Hyderabad: PM Narendra Modi Speech At BJP Vijay Sankalp Sabha Parade Grounds Full Details In Telugu - Sakshi
Sakshi News home page

PM Modi HYD Tour: డబుల్‌ ఇంజనే

Published Mon, Jul 4 2022 1:31 AM | Last Updated on Mon, Jul 4 2022 4:08 PM

PM Narendra Modi Speech At BJP Vijay Sankalpa Sabha Pared Grounds - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మంచి మద్దతు ఇచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఝలక్‌ చూశాం. బీజేపీకి అద్భుత విజయం లభించింది. దేశంలో డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఉన్న ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధిని చూస్తున్నాం. ప్రజలే దేవుళ్లు. తెలంగాణలో బీజేపీ డబుల్‌ ఇంజన్‌ సర్కారు కోసం వారే స్వయంగా పట్టాలు వేస్తున్నారు’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ నలువైపులా అభివృద్ధి సాధించడం బీజేపీ ప్రాథమిక ప్రాధాన్యతల్లో ఒకటని చెప్పారు.

‘సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌.. సబ్‌కా ప్రయాస్‌’ నినాదంతో పనిచేస్తూ తెలంగాణ అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ.. మోదీ.. అంటూ యువత నినాదాలు చేసినప్పుడు.. ఇక్కడి యువతలో ఉత్సాహం కనిపిస్తోందని, వారు చూపుతున్న ప్రేమ, ఉత్సాహాన్ని యావత్‌ దేశం గమనిస్తోందని పేర్కొన్నారు. యువతకు కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని ఎక్కడా టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్‌ పేర్లను ప్రస్తావించలేదు. రాజకీయ విమర్శలేమీ చేయకుండా.. కేవలం కేంద్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను, రాష్ట్రానికి చేస్తున్న సాయం గురించి మాత్రమే ప్రస్తావించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ప్రధాని మోదీ మాటల్లోనే.. 

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో వేగంగా అభివృద్ధి 
దేశ ఆత్మ నిర్భరత, ఆత్మ విశ్వాసానికి హైదరాబాద్‌ ముఖ్య కేంద్రం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, యువత వద్ద దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే సామర్థ్యం ఉంది. ఇక్కడ ఎన్నో ప్రకృతి వనరులు ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వస్తే.. ఇక్కడి పట్టణాల, పల్లెల అభివృద్ధి కోసం మరింత వేగంగా కార్యక్రమాలు జరుగుతాయి. సానుకూల వైఖరితో ప్రతీ ఒక్కరిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ.. తెలంగాణను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తాం. అందరి ప్రయత్నాలతో తెలంగాణను కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలుగుతాం. 


హైదరాబాద్‌లా మేము కూడా.. 
యావత్‌ తెలంగాణలోని స్నేహభావమంతా ఈ మైదానంలో ఇమిడిపోయినట్టు ఉంది. ఇక్కడి నేలకు వందనం చేస్తున్నా. మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరపాలని నిర్ణయించాం. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన బీజేపీ ప్రతినిధుల పట్ల మీరు చూపిన ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు. హైదరాబాద్‌ నగరం ఎలాగైతే అన్నిరకాల నైపుణ్యాలకు కొత్త రెక్కలు తొడుగుతోందో.. బీజేపీ సైతం దేశ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతోంది. 
 
బీజేపీపైనే ఆశలు, ఆకాంక్షలు 
గత ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడి జీవితంలో సకారాత్మక మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాం. దేశ వాసులు మంచి జీవితం గడిపేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. కేంద్ర పథకాల ద్వారా బడుగు, బలహీన, పీడితవర్గాలను అభివృద్ధిలో భాగస్వాములను చేశాం. అందుకే బీజేపీ మాత్రమే తమ ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తుందని పేదలు, దళితులు, గిరిజనులు, పీడితులు, వెనకబడిన వర్గాల వారు భావిస్తున్నారు. 


 రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రయోజనం కల్పించాం 
రాష్ట్రంలోని ప్రతి దళిత, గిరిజన, వెనకబడిన వర్గాల కుటుంబానికి బీజేపీ ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు దక్కాయి. కరోనా మహమ్మారి కాలంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సాయం అందేలా చూశాం. రాష్ట్రంలో కోట్ల మందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్లు ఇచ్చాం. పేదలకు ఉచితంగా రేషన్‌ అందించాం. ఎలాంటి వివక్ష లేకుండా ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఇదే సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌. 

మహిళల జీవితాల్లో మార్పు తెచ్చాం 
పెద్ద సంఖ్యలో తల్లులు, సోదరీమణులు ఆశీర్వదించడానికి వచ్చారు. మేం మహిళల జీవితాలు, ఆరోగ్యం బాగు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చాం. స్వచ్ఛ భారత్‌తో తెలంగాణలోని లక్షల మంది మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ఉజ్వల యోజన కింద ఉచిత వంట గ్యాస్‌ కనెక్షన్‌ పొంది లక్షల మంది మహిళలు పొగబారి నుంచి విముక్తి పొందారు. మహిళల కోసం రాష్ట్రంలోని పల్లెపల్లెకు పౌష్టికాహారం, టీకాలను చేరవేశాం. కేంద్ర ప్రభుత్వ చర్యలతో మహిళల ఆరోగ్యం మెరుగైంది. వారి జీవితాల్లో కష్టాలు తగ్గాయి. జీవన ప్రమాణాలు, ఆత్మ విశ్వాసం పెరిగాయి.

దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాం. నారీ శక్తిని 21వ శతాబ్దపు దేశ శక్తిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. బ్యాంకు డిపాజిట్లలో మహిళల వాటా పెరుగుతోందని ఓ నివేదిక ఉంది. అందులో గ్రామీణ మహిళల వాటా మరింత ఎక్కువగా ఉంది. సంపదలో, కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగింది. మహిళలను బ్యాంకింగ్‌ వ్యవస్థతో అనుసంధానం చేయడమే దీనికి కారణం. జన్‌ధన్‌ యోజన కింద దేశంలో 45 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిస్తే.. తెలంగాణలో కోటికి పైగా తెరిచాం. వీటిలో 55శాతానికి పైగా మహిళలవే. ముద్రా రుణాల్లో మూడింట రెండు వంతులు మహిళలకే ఇచ్చాం. స్టాండప్‌ ఇండియా రుణాల్లో 80శాతం మహిళలకు ఇచ్చాం. 


 హైదరాబాద్‌లో ఆధునిక సైన్స్‌ సిటీ ఏర్పాటు 
పరిశోధన, ఇన్నోవేషన్‌ రంగాల్లో తెలంగాణ భారతదేశానికి కేంద్రంగా ఉంది. కరోనా సమయంలో వాక్సిన్లు మొదలుకుని నిత్యావసర వస్తువుల వరకు ఇక్కడ జరిగిన కార్యక్రమాలు ప్రపంచంలో ఎంతో మందికి ప్రయోజనం కలిగించాయి. రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం పెంపొందించేందుకే గడిచిన ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లో ఆధునిక సైన్స్‌ సిటీ ఏర్పాటుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కొంతకాలం క్రితం నేషనల్‌ యానిమల్‌ రిసోర్స్‌ సిటీ, బయోమెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వంటి ఆధునిక పరిశోధన కేంద్రాలు హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయి.

మా ప్రభుత్వం కేవలం టెక్నాలజీ, ఆవిష్కరణల వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే కాదు.. పేద గ్రామీణ కుటుంబాలకు చెందిన పిల్లల ప్రతిభను కూడా ప్రోత్సహిస్తోంది. నూతన రాష్ట్రీయ శిక్షా నిధిలో భాగంగా స్థానిక భాషలో చదువును ప్రోత్సహిస్తున్నాం. తెలుగులో సాంకేతిక, వైద్య విద్య అందుబాటులోకి వస్తే తెలంగాణలోని గ్రామీణ కుటుంబాల తల్లుల కలలు నెరవేరుతాయి. ఆత్మ నిర్భర్‌ భారత్‌ కోసం అవసరమైన నైపుణ్యమున్న మానవ వనరులు అందుబాటులోకి వస్తాయి. 
 
రూ.35 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు 
ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకంలో భాగంగా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరిస్తున్నాం. ఇందుకోసం రూ.6,500 కోట్లు వెచ్చించాం. ఇప్పటికే ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభంకాగా త్వరలో జాతికి అంకితం చేయబోతున్నాం. తెలంగాణ రైతులు, దేశ ప్రజలకు దీనితో ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. రైతుల జీవనాధారమైన వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో రూ.35వేల కోట్లతో ఐదు పెద్ద సాగునీటి ప్రాజెక్టులు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత ఆరేళ్లలో కేంద్రం తెలంగాణ రైతుల నుంచి లక్ష కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసి, డబ్బులు చెల్లించింది. ధాన్యానికి కనీస మద్దతు ధరను రూ.80 మేర పెంచింది. 
 
హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్‌ కారిడార్లు 
హైదరాబాద్‌లో మెరుగైన రవాణా కోసం రూ.1,500 కోట్లతో ఆరు లేన్లతో కూడిన నాలుగు ఫైఓవర్లు, ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మిస్తున్నాం. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో రవాణా, ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 350 కిలోమీటర్ల పొడవైన రీజినల్‌ రింగు రోడ్డు నిర్మించబోతోంది. తెలంగాణలోని మారుమూల ప్రాంతాలను కూడా రోడ్ల ద్వారా అనుసంధానించే లక్ష్యంతో పనిచేస్తున్నాం.

2014 నాటికి తెలంగాణలో 2,500 కిలోమీటర్లలోపే జాతీయ రహదారులు ఉండగా.. గత ఎనిమిదేళ్లలో అది రెట్టింపై 5 వేల కిలోమీటర్ల హైవే నెట్‌వర్క్‌ ఏర్పడింది. రాష్ట్రంలోని పట్టణాలతోపాటు పల్లెలను కూడా జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తూ 2,700 కిలోమీటర్ల రోడ్లు నిర్మించాం. పీఎం గ్రామసడక్‌ యోజన మూడో విడత కింద 2,500 కిలోమీటర్ల కొత్త రోడ్ల కోసం రూ.1,700 కోట్లు కేటాయించాం. రైల్వేలోనూ ఎనిమిదేళ్లలో తెలంగాణ కోసం రూ.31వేల కోట్ల పనులు ప్రారంభించాం. 180 కిలోమీటర్లకుపైగా కొత్త రైల్వే లైన్లు నిర్మించాం. ఆత్మ నిర్భరత విషయానికి వస్తే ‘5ఎఫ్‌’లో భాగంగా ‘ఫార్మ్‌ టు ఫైబర్, ఫైబర్‌ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్‌ టు పరేడ్‌’ గురించి మాట్లాడుతున్నాం. దేశం నుంచి వస్త్రాల ఎగుమతి పెంచేందుకు కొత్తగా ఏడు కొత్త మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రైతులు, కూలీలు, వ్యాపారులకు ప్రయోజనం కలిగేలా తెలంగాణలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement