్రజలందరి ప్రేమానురాగాలు పొందేందుకు కార్యకర్తలు ‘స్నేహయాత్ర’చేపట్టాలి. రాజకీయ, పాలనా వ్యవహారాల్లో ప్రజానుకూల, సుపరిపాలన (పీ2–జీ2) విధానాలు అవలంబించాలి’అని మోదీ బీజేపీ శ్రేణులకు సూచించారు.
వారి నుంచి పాఠం నేర్చుకోవాలి..
‘సుదీర్ఘకాలం పాలించిన పార్టీలు ఇప్పుడు నిష్క్రమణ దారిలో ఉన్నాయి. ఉనికి కోసం పోరాడుతున్నాయి. వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు. ఆయా పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. అలాంటి పార్టీలను చూసి కార్యకర్తలు అవహేళన చేయొద్దు. ఆ పార్టీల వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకోవాలి. నిరంతరం ప్రజలతో మమేకం కావాలి’అని మోదీ పిలుపునిచ్చారు.
అదే మా సిద్ధాంతం...
‘దేశంలోని మంచి అంతా భారతీయులందరికీ చెందుతుందనే సిద్ధాంతాన్ని బీజేపీ నమ్ముతుంది. అందుకే సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కాంగ్రెస్ నేత అయినప్పటికీ ఆయనకు నివాళిగా అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అలాగే మాజీ ప్రధానులకు నివాళిగా ఒక మ్యూజియం నెలకొల్పాం. పార్టీలకు అతీతంగా ఈ పనులన్నీ చేశాం. ప్రజాస్వామ్య పాలనపై మాకున్న చిత్తశుద్ధి వల్లే ఇది సాధ్యమైంది’అని మోదీ వివరించారు.
‘ద్రౌపది ముర్ము’కు ఓటులో పొరపాట్లు వద్దు...
‘కేంద్రం, బీజేపీపాలిత రాష్ట్రాలు మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నాయి. అందుకే మహిళలు అన్ని ఎన్నికల్లో పార్టీకి అండగా నిలుస్తున్నారు. మహిళా సంక్షేమం విషయంలో ఈ విధానాన్ని ఇకపైనా కొనసాగించాలి. ఆదివాసీ మహిళ, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎంతో సాధారణ స్థాయి నుంచి దేశ అత్యున్నత పదవిని అధిష్టించే స్థాయికి ఎదిగారు. ఆమెకు ఓటు వేసే క్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలాంటి పొరబాట్లకు తావివొద్దు. ఓటు వేసే క్రమంలో చేసే చిన్న పొరబాటు కూడా ఓటు అనర్హతకు దారితీస్తుంది’అని మోదీ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment