BJP Vijay Sankalp Sabha
-
కేసీఆర్ పేరెత్తకుండా పై ఎత్తు.. మోదీ వ్యూహమిదేనా..?
హైదరాబాద్‌లో జరిగిన విజయ్ సంకల్ప సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించిన తీరు ఎలా ఉంది? ఒక జాతీయ పార్టీ నేత, దేశ ప్రధాని కేవలం ఒక ప్రాంత విషయాలకే పరిమితమై మాట్లాడటంలో మతలబు ఏమిటి? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక డిక్లరేషన్ ఇవ్వడం దేనికి సంకేతం? తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న దృఢ సంకల్పంతో బీజేపీ ఉంది. కానీ, ఎక్కడా కేసీఆర్ పేరెత్తకుండా మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తెలంగాణలో అధికారంలోకి రాగలిగితే సరేసరి. రాలేకపోయినా, ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్నది బీజేపీ ప్రయత్నం. తద్వారా కాంగ్రెస్ స్థానాన్ని పొంది, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేలా ఎత్తుగడలు వేస్తోంది. జాతీయ నేత అయిన మోదీ ప్రాంతీయ ఉపన్యాసం చేస్తే, ప్రాంతీయ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జాతీయ స్థాయి ఉపన్యాసం చేయడం గమనించవలసిన అంశం. ఇద్దరికీ వేర్వేరు లక్ష్యాలు ఉన్నాయి. మోదీ బహిరంగ సభకు ముందు రోజే కేసీఆర్ రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్‌కు రప్పించి మొత్తం సీన్ అంతా బీజేపీ వైపే వెళ్లకుండా తన వాటా తాను పొందేలా యత్నించారు. అంతవరకూ కొంత సఫలం అయ్యారని చెప్పవచ్చు. ఆ సందర్భంగా ఆయన అనేక జాతీయ, అంతర్జాతీయ ప్రశ్నలు లేవ నెత్తారు. శ్రీలంకలో మోదీపై వచ్చిన ఆరోపణలు మొదలు, అమెరికాలో ట్రంప్ కోసం మోదీ ప్రచారం చేశారన్న విషయాల వరకూ; నల్లధనం తెచ్చి భారతీయులకు పంచుతానన్న హామీ నుంచి, రూపాయి విలువ పతనం అయిన తీరు వరకూ పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే మార్గదర్శకం అంటూ వివిధ శాఖలలో జరుగుతున్న ప్రగతిని వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. ఇది కూడా వ్యూహాత్మకమైనదే. గతంలో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే తన రాష్ట్ర ప్రగతి వివరిస్తూ, భారీ ప్రచారం నిర్వహించేవారు. అది బాగా సఫలం అయి, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకూ, తద్వారా తనకు ప్రధాని పదవి దక్కడానికీ ఉపయోగపడింది. బీజేపీకి దేశ వ్యాప్తంగా బలం, బలగం ఉన్నాయి. టీఆర్ఎస్కు అంతటి పరిస్థితి లేదు. కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పేరుతో పార్టీ పెట్టాలని అనుకున్నా, కొంత వెనుకడుగు వేయక తప్పలేదు. అంతకుముందు ఫెడరల్ ఫ్రంట్ అని హడావుడి చేసినా అదీ సఫలం కాలేదు. ఇప్పుడు జాతీయ రాజకీయాల గురించి గట్టిగా మాట్లాడినా, కేసీఆర్ తక్షణ లక్ష్యం వచ్చే శాసనసభ ఎన్నికలన్నది తెలియనిది కాదు. అలాగే కేసీఆర్ చేసిన విమర్శలకు మోదీ ఎక్కడా జవాబు ఇవ్వకపోవడం కూడా ఇలాంటిదే. ఆయన కేవలం తెలంగాణ గురించి మాట్లాడి తాను ఈ రాష్ట్రానికి చాలా చేస్తున్నాననీ, బీజేపీకి అధికారం ఇస్తే డబుల్ ఇంజన్‌లా పనిచేసి మరింత అభివృద్ధి సాధిస్తామనీ చెప్పారు. కేసీఆర్ చేసిన జాతీయ, అంతర్జాతీయ విమర్శలకు సమాధానం ఇస్తే, వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందనీ, ఒక ప్రాంతీయ పార్టీ వ్యాఖ్యలను అంత సీరియస్‌గా తీసుకుని ప్రధాని స్థాయిలో స్పందించనవసరం లేదనీ మోదీ భావించి ఉండాలి. పైగా కేసీఆర్‌కు దేశ వ్యాప్త ప్రచారం రావడానికి తాను ఎందుకు దోహదపడాలని అనుకున్నట్లుగా ఉంది. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రం కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించి, వచ్చేది తమ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ డిక్లరేషన్‌లో కూడా టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. విజయ్ సంకల్ప్ సభకు జనం ఏ మాత్రం వచ్చారన్నదానిపై రకరకాల అంచనాలు ఉన్నా, రెండు లక్షల మంది వచ్చినా అది విజయవంతం అయినట్లే లెక్క. అంతేకాక ప్రధానితో సహా ఆయా వక్తలు మాట్లాడుతున్నప్పుడు వచ్చిన స్పందన కూడా బాగానే ఉంది. వచ్చిన ప్రజానీకాన్ని చూసి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అందరికీ తెలిసేలా మోదీ అభినందించారు. బీజేపీ తెలంగాణ శాఖ నిజానికి ఇంకా అంత బలం పుంజుకోకపోయినా, ఈ సభను విజయవంతం చేయడం విశేషమే అని చెప్పాలి. కేసీఆర్ పేరు చెప్పి, తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేస్తే బీజేపీలో మరింత ఉత్సాహం వచ్చి ఉండేదేమో! అమిత్ షా, నడ్డా, పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి వంటి కేంద్ర మంత్రులు ఎన్ని విమర్శలు చేసినా, మోదీ మాట్లాడకపోతే అంత ఊపు రాదు. కానీ మోదీ వ్యూహాత్మకంగానే ఇలా చేశారని అనుకోవాలి. పైగా రాజకీయ ప్రత్యర్థులపై ఏమీ మాట్లాడలేదంటే, భవిష్యత్తులో సీరియస్ పరిణామాలు ఉండవచ్చు. తీవ్ర విమర్శలు చేసి, తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వంపై చర్యలకు అడుగులు వేస్తే, రాజకీయంగా ఇబ్బంది రావచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం తెలంగాణ వ్యవహారాలపై బాగానే దృష్టి పెట్టింది. ఆర్బీఐ నుంచి అప్పు పొందే విషయంలో కూడా యక్ష ప్రశ్నలు వేయడమే ఇందుకు ఉదాహరణ. మోదీ హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరావు కంపెనీకి చెందిన ఆస్తులు జప్తు చేయడం కాకతాళీ యమా, కాదా అన్నది అప్పుడే చెప్పలేకపోయినా, ఏదో బలమైన సంకేతంగానే ఎక్కువ మంది తీసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు ముందు పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి ఆకర్షించడం ఒక ఎత్తు అయితే, వారిలో కొంతమంది అంతకుముందు సీబీఐ కేసులు, విచారణలు ఎదుర్కో వడం గమనార్హం. వారు బీజేపీలో చేరితేగానీ సేఫ్ కాలేమన్న భావనకు వచ్చారు. శారదా చిట్‌ఫండ్ స్కామ్, నారదా స్టింగ్ ఆపరేషన్ వంటి వాటిలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు పలు సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ వీటన్నిటినీ తట్టుకుని బెంగాల్ గౌరవాన్ని ముందుకు తెచ్చి మరోసారి అధికారంలోకి రాగలిగారు. గుజరాతీయులైన మోదీ, అమిత్ షా పెత్తనం బెంగాల్ పైనా అంటూ ఆమె చేసిన ప్రచారం బాగానే పని చేసింది. అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవలి కాలంలో ప్రతిదానికీ గుజరాత్‌ను తెరపైకి తెస్తూ, రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని చెబుతోంది. టీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ గుజరాత్‌కు కేంద్రం ఇస్తున్న నిధులు, గిఫ్ట్ సిటీ, ఆర్బిట్రేషన్ సెంటర్ అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేయడం వంటివి ఉదాహరిస్తూ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే యత్నానికి శ్రీకారం చుట్టినట్లుగా ఉంది. ఈ వ్యూహం ఫలిస్తే టీఆర్ఎస్ మరోసారి గెలవడం తేలికవుతుందని వారు అంచనా వేస్తుండవచ్చు. మరోవైపు బీజేపీ త్రిపుర మోడల్ ప్రయోగానికి వెళుతుందా అన్న అనుమానం కలుగుతోంది. త్రిపురలో ఒకప్పుడు బీజేపీ జాడే లేదు. కానీ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అంతటినీ ఖాళీచేయించి బీజేపీలో కలుపుకొన్నారు. తద్వారా అక్కడి అధికార పక్షం సీపీఎంను ఓడించగలిగారు. తెలంగాణలో కూడా అలాంటి ఆలోచన ఏమైనా చేస్తుందా అన్న సందేహం కలుగుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో గెలిచినా, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో గణనీయంగా ఫలితాలు సాధించినా, తెలంగాణ అంతటా క్షేత్ర స్థాయిలో బీజేపీకి కార్యకర్తలు అంతగా లేరన్నది వాస్తవం. దానిని తీర్చుకోవాలంటే అయితే టీఆర్ఎస్, లేదా కాంగ్రెస్‌ల నుంచి కొందరు ముఖ్యమైన నేతలను ఆకర్షించవలసి ఉంటుంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరడం కూడా ఇందుకు ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. కాంగ్రెస్‌కు క్షేత్ర స్థాయిలో కొంత బలం ఉన్నా, అంతర్గత పోరుతో బాగా ఇబ్బంది పడుతోంది. టీఆర్ఎస్ను మోదీ ఒక్క మాట అనకపోవడాన్ని మ్యాచ్ ఫిక్సింగ్‌గా కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తోంది. ఒకవేళ టీఆర్ఎస్పై ప్రజలలో వ్యతిరేకత ఉంటే, కాంగ్రెస్ అయితేనే దాన్ని ఓడించగలుగుతుందని నమ్మకం కుదిరితే తప్ప, ఆ పార్టీకి విజయా వకాశాలు ఉండవు. ఆ దిశలో కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తోంది. మొత్తం మీద కేసీఆర్ ప్రస్తావన తేకుండా, కాంగ్రెస్ గురించి విమర్శలు చేయకుండా మోదీ వారికి ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్తపడితే, మోదీపై కేసీఆర్ విమర్శలు చేసి జాతీయ ప్రాముఖ్యత పొందడానికి ప్రయత్నించారు. వీరిద్దరిలో ఎవరు సఫలం అవుతారన్నది వచ్చే ఎన్నికలలో తేలుతుంది. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
బీజేపీ షోని డైవర్ట్ చేయడంలో కేసీఆర్ సఫలమేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణరాష్ట్ర సమితి అధినేత కే.చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్ర మోదీపై యుద్దభేరీ మోగించారు. ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఇంతగా మోదీని తూర్పారపట్టలేదు. తెలంగాణ మొదలు, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కేసిఆర్ పలు ప్రశ్నలు సంధించి, మోదీ హయాంలో దేశం పరువు పోతోందని రుజువు చేసే యత్నం చేశారు. చదవండి: ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన ప్రధాని మోదీ! 'వెల్డన్' బండి సంజయ్ కేసీఆర్ తమ ప్రభుత్వం జోలికి వస్తే కేంద్రంలోని ప్రభుత్వాన్నే కూల్చుతామన్న ప్రకటన కొంత అతిశయోక్తిగానే ఉన్నా, కేసిఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ సమాధానం ఇవ్వవలసి ఉంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్‌కు సమాధానం ఇచ్చే యత్నం చేసినా, ప్రత్యారోపణలే చేశారు తప్ప, మోదీపై ఆరోపణలకు ఆయన సమాధానం ఇచ్చినట్లు కనిపించదు. కాకపోతే ఉఫ్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఊడిపోతుందని, దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణ రాజకీయ తెరపైన టీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా తలపడడానికి ఈ సమయాన్ని ఎంచుకోవడం ఆసక్తికరంగానే ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ హైదరాబాద్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఏర్పాటు చేస్తే, దానికి పోటీగా రాష్ట్రపతి విపక్ష అభ్యర్ది యశ్వంత్ సిన్హాను టీఆర్ఎస్ వ్యూహాత్మంగా హైదరాబాద్ రప్పించింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బీజేపీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఘన స్వాగతం చెబుతూ తీసుకు రాగా, యశ్వంత్ సిన్హాకు స్వయంగా కేసీఆర్ స్వాగతం చెప్పడమే కాకుండా, పదివేల బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి వస్తే, కేసీఆర్ వెళ్లకుండా ప్రోటోకాల్ మంత్రిగా తలసాని శ్రీనివాస యాదవ్‌ను పంపించారు. గత కొన్ని నెలలుగా మోదీ, కేసీఆర్‌ల మధ్య సాగుతున్న ప్రత్యక్ష, పరోక్ష యుద్దాలకు మరోసారి హైదరాబాద్ వేదిక అయింది. బీజేపీ వారు కేసీఆర్‌కు వ్యతిరేకంగా సాలు దొర అంటూ టైమ్ బోర్డు ఏర్పాటు చేస్తే, టీఆర్ఎస్ పేరున కాకపోయినా, సాలు మోదీ, సంపకు మోదీ అంటూ కొందరు బోర్డులు ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి నగరం అంతా ఆ పార్టీ జెండాలు, తోరణాలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తే, వాటికి పోటీగా టీఆర్ఎస్ ప్రభుత్వం తన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెట్రో పిల్లర్లపైన, మీడియాలోను పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కొన్ని చోట్ల మెట్రో పిల్లర్ల ప్రచారం వివాదం అయింది. కొందరు బిజెపి కార్యకర్తలు టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రచార ప్రకటనలపైనే మోడీకి స్వాగతం చెబుతూ విజయ్ సంకల్ప సభకు సంబంధించిన పోస్టర్లు అతికించారు. మధ్యలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద బీజేపీ, టిఆర్ఎస్ లు జెండాలు కడితే, కాంగ్రెస్ వారు వచ్చి అభ్యంతరం తెలిపారు. అంతా సందడిగా కనిపిస్తున్నా, వీరంతా వచ్చే శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆడుతున్న గేమ్ అని అర్థం చేసుకోవడం కష్టం కాదు. బీజేపీ సమావేశాలు పూర్తిగా హైలైట్ అవ్వకుండా, ప్రజల దృష్టి అంతా బీజేపీ వైపు వెళ్లకుండా చేయడంలో కేసీఆర్ కొంతమేర సఫలం అయ్యారు. ఎందుకంటే అన్ని మీడియాలలో బీజేపీ సమావేశాలతో పాటు, కేసిఆర్ ప్రసంగాన్ని కూడా ప్రముఖంగా కవర్ చేయక తప్పలేదు. సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ ఇలాంటి సమావేశాలు జరుపుకుంటుంటే, ఆ పార్టీకి సంబంధించిన వార్తలే అత్యధికంగా వస్తుంటాయి. కాని ఈసారి దానిని నిలువరించి, తన వంతు వాటాను కేసీఆర్ పొందగలిగారు. ఆయన మాట్లాడిన విషయాలు చూస్తే మోదీని ఢీకొట్టగల మగాడు కేసీఆర్ అని ప్రజలు భావించేలా కేసీఆర్ మాట్లాడగలిగారు. నిజానికి కేసీఆర్‌కు అంత బలం ఇంకా రాలేదు. ఆయనకు ఉన్న ఎమ్మెల్యేల బలం, ఎంపీల బలం బీజేపీ ముందు ఎందుకూ కొరవడదు. రాష్ట్రపతి ఎన్నికలలో వీరి ఓట్లు కొద్దిగా ఉపయోగమే తప్ప, సిన్హాను గెలిపించే స్థాయిలో ఉండవు. అయితే యశ్వంత్ సిన్హా తన స్పీచ్‌లో కేసీఆర్‌ను ప్రశంసిస్తూ, దేశానికి ఇలాంటి నేతలు అవసరం అని చెప్పారు. ఆ రకంగా జాతీయ స్థాయిలో కేసీఆర్ ఫోకస్ అవడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఆయన తీసుకున్నారని చెప్పవచ్చు. నిజానికి కేసీఆర్ తక్షణ లక్ష్యం జాతీయ రాజకీయాలు కాదు.. వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. వాటిని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ తన గేమ్ తాను ఆడుతున్నారు. ఈ మధ్యకాలంలో బీజేపీ తెలంగాణలో పుంజుకోవడానికి చేస్తున్న యత్నాలను ఆయన తగ్గించేలా వ్యవహరించారు. ఒక దశలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుదలను ఆయన కోరుకున్నా, భవిష్యత్తులో అది మరీ పెరిగిపోకుండాను, అలాగే బీజేపీని,మోదీని ఎదిరించే ధీరుడుగా తన ఇమేజీ పెంచుకోవడానికి కేసీఆర్ ఈ అవకాశాన్ని వాడుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం అనుసరించిన అంతర్జాతీయ విధానాలను కూడా ఎత్తిచూపారు. శ్రీలంకలో అదాని విద్యుత్ ప్రాజెక్టు విషయంలో మోదీపై వచ్చిన ఆరోపణలు మొదలు, అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి ఆ దేశంలో మోదీ, హౌడీ అంటూ సభలు జరపడం వరకు కేసీఆర్ ప్రస్తావించి దేశం పరువు తీశారని అన్నారు. అమెరికా వెళ్లి ట్రంప్ కోసం ప్రచారం చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. గతంలో మోదీ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వంపై చేసిన విమర్శలను గుర్తు చూస్తూ, రూపాయి విలువ ఇప్పుడు ఎందుకు పడిపోయిందని అడగడం ఆసక్తికర విషయమే. నిజంగానే అప్పట్లో మోదీ రూపాయి విలువ పతనంపై తీవ్రంగా విమర్శలు కురిపించారు. కానీ ఇప్పుడు అంతకన్నా ఘోరంగా రూపాయి విలువ తగ్గిపోయింది. దీనికి మోదీ సమాధానం ఇస్తారా అన్నది సంశయమే. జాతీయ స్థాయిలో తొమ్మిది ప్రభుత్వాలను బీజేపీ కూల్చిందని కేసీఆర్ వివరించారు. తాజాగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తీరును ఆయన ఆక్షేపించారు. ఈ విషయంలో కేసీఆర్ కూడా విమర్శలకు గురికాక తప్పదు. గత ఎన్నికలలో వేరే పార్టీల నుంచి గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనం చేసుకున్న తీరు కూడా సమర్దించదగినది కాదు. నోట్ల రద్దు వంటి విషయాలను కూడా కేసీఆర్ చెప్పినా, అప్పట్లో ఈయన కూడా వాటికి మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రజలు మర్చిపోరు కదా. ఇక బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలకు నేరుగా సమాధానం ఇవ్వలేదు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ దమ్ముంటే కేంద్రంలోని తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని సవాల్ చేశారు. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉఫ్ అంటే పడిపోతుందని అన్నారు. అంటే వచ్చే ఎన్నికల వరకు బీజేపీ ఆగుతుందా?లేక ఈలోగానే ఏమైనా చేస్తుందా అన్న సందేహానికి ఆస్కారం ఇచ్చారు. కానీ ఇప్పటికిప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏమీ చేయలేరు. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ ఏమీ చేయలేదు. ఈ రెండు పార్టీలు వాదోపవాదాలు చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ పానకంలో పుడకలా మరోసారి తమ గొడవలతో రచ్చకెక్కింది. యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాకను పురస్కరించుకుని కాంగ్రెస్ వారు ఎవరూ స్వాగతానికి వెళ్లరాదని, అదంతా టీఆర్ఎస్ కార్యక్రమంగా సాగుతున్నందున దాని జోలికి పోరాదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కానీ సీనియర్ నేత వి.హనుమంతరావు వాటిని పట్టించుకోకుండా వెళ్లి సిన్హాకు టీఆర్ఎస్ వారితో కలిసి స్వాగతం చెప్పారు. దానిపై రేవంత్ మండిపడి, పార్టీ నిర్ణయాలను దిక్కరిస్తే బండకేసి కొడతానని హెచ్చరించారు. దీనిపై మరో నేత జగ్గారెడ్డి స్పందిస్తూ రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ పక్కన కేటిఆర్ ఉండగా లేని తప్పు వి.హెచ్ స్వాగతం పలికితే వచ్చిందా అన్న మౌలిక ప్రశ్నను లేవనెత్తారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లకు ఇలాంటి సమస్యలు తప్పవు. మొత్తం మీద కేసీఆర్ వ్యూహాత్మకంగా తెలంగాణ రాజకీయం తన చుట్టూరానే తిరిగేలా చేసుకోవడం వరకు సఫలం అయ్యారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య టీఆర్ఎస్ సునాయాసంగా గెలవడానికి ఆయన అమలు చేస్తున్న వ్యూహాలలో భాగంగానే ఈ హడావుడి జరిగినట్లు అనిపిస్తుంది. మొత్తం మీద షో మొత్తం బీజేపిది కాకుండా, టీఆర్ఎస్ వైపు కూడా మీడియా, ప్రజలు చూసేలా చేయడం వరకు కేసిఆర్ సక్సెస్ అయినట్లే. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
సాక్షి కార్టూన్ 04-07-2022
అంతమంది సభికుల్ని చూసిన సంతోషంలో మర్చిపోయారేమో!! -
ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన ప్రధాని మోదీ! 'వెల్డన్' బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: పరేడ్ గ్రౌండ్‌లోని విజయ సంకల్ప సభకు భారీగా తరలి వచ్చిన ప్రజానీకాన్ని చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి కాన్వాయ్‌లో వచ్చిన ప్రధాని.. వేదిక దగ్గర పుష్పాలతో అలంకరించిన ఓపెన్‌టాప్ వాహనంలో వస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం వేదికపైకి వచ్చాక హుషారుగా చేతులు ఊపుతూ సభికులను ఉత్సాహపరిచారు. పలుమార్లు ఆయన వంగి అభివాదం చేశారు. సభకు భారీ స్థాయిలో ప్రజలు హాజరుకావడాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి చూపిస్తూ.. వెల్డన్ అంటూ సంజయ్ భుజం తట్టి అభినందించారు. కేసీఆర్ గడీలు బద్దలు కొడదాం సీఎం కేసీఆర్ గడీలు బద్దలు కొట్టి.. తెలంగాణ తల్లికి విముక్తి కల్పిద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ ప్రజలకు ధైర్యం నింపడం, టీఆర్ఎస్ గూండాల నుంచి అనేక దాడులు, పోలీసుల తప్పుడు కేసులు, చార్జిషీట్లతో అగచాట్లు పడుతున్న పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపడానికే హైదరాబాద్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించామని చెప్పారు. అవినీతి, అక్రమాలు, కుటుంబపాలనతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కేసీఆర్‌ను చిత్తుగా ఓడించడానికే ఈ సమావేశాలని స్పష్టం చేశారు. విజయ సంకల్ప సభకు లక్షలాదిగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ఆదివారం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో బండి సంజయ్ ప్రసంగించారు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంతో ఆదరణ పొందిన మోదీని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన పార్టీ నాయకులు వ్యక్తిగతంగా విమర్శించడం ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పులిలాంటి మోదీని చూసి గుంటనక్కలు పారిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. మోదీ తన దేవుడని అన్నారు. మోదీ గురించి దద్దమ్మలు, మూర్ఖులైన సీఎం, ఆ పార్టీ నాయకులకు ఏమి అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ‘మీరు మోదీని ఎందుకు తిడుతున్నారు. 200 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినందుకా? దేశ ప్రజలకు 28 నెలలుగా ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకా..? యుద్ధ సంక్షుభిత ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించినందుకా..?’అని ప్రశ్నించారు. కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అని నిలదీశారు. కేంద్రం కోట్లాది నిధులిస్తున్నా.. కేసీఆర్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నా.. ఈ ప్రభుత్వం మోదీని వ్యతిరేకిస్తూ.. కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసీ. ఒక్కొక్కరిపై రూ.1.20 లక్షల అప్పు మోపిన కేసీఆర్‌ను గద్దె దించాల్సిందేనని అన్నారు. -
PM Modi HYD Tour: డబుల్ ఇంజనే
సాక్షి, హైదరాబాద్: ‘‘బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మంచి మద్దతు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఝలక్ చూశాం. బీజేపీకి అద్భుత విజయం లభించింది. దేశంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధిని చూస్తున్నాం. ప్రజలే దేవుళ్లు. తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు కోసం వారే స్వయంగా పట్టాలు వేస్తున్నారు’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ నలువైపులా అభివృద్ధి సాధించడం బీజేపీ ప్రాథమిక ప్రాధాన్యతల్లో ఒకటని చెప్పారు. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్.. సబ్కా విశ్వాస్.. సబ్కా ప్రయాస్’ నినాదంతో పనిచేస్తూ తెలంగాణ అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ.. మోదీ.. అంటూ యువత నినాదాలు చేసినప్పుడు.. ఇక్కడి యువతలో ఉత్సాహం కనిపిస్తోందని, వారు చూపుతున్న ప్రేమ, ఉత్సాహాన్ని యావత్ దేశం గమనిస్తోందని పేర్కొన్నారు. యువతకు కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని ఎక్కడా టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పేర్లను ప్రస్తావించలేదు. రాజకీయ విమర్శలేమీ చేయకుండా.. కేవలం కేంద్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను, రాష్ట్రానికి చేస్తున్న సాయం గురించి మాత్రమే ప్రస్తావించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ప్రధాని మోదీ మాటల్లోనే.. డబుల్ ఇంజన్ సర్కార్‌తో వేగంగా అభివృద్ధి దేశ ఆత్మ నిర్భరత, ఆత్మ విశ్వాసానికి హైదరాబాద్ ముఖ్య కేంద్రం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, యువత వద్ద దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే సామర్థ్యం ఉంది. ఇక్కడ ఎన్నో ప్రకృతి వనరులు ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే.. ఇక్కడి పట్టణాల, పల్లెల అభివృద్ధి కోసం మరింత వేగంగా కార్యక్రమాలు జరుగుతాయి. సానుకూల వైఖరితో ప్రతీ ఒక్కరిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ.. తెలంగాణను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తాం. అందరి ప్రయత్నాలతో తెలంగాణను కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలుగుతాం. హైదరాబాద్‌లా మేము కూడా.. యావత్ తెలంగాణలోని స్నేహభావమంతా ఈ మైదానంలో ఇమిడిపోయినట్టు ఉంది. ఇక్కడి నేలకు వందనం చేస్తున్నా. మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరపాలని నిర్ణయించాం. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన బీజేపీ ప్రతినిధుల పట్ల మీరు చూపిన ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు. హైదరాబాద్ నగరం ఎలాగైతే అన్నిరకాల నైపుణ్యాలకు కొత్త రెక్కలు తొడుగుతోందో.. బీజేపీ సైతం దేశ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతోంది. బీజేపీపైనే ఆశలు, ఆకాంక్షలు గత ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడి జీవితంలో సకారాత్మక మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాం. దేశ వాసులు మంచి జీవితం గడిపేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. కేంద్ర పథకాల ద్వారా బడుగు, బలహీన, పీడితవర్గాలను అభివృద్ధిలో భాగస్వాములను చేశాం. అందుకే బీజేపీ మాత్రమే తమ ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తుందని పేదలు, దళితులు, గిరిజనులు, పీడితులు, వెనకబడిన వర్గాల వారు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రయోజనం కల్పించాం రాష్ట్రంలోని ప్రతి దళిత, గిరిజన, వెనకబడిన వర్గాల కుటుంబానికి బీజేపీ ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు దక్కాయి. కరోనా మహమ్మారి కాలంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సాయం అందేలా చూశాం. రాష్ట్రంలో కోట్ల మందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్లు ఇచ్చాం. పేదలకు ఉచితంగా రేషన్ అందించాం. ఎలాంటి వివక్ష లేకుండా ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఇదే సబ్కా సాత్ సబ్కా వికాస్. మహిళల జీవితాల్లో మార్పు తెచ్చాం పెద్ద సంఖ్యలో తల్లులు, సోదరీమణులు ఆశీర్వదించడానికి వచ్చారు. మేం మహిళల జీవితాలు, ఆరోగ్యం బాగు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చాం. స్వచ్ఛ భారత్‌తో తెలంగాణలోని లక్షల మంది మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ఉజ్వల యోజన కింద ఉచిత వంట గ్యాస్ కనెక్షన్ పొంది లక్షల మంది మహిళలు పొగబారి నుంచి విముక్తి పొందారు. మహిళల కోసం రాష్ట్రంలోని పల్లెపల్లెకు పౌష్టికాహారం, టీకాలను చేరవేశాం. కేంద్ర ప్రభుత్వ చర్యలతో మహిళల ఆరోగ్యం మెరుగైంది. వారి జీవితాల్లో కష్టాలు తగ్గాయి. జీవన ప్రమాణాలు, ఆత్మ విశ్వాసం పెరిగాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాం. నారీ శక్తిని 21వ శతాబ్దపు దేశ శక్తిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. బ్యాంకు డిపాజిట్లలో మహిళల వాటా పెరుగుతోందని ఓ నివేదిక ఉంది. అందులో గ్రామీణ మహిళల వాటా మరింత ఎక్కువగా ఉంది. సంపదలో, కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగింది. మహిళలను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయడమే దీనికి కారణం. జన్‌ధన్ యోజన కింద దేశంలో 45 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిస్తే.. తెలంగాణలో కోటికి పైగా తెరిచాం. వీటిలో 55శాతానికి పైగా మహిళలవే. ముద్రా రుణాల్లో మూడింట రెండు వంతులు మహిళలకే ఇచ్చాం. స్టాండప్ ఇండియా రుణాల్లో 80శాతం మహిళలకు ఇచ్చాం. హైదరాబాద్‌లో ఆధునిక సైన్స్ సిటీ ఏర్పాటు పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ భారతదేశానికి కేంద్రంగా ఉంది. కరోనా సమయంలో వాక్సిన్లు మొదలుకుని నిత్యావసర వస్తువుల వరకు ఇక్కడ జరిగిన కార్యక్రమాలు ప్రపంచంలో ఎంతో మందికి ప్రయోజనం కలిగించాయి. రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం పెంపొందించేందుకే గడిచిన ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లో ఆధునిక సైన్స్ సిటీ ఏర్పాటుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కొంతకాలం క్రితం నేషనల్ యానిమల్ రిసోర్స్ సిటీ, బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ వంటి ఆధునిక పరిశోధన కేంద్రాలు హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయి. మా ప్రభుత్వం కేవలం టెక్నాలజీ, ఆవిష్కరణల వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే కాదు.. పేద గ్రామీణ కుటుంబాలకు చెందిన పిల్లల ప్రతిభను కూడా ప్రోత్సహిస్తోంది. నూతన రాష్ట్రీయ శిక్షా నిధిలో భాగంగా స్థానిక భాషలో చదువును ప్రోత్సహిస్తున్నాం. తెలుగులో సాంకేతిక, వైద్య విద్య అందుబాటులోకి వస్తే తెలంగాణలోని గ్రామీణ కుటుంబాల తల్లుల కలలు నెరవేరుతాయి. ఆత్మ నిర్భర్ భారత్ కోసం అవసరమైన నైపుణ్యమున్న మానవ వనరులు అందుబాటులోకి వస్తాయి. రూ.35 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరిస్తున్నాం. ఇందుకోసం రూ.6,500 కోట్లు వెచ్చించాం. ఇప్పటికే ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభంకాగా త్వరలో జాతికి అంకితం చేయబోతున్నాం. తెలంగాణ రైతులు, దేశ ప్రజలకు దీనితో ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. రైతుల జీవనాధారమైన వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో రూ.35వేల కోట్లతో ఐదు పెద్ద సాగునీటి ప్రాజెక్టులు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత ఆరేళ్లలో కేంద్రం తెలంగాణ రైతుల నుంచి లక్ష కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసి, డబ్బులు చెల్లించింది. ధాన్యానికి కనీస మద్దతు ధరను రూ.80 మేర పెంచింది. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు హైదరాబాద్‌లో మెరుగైన రవాణా కోసం రూ.1,500 కోట్లతో ఆరు లేన్లతో కూడిన నాలుగు ఫైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్నాం. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో రవాణా, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 350 కిలోమీటర్ల పొడవైన రీజినల్ రింగు రోడ్డు నిర్మించబోతోంది. తెలంగాణలోని మారుమూల ప్రాంతాలను కూడా రోడ్ల ద్వారా అనుసంధానించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. 2014 నాటికి తెలంగాణలో 2,500 కిలోమీటర్లలోపే జాతీయ రహదారులు ఉండగా.. గత ఎనిమిదేళ్లలో అది రెట్టింపై 5 వేల కిలోమీటర్ల హైవే నెట్వర్క్ ఏర్పడింది. రాష్ట్రంలోని పట్టణాలతోపాటు పల్లెలను కూడా జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తూ 2,700 కిలోమీటర్ల రోడ్లు నిర్మించాం. పీఎం గ్రామసడక్ యోజన మూడో విడత కింద 2,500 కిలోమీటర్ల కొత్త రోడ్ల కోసం రూ.1,700 కోట్లు కేటాయించాం. రైల్వేలోనూ ఎనిమిదేళ్లలో తెలంగాణ కోసం రూ.31వేల కోట్ల పనులు ప్రారంభించాం. 180 కిలోమీటర్లకుపైగా కొత్త రైల్వే లైన్లు నిర్మించాం. ఆత్మ నిర్భరత విషయానికి వస్తే ‘5ఎఫ్’లో భాగంగా ‘ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు పరేడ్’ గురించి మాట్లాడుతున్నాం. దేశం నుంచి వస్త్రాల ఎగుమతి పెంచేందుకు కొత్తగా ఏడు కొత్త మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రైతులు, కూలీలు, వ్యాపారులకు ప్రయోజనం కలిగేలా తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. -
స్ట్రాటజీ మార్చిన ప్రధాని మోదీ.. కేసీఆర్ ఊసెత్తకుండా..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు అరగంట పాటు ప్రసంగించారు. ఊహించని విధంగా స్ట్రాటజీ మార్చిన మోదీ.. ఎలాంటి రాజకీయ విమర్శలు లేకుండా తన స్పీచ్ కొనసాగించారు. కేసీఆర్, టీఆర్ఎస్ ఊసెత్తకుండా ప్రసంగం చేశారు. కేసీఆర్ ప్రశ్నల ప్రస్తావన లేకుండా ప్రసంగం ముగించారు. అభివృద్ధే అజెండాగా ప్రధాని స్పీచ్ సాగింది. తెలంగాణకు కేంద్రం చేస్తున్న సాయంపైనే ప్రధాని దృష్టి కేంద్రీకరించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల లెక్కలు ప్రధాని వివరించారు. చదవండి: తెలంగాణపై బీజేపీ ప్రత్యేక డిక్లరేషన్.. అసలు అందులో ఏముంది? తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని.. బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. బలహీన వర్గాల కోసం బీజేపీ బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తోందన్నారు. సబ్ కా సాథ్, సబ్కా వికాస్ కోసం పనిచేస్తున్నాం. కరోనా కాలంలో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాం. బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం మరింత పెరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోంది. గత ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడికి మంచి చేసే ప్రయత్నం చేశాం. దశాబ్దాల నుంచి వంచనకు గురైన వాళ్ల అభివృద్ధి కోసం పనిచేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
తెలంగాణపై బీజేపీ ప్రత్యేక డిక్లరేషన్.. అసలు అందులో ఏముంది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై ప్రత్యేక డిక్లరేషన్‌ను బీజేపీ విడుదల చేసింది. నీళ్లు, నిధులు, నియామకాలనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని బీజేపీ పేర్కొంది. ప్రజల కోరుకున్న తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చింది. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నారని బీజేపీ పేర్కొంది. చదవండి: దోశ తెప్పించుకుని తిన్న మోదీ ‘‘గత ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో తీవ్రమైన అవినీతి జరిగింది. టీఆర్ఎస్ సర్కార్‌లో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. ప్రధాని పట్ల తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, అభిమానం వెలకట్టలేనివి. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. తెలంగాణలో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి ఆధ్వానంగా ఉంది. 70 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కాళేశ్వరం పేరుతో ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగింది. రాష్ట్రంలో పాఠశాల విద్య దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వ టీచర్ల నియామకాలు పూర్తిగా ఆపేశారు.’’ అని బీజేపీ డిక్లరేషన్‌లో పేర్కొంది. -
తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్‌ను నిర్మిస్తాం: ప్రధాని మోదీ
BJP Vijaya Sankalpa Sabha Live Updates: బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సభా వేదికపైకి చేరుకోగానే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మోదీ భుజం తట్టి అభినందించారు. బీజేపీ శ్రేణులతో పరేడ్ గ్రౌండ్స్ కిక్కిరిసిపోయింది. బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్రమోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బీజేపీని ఆశీర్వదించేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులకు ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. తెలంగాణ మొత్తం ప్రజలందరూ ఈ సభకు వచ్చారనిపిస్తోంది. మీరు నాపట్ల చూపిన ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. హైదరాబాద్‌కు ప్రతిభకు పట్టం కడుతుంది. బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తి తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల గడ్డ. భద్రాచలంలో శ్రీరాముడు, యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి జోగులాంబ అమ్మవారు, వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆశీర్వాదాలు ఉన్నాయి. కాకతీయులు వీరత్వం, శిల్పకళా సౌందర్యం ఎంతో గొప్పది. ఇక్కడి సాహిత్యకారుల కృషి దేశానికే గర్వకారణం. తెలంగాణలో కలలు, నైపుణ్యం ఎంతో మెండుగా ఉన్నాయి. తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తిని ఇస్తోంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది. బలహీన వర్గాల కోసం బీజేపీ బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తోంది. సబ్ కా సాథ్, సబ్కా వికాస్ కోసం పనిచేస్తున్నాం. కరోనా కాలంలో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాం. బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం మరింత పెరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోంది. గత ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడికి మంచి చేసే ప్రయత్నం చేశాం. దశాబ్దాల నుంచి వంచనకు గురైన వాళ్ల అభివృద్ధి కోసం పనిచేశాం. కరోనా సమయంలో తెలంగాణకు ఎంతో చేశాం 2019 ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు మద్దతు పలికారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరింది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రజల కోసం చాలా పనిచేశాం. ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ అందించాం. తెలంగాణ ప్రజల్లో బీజేపీ నమ్మకం పెరుగుతోంది. హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటుకు ఎంతో ప్రయత్నిస్తున్నాం. బయోమెడికల్ సైన్సెస్ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. తెలుగులో టెక్నాలజీ, మెడికల్ చదువులు ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాం. తెలంగాణ నుంచి భారీగా ధాన్యం కొనుగోలు చేశాం. గత ఆరేళ్లో లక్ష కోట్ల విలువచేసే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసింది. రైతులకు అండగా నిలిచేందుకు మద్దతు ధర పెంచాం. రాష్ట్రంలో జాతీయ రహదారులకు భారీగా నిధులు కేటాయించాం. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లను నిర్మించాం. తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్‌ను నిర్మిస్తాం. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే మరింత అభివృద్ధి సాధిస్తుంది అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఓటమి ఖాయం: జేపీ నడ్డా ►తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఓటమి ఖాయమని జేపీ నడ్డా అన్నారు. తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంలా మారిపోయింది. అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ సర్కార్‌కు కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. పేదలను ఆదుకున్న దేవుడు మోదీ: బండి సంజయ్ ►ప్రధానిపై టీఆర్ఎస్ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. పేదలకు ఉచితంగా అన్నం పెట్టినందుకు తిడుతున్నారా?. దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించినందుకు తిడుతున్నారా?. ఉక్రెయిన్ యుద్ధాని ఆపి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కాపాడినందుకు తిట్టాలా?. అంటూ ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడిపోయినా మోదీని ఘనంగా స్వాగతిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. ►సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. విజయ సంకల్ప సభ వేదికపైకి ప్రధాని చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని ప్రసంగించనున్నారు. ప్రస్తుతం బీజేపీ నేతలు ప్రసంగిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్‌కు ప్రధాని మోదీ.. కాసేపట్లో ప్రసంగం ►సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. కాసేపట్లో బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ ►ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి పరేడ్ గ్రౌండ్స్‌కు ప్రధాని చేరుకోనున్నారు. బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించనున్నారు. ►ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్స్‌కు బయలుదేరారు. కాసేపట్లో బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించనున్నారు. గెలిచేది మేమే.. అమిత్ షా ►ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అమిత్ షా అన్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా.. తర్వాత ఎన్నికలు వచ్చినా గెలిచేది మేమే అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ బలం ఏంటో చూపించాం: సీఎం యోగి ఆదిత్యనాథ్ ►గడిచిన రెండు రోజులుగా మేమంతా భాగ్యనగర్‌లో ఉన్నామని.. భవిష్యత్ గురించి మేము ఎన్నో ఆలోచనలు చేశామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ బీజేపీ కార్యకర్తల ఉత్సాహం తమకు స్ఫూర్తినిస్తోందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బలం ఏంటో చూపించామని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. బీజేపీ ముందు టీఆర్ఎస్ ఒక బుడ్డ పార్టీ ►బీజేపీ ముందు టీఆర్ఎస్ ఒక బుడ్డ పార్టీ అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ, ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని ప్రధాని చెప్పారన్నారు. -
ప్రధాని మోదీ ప్రసంగంతో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
Live Updates: పటేల్ వల్లే ఈరోజు దేశంలో తెలంగాణలో ఉంది: ప్రధాని మోదీ ►రెండు రోజులు పాటు సాగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. తెలంగాణ అంశంతో ప్రధాని మోదీ ప్రసంగం ముగిసింది. పటేల్ వల్లే ఈరోజు దేశంలో తెలంగాణలో ఉందని ప్రధాని అన్నారు. 119 నియోజకవర్గాలకు వెళ్లిన జాతీయ ప్రతినిధులను మోదీ అభినందించారు. యూపీ ఉప ఎన్నికల విజయం స్ఫూర్తితో పని చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. అట్టడుగు వర్గాలకు బీజేపీ చేరువ కావాలన్నారు. హిందువులకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చేరువకావాలన్నారు. 30 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉండాలి: అమిత్‌షా దేశంలో అన్ని వర్గాలకు బీజేపీ చేరువ కావాలని అమిత్ షా పిలుపునిచ్చారు. దేశంతో పాటు రాష్ట్రాల్లో 30 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉండాలన్నారు. ఇందుకోసం కార్యాచరణ తయారు చేయాలని అమిత్ షా సూచించారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు.. ►తెలంగాణపై ప్రత్యేక డిక్లరేషన్‌ను బీజేపీ విడుదల చేసింది. నీళ్లు, నిధులు, నియామకాలనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని బీజేపీ పేర్కొంది. ప్రజల కోరుకున్న తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చింది. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నారని బీజేపీ పేర్కొంది. డ్రైవింగ్ సీట్లో కేసీఆర్.. స్టీరింగ్ ఎంఐఎం చేతిలో.. ►టీఆర్ఎస్ నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ సమావేశాలను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేసిందన్నారు. బీజేపీకి పోటీగా నగరం మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రజాధనాన్ని ఫ్లైక్సీలకు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ డ్రైవింగ్ సీట్లో ఉన్నా స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఒకే కుటుంబం చేతిలో తెలంగాణ బందీ: బండి సంజయ్ ►తెలంగాణ ప్రజల ఆకాంక్షకు విలువనిచ్చి బీజేపీ మద్దతిచ్చిందని బండి సంజయ్ అన్నారు. ఆశలు, ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణలో పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులను సీఎం కేసీఆర్ గాలికొదిలేశారన్నారు. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర: పీయూష్ గోయల్ ►టీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని పీయూష్ గోయల్ అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారన్నారు. తెలంగాణలో ప్రజలు కష్టాలు పెరుగుతున్నాయి. తెలంగాణ కోసం ఎందరో త్యాగాలు చేశారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రధానాంశాలుగా పీయూష్ పేర్కొన్నారు. కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈటల ప్రసంగాన్ని అభినందించిన ప్రధాని మోదీ ►జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈటల రాజేందర్‌కు ప్రత్యేక అవకాశం లభించింది. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ప్రత్యేకంగా ఆయన ప్రసంగించారు. 15 నిమిషాలు ఈటల ప్రసంగించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, కేసీఆర్ వైఫల్యాలు, ప్రభుత్వ అవినీతిని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమం అంశాలను ఈటల ప్రస్తావించారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఓడించే పార్టీగా బీజేపీని నమ్ముతున్నారన్నారు. ప్రజలకు మరింత నమ్మకం కలిగిస్తే బీజేపీని ఆదరిస్తారని ఈటల అన్నారు. ఈటల ప్రసంగాన్ని ప్రధాని మోదీ, జేపీ నడ్డా అభినందించారు. బీజేపీ విజయ సంకల్ప సభ.. ►సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభకు భారీ ఏర్పాట్లు చేశారు. పార్టీ కార్యవర్గ సమావేశాలు అనంతరం సాయంత్రం.. ప్రధాని మోదీ హెచ్ఐసీసీ నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. రాత్రికి ప్రధాని మోదీ రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. కాంగ్రెస్‌పై మండిపడ్డ హిమంత ►గుజరాత్ అల్లర్లపై మోదీపై తీవ్రమైన దుష్ప్రచారం చేశారని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ధ్వజమెత్తారు. రాహుల్‌పై అవినీతి ఆరోపణలు వస్తే కాంగ్రెస్ ఎదురుదాడి దిగుతుందని, రామజన్మభూమిలో ఆలయం నిర్మాణాన్నికాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు. సర్జికల్ స్ట్రైక్‌పైనా కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసిందని హిమంత మండిపడ్డారు. గతంలో కులం, మతం ఆధారంగా ఎన్నికలు జరిగేవి, ఇప్పుడు అభివృద్ధి కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయని హిమంత అన్నారు. రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం.. ►సాక్షి, హైదరాబాద్: రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. కేంద్రమంత్రి హోంమంత్రి రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. కర్ణాటక, అసోం సీఎంలు తీర్మానాన్ని బలపరిచారు. గుజరాత్ అల్లర్లలో మోదీకి సుప్రీం కోర్టు క్లీన్చిట్ విషయాన్ని అమిత్ షా ప్రస్తావించారు. తీర్మానాల్లో తెలంగాణపై చర్చ జరిగింది. తెలంగాణలో కుటుంబ పాలన అంతం చేయాలని తీర్మానం చేశారు.