సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన కాక రేపుతోంది. ‘మునుగోడు’ ఉప ఎన్నిక సెగ తగ్గకముందే రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఇప్పటికే ఉప్పునిప్పులా చిటపటలాడుతున్న టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రధాని మోదీ రాష్ట్రానికి రావొద్దంటూ ‘నో ఎంట్రీ’ ఫ్లెక్సీలు వెలియడం.. టీఆర్‌ఎస్ దిగజారి వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు విమర్శలు చేయడం.. సీఎంను ఆహ్వానించకుండా కేంద్రం ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తోందంటూ టీఆర్‌ఎస్ నేతలు ఎదురుదాడికి దిగడం.. ప్రధాని పర్యటనను ఎవరూ అడ్డుకోలేరంటూ కాషాయ నేతలు ప్రకటనలు చేయడం అగ్గి పుట్టిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర పర్యటనలో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారన్నది ఉత్కంఠ రేపుతోంది.
రెండు చోట్ల ప్రధాని సభ: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడంతోపాటు రైల్వేలేన్, జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు శనివారం ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో స్వాగత సభలో, తర్వాత రామగుండం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ఓ వైపు ఏర్పాట్లు చేసుకుంటుంటే.. ఇదే అదనుగా కేంద్రాన్ని, ప్రధాని మోదీని నిలదీయాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య పరస్పరం విమర్శలు, ఆరోపణల యుద్ధం జరుగుతోంది.
ప్రొటోకాల్ నుంచి ‘ఎర’ దాకా..
కరోనా సమయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించారని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పట్లోనే మండిపడింది. నాటి ప్రొటోకాల్ వార్ ఆ తర్వాత కూడా కొనసాగింది. తర్వాత మోదీ మరికొన్నిసార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చినా స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ వెళ్లలేదు. మోదీతో కలిసి వేదిక పంచుకోలేదు. ఈ రెండేళ్లలో ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య గట్టి పోరు సాగింది. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక, నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్‌తో ఇది తారస్థాయికి చేసింది. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందంటూ స్వయంగా సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆరోపించడం మరింత ఆజ్యం పోసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
కొన్నిరోజులుగా.. గరం గరం
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైన తర్వాత రాజకీయ విమర్శలు మరింత పెరిగాయి. కేంద్రం తెలంగాణను అవమానిస్తోందని.. సీఎంను ఆహ్వానించే విషయంలోనూ ప్రొటోకాల్ పాటించకపోవడం ఏమిటని టీఆర్‌ఎస్ మండిపడింది. ఇదే సమయంలో పలుచోట్ల ‘మోదీకి నో ఎంట్రీ’, ‘మోదీ గోబ్యాక్’ అంటూ ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. ఇది టీఆర్‌ఎస్ బినామీల పనేనని బీజేపీ మండిపడింది. ప్రధాని కార్యక్రమానికి సీఎం వచ్చి రాష్ట్రానికి చెందిన సమస్యలను చెప్పుకొని పరిష్కరించుకోవాలిగానీ తప్పించుకోవడం ఏమిటని నిలదీసింది. ఎవరు అడ్డుకున్నా మోదీ పర్యటన ఆగదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరించారు కూడా. మోదీ పర్యటనకు దూరంగా ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బేగంపేట విమానాశ్రయంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు.
చదవండి: ‘సుప్రీం’ నిర్ణయం సబబే
Comments
Please login to add a commentAdd a comment