సాక్షి, హైదరాబాద్: ఉప్పు, నిప్పుల ఉన్న బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల వ్యవహారం మరోసారి తెరమీదకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8న హైదరాబాద్‌లో పర్యటించడమే ఇందుకు కారణం. మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కొంతకాలం నుంచి ప్రధాని మోదీ పాల్గొంటున్న ఏ ప్రభుత్వ, ఇతర కార్యక్రమాల్లోనూ సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. ఇంతకుముందు పలుమార్లు మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినా.. స్వాగతం పలకడానికి సీఎం వెళ్లలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులనే పంపారు.
ఈ క్రమంలో ప్రధాని మోదీ సభకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎప్పటిలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, జీఎస్టీ నిధుల నిధుల విడుదల, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు తదితర విషయాల్లో కేంద్రం చూపుతున్న మొండి వైఖరికి నిరసనగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై వివక్ష చూపుతున్న ప్రధానితో ఒకే వేదికను పంచుకోవడం ఇష్టం లేక కేసీఆర్ మోదీ పర్యటను హాజరుకావడం లేదని సమాచారం.
కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 8న తెలంగాణలో పర్యటించనున్నారు. తొలుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఎమ్‌టీఎస్ సెకండ్ ఫేజ్‌లో భాగంగా 13 ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను ప్రారంభించనున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్ సభలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ప్రధాని పర్యటనకు నిరసనగా..
మరోవైపు ప్రధాని రాష్ట్ర పర్యటన రోజే బీఆర్‌ఎస మహా ధర్నాలు చేపట్టనుంది. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ధర్నాలకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. సింగరేణి బొగ్గు బావుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడె, రామగండంలో మహా ధర్నాలు చేపట్టనుంది.
సీఎంకు 7 నిమిషాలు
ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ప్రధాని పాల్గొననున్నవి కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు కావడంతో ప్రోటోకాల్ ప్రకారం సీఎం, ఇతర ప్రముఖులకు హోదాల ప్రకారం ఆహ్వానించారు. పరేడ్‌గ్రౌండ్స్ సభలో కేసీఆర్ ప్రసంగానికి ఏడు నిమిషాల సమయాన్ని కేటాయించారు
శనివారం మోదీ షెడ్యూల్ ఇదీ..
► ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు రాక
► 11.45కు రోడ్డు మార్గాన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ప్రధాని..
► 11.45 నుంచి 12 గంటల దాకా అక్కడే కార్యక్రమాలు. సికింద్రాబాద్–తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
► మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకోనున్న మోదీ
► 12.20 నుంచి 12.30 గంటల వరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలు
► 12.30 నుంచి 12.37 గంటల దాకా సీఎం కేసీఆర్ ప్రసంగం
► 12.37 నుంచి 12.50 గంటల వరకు ఎంఎంటీఎస్ ఫేజ్–2తోపాటు పలు రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
► మధ్యాహ్నం 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం
► 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్న ప్రధాని.
ఇక ప్రధాని రాష్ట్ర పర్యటన కేవలం రెండు గంటల్లోనే ముగియనుంది. శనివారం ఉదయం 11.30కు హైదరాబాద్‌కు చేరుకోనున్న మోదీ.. 1.30 గంటల సమయంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment