సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో చోటుచేసుకున్న అవినీతిపై దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి తీరుతాయి. తప్పు చేసిన వారెవరినీ వదలం. ప్రజాధనాన్ని లూటీ చేసినవారి నుంచి దానిని తిరిగి రాబడతాం. ఢంకా భజాయించి మరీ చెప్తున్నా. ఇది మోదీ గ్యారంటీ. బీఆర్‌ఎస్ నేతల్లో అహంకారం చాలా పెరిగింది. బీఆర్‌ఎస్ అవినీతి, అక్రమాల్లో ఢిల్లీ మద్యం కుంభకోణం కూడా ముడిపడి ఉంది. అవినీతి తారస్థాయికి చేరుకోవడంతో దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. వాటిపైనా బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర విమర్శలు మొదలుపెట్టారు’ అని మోదీ కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు.
బీఆర్‌ఎస్ అధికారానికి రావడానికి పెద్దపెద్ద హామీలు ఇచ్చిందని.. రైతులకు రూ.లక్ష రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మండిపడ్డారు. తెలంగాణలోని అన్నివర్గాలు మార్పు కోరుతున్నాయని.. అది నెరవేరుతుందన్న విశ్వాసం తమకు ఉందని చెప్పారు. మంగళవారం ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బీసీ ఆత్మ గౌరవ సభ’లో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రసంగం సారాంశం ఆయన మాటల్లోనే..
‘తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే జరిగింది. వీటి విషయంలో బీఆర్‌ఎస్ మోసం చేసింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎందరో అమరులయ్యారు. కానీ వారి ఆకాంక్షలు నెరవేరలేదు. స్వరాష్ట్రంలో బీసీలను మోసం చేశారు. వారి ఆకాంక్షలను కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు. తెలంగాణలో నిజమైన అభివృద్ధి కనిపించడం లేదు. ఇప్పుడు తెలంగాణలో మార్పు తుఫాను కనిపిస్తోంది. బీజేపీ సర్కారు ఏర్పడగానే బీసీల గౌరవం పెంచడానికి చర్యలు చేపడతాం. ప్రజల విశ్వాసాన్ని నిలబెడతాం. ఈ నెల 30న జరిగే పోలింగ్‌లో బీఆర్‌ఎస్ సర్కారును సాగనంపాలి.
బీఆర్‌ఎస్‌ది కాంగ్రెస్ మోడలే..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు కాదు. కాంగ్రెస్‌వారసత్వ, కుటుంబ, అవినీతి మోడల్‌ను బీఆర్‌ఎస్ కొనసాగిస్తోంది. దేశ సంపదను లూటీ చేయడం, కొడుకు, కూతురు, బంధువులకు కట్టబెట్టడమే తప్ప ప్రజలు, వారి కుటుంబాల సంక్షేమం, మేలు ఈ పార్టీలకు పట్టదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఓ నాణేనికి బొమ్మా బొరుసు వంటివి. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల లక్షణాలు.
బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు సీ టీమ్.. కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌కు సీ టీమ్. రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే’ అని మోదీ పేర్కొన్నారు. సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జనసేన అధ్యక్షుడు కె.పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు.
మీరు ఆశీర్వదిస్తే బీసీ సీఎం అవుతారు
2014లో ఇదే మైదానంలో జరిగిన నా సభకు టికెట్లు కొని మరీ ప్రజలు హాజరయ్యారు. మోదీ ప్రధాని అయ్యేందుకు ఎల్బీ స్టేడియం కీలకంగా మారింది. అప్పుడు మీ ఆశీర్వాదంతోనే ప్రధాని అయ్యాను. దేశాభివృద్ధికి గట్టి పునాది పడింది. ఈ సభకు వ చ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను చూస్తుంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నట్టు అనిపిస్తోంది. తెలంగాణ ప్రజలు బీజేపీపై విశ్వాసంతో ఉన్నారు. మీ ఆశీర్వాదంతో త్వరలో తెలంగాణలోనూ బీజేపీ బీసీ వ్యక్తి సీఎం అవుతారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందాలంటే యువత, రైతులు, తదితర అన్ని వర్గాలకు మేలు జరగాలంటే బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారుతోనే సాధ్యం.
Comments
Please login to add a commentAdd a comment