PM Narendra Modi Speech at BJP Vijay Sankalp Sabha in Hyderabad - Sakshi
Sakshi News home page

BJP Vijaya Sankalpa Sabha Live Updates: తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ

Published Sun, Jul 3 2022 7:02 PM | Last Updated on Sun, Jul 3 2022 8:36 PM

PM Narendra Modi Speech at BJP Vijay Sankalp Sabha Hyderabad - Sakshi

BJP Vijaya Sankalpa Sabha Live Updates: బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సభా వేదికపైకి చేరుకోగానే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మోదీ భుజం​ తట్టి అభినందించారు. బీజేపీ శ్రేణులతో పరేడ్‌ గ్రౌండ్స్‌ కిక్కిరిసిపోయింది. 

బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్రమోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బీజేపీని ఆశీర్వదించేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులకు ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. తెలంగాణ మొత్తం ప్రజలందరూ ఈ సభకు వచ్చారనిపిస్తోంది. మీరు నాపట్ల చూపిన ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. హైదరాబాద్‌కు ప్రతిభకు పట్టం కడుతుంది. బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది.

తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తి
తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల గడ్డ. భద్రాచలంలో శ్రీరాముడు, యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి జోగులాంబ అమ్మవారు, వరంగల్‌ భద్రకాళీ అమ్మవారి ఆశీర్వాదాలు ఉన్నాయి. కాకతీయులు వీరత్వం, శిల్పకళా సౌందర్యం ఎంతో గొప్పది. ఇక్కడి సాహిత్యకారుల కృషి దేశానికే గర్వకారణం. తెలంగాణలో కలలు, నైపుణ్యం ఎంతో మెండుగా ఉన్నాయి. తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తిని ఇస్తోంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది. 

బలహీన వర్గాల కోసం బీజేపీ
బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తోంది. సబ్‌ కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ కోసం పనిచేస్తున్నాం. కరోనా కాలంలో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాం. బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం మరింత పెరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోంది. గత ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడికి మంచి చేసే ప్రయత్నం చేశాం. దశాబ్దాల నుంచి వంచనకు గురైన వాళ్ల అభివృద్ధి కోసం పనిచేశాం. 

కరోనా సమయంలో తెలంగాణకు ఎంతో చేశాం
2019 ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు మద్దతు పలికారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరింది. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రజల కోసం చాలా పనిచేశాం. ఉచిత రేషన్‌, ఉచిత వ్యాక్సిన్‌ అందించాం. తెలంగాణ ప్రజల్లో బీజేపీ నమ్మకం పెరుగుతోంది. హైదరాబాద్‌లో సైన్స్‌ సిటీ ఏర్పాటుకు ఎంతో ప్రయత్నిస్తున్నాం. బయోమెడికల్‌ సైన్సెస్‌ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. తెలుగులో టెక్నాలజీ, మెడికల్‌ చదువులు ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. 

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాం. తెలంగాణ నుంచి భారీగా ధాన్యం కొనుగోలు చేశాం. గత ఆరేళ్లో లక్ష కోట్ల విలువచేసే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసింది. రైతులకు అండగా నిలిచేందుకు మద్దతు ధర పెంచాం. రాష్ట్రంలో జాతీయ రహదారులకు భారీగా నిధులు కేటాయించాం. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లను నిర్మించాం. తెలంగాణలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను నిర్మిస్తాం. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఏర్పడితే మరింత అభివృద్ధి సాధిస్తుంది అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.

తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌ ఓటమి ఖాయం: జేపీ నడ్డా
►తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌ ఓటమి ఖాయమని జేపీ నడ్డా అన్నారు. తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంలా మారిపోయింది. అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్‌ సర్కార్‌కు కొనసాగే నైతిక హక్కు లేదన్నారు.

పేదలను ఆదుకున్న దేవుడు మోదీ: బండి సంజయ్‌
►ప్రధానిపై టీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని బండి సంజయ్‌ మండిపడ్డారు. పేదలకు ఉచితంగా అన్నం పెట్టినందుకు తిడుతున్నారా?. దేశ ప్రజలకు వ్యాక్సిన్‌ అందించినందుకు తిడుతున్నారా?. ఉక్రెయిన్‌ యుద్ధాని ఆపి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కాపాడినందుకు తిట్టాలా?. అంటూ ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడిపోయినా మోదీని ఘనంగా స్వాగతిస్తున్నారని బండి సంజయ్‌ అన్నారు.

ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
►సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. విజయ సంకల్ప సభ వేదికపైకి ప్రధాని చేరుకున్నారు.  కాసేపట్లో ప్రధాని ప్రసంగించనున్నారు. ప్రస్తుతం బీజేపీ నేతలు ప్రసంగిస్తున్నారు.

పరేడ్‌ గ్రౌండ్‌కు ప్రధాని మోదీ.. కాసేపట్లో ప్రసంగం
►సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. కాసేపట్లో  బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించనున్నారు.

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
►ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి పరేడ్‌ గ్రౌండ్స్‌కు ప్రధాని చేరుకోనున్నారు. బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించనున్నారు.

►ప్రధాని మోదీ పరేడ్‌ గ్రౌండ్స్‌కు బయలుదేరారు. కాసేపట్లో బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించనున్నారు.

గెలిచేది మేమే.. అమిత్‌ షా
►ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అమిత్‌ షా అన్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా.. తర్వాత ఎన్నికలు వచ్చినా గెలిచేది మేమే అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ బలం ఏంటో చూపించాం: సీఎం యోగి ఆదిత్యనాథ్‌
►గడిచిన రెండు రోజులుగా మేమంతా భాగ్యనగర్‌లో ఉన్నామని.. భవిష్యత్‌ గురించి మేము ఎన్నో ఆలోచనలు చేశామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ బీజేపీ కార్యకర్తల ఉత్సాహం తమకు స్ఫూర్తినిస్తోందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బలం ఏంటో చూపించామని యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు.

బీజేపీ ముందు టీఆర్‌ఎస్‌ ఒక బుడ్డ పార్టీ
►బీజేపీ ముందు టీఆర్‌ఎస్‌ ఒక బుడ్డ పార్టీ అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఎద్దేవా చేశారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ, ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని ప్రధాని చెప్పారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement