సాక్షి, హైదరాబాద్: పరేడ్ గ్రౌండ్‌లోని విజయ సంకల్ప సభకు భారీగా తరలి వచ్చిన ప్రజానీకాన్ని చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి కాన్వాయ్‌లో వచ్చిన ప్రధాని.. వేదిక దగ్గర పుష్పాలతో అలంకరించిన ఓపెన్‌టాప్ వాహనంలో వస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం వేదికపైకి వచ్చాక హుషారుగా చేతులు ఊపుతూ సభికులను ఉత్సాహపరిచారు. పలుమార్లు ఆయన వంగి అభివాదం చేశారు. సభకు భారీ స్థాయిలో ప్రజలు హాజరుకావడాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి చూపిస్తూ.. వెల్‌డన్ అంటూ సంజయ్ భుజం తట్టి అభినందించారు.
కేసీఆర్ గడీలు బద్దలు కొడదాం
సీఎం కేసీఆర్ గడీలు బద్దలు కొట్టి.. తెలంగాణ తల్లికి విముక్తి కల్పిద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ ప్రజలకు ధైర్యం నింపడం, టీఆర్‌ఎస్ గూండాల నుంచి అనేక దాడులు, పోలీసుల తప్పుడు కేసులు, చార్జిషీట్లతో అగచాట్లు పడుతున్న పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపడానికే హైదరాబాద్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించామని చెప్పారు. అవినీతి, అక్రమాలు, కుటుంబపాలనతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కేసీఆర్‌ను చిత్తుగా ఓడించడానికే ఈ సమావేశాలని స్పష్టం చేశారు.
విజయ సంకల్ప సభకు లక్షలాదిగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ఆదివారం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో బండి సంజయ్ ప్రసంగించారు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంతో ఆదరణ పొందిన మోదీని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన పార్టీ నాయకులు వ్యక్తిగతంగా విమర్శించడం ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పులిలాంటి మోదీని చూసి గుంటనక్కలు పారిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. మోదీ తన దేవుడని అన్నారు. మోదీ గురించి దద్దమ్మలు, మూర్ఖులైన సీఎం, ఆ పార్టీ నాయకులకు ఏమి అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ‘మీరు మోదీని ఎందుకు తిడుతున్నారు.
200 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినందుకా? దేశ ప్రజలకు 28 నెలలుగా ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకా..? యుద్ధ సంక్షుభిత ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించినందుకా..?’అని ప్రశ్నించారు. కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అని నిలదీశారు. కేంద్రం కోట్లాది నిధులిస్తున్నా.. కేసీఆర్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నా.. ఈ ప్రభుత్వం మోదీని వ్యతిరేకిస్తూ.. కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసీ. ఒక్కొక్కరిపై రూ.1.20 లక్షల అప్పు మోపిన కేసీఆర్‌ను గద్దె దించాల్సిందేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment