ఫైల్ ఫోటో
సాక్షి, ఇల్లెందు: భ్రద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో పోలీసులు మోహరించారు. మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు, కమాండర్ దూది దేవాలు అలియాస్ శంకర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చి చంపారని ఆరోపిస్తూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన బంద్ ఇల్లెందు ఏరియాలో ఆదివారం కనిపించలేదు. జిల్లా వ్యాప్తంగా ఇల్లెందు, గుండాల, మణుగూరు భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, బయ్యారం, టేకులపల్లి, ఆళ్లపల్లి, కరకగూడెం, పినపాక లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా బంద్ ప్రభావం కనిపించలేదు. దుకాణాలు, షాపులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు పని చేశాయి. గుండాల, కరకగూడెం లాంటి మారుమూల గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్ సర్వీసులను ముందస్తుగా నిలిపి వేశారు.
జిల్లా వ్యాప్తంగా పలు ప్రధాన రహదారుల మీద దృష్టి కేంద్రీకరించిన పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. మావోయిస్టు బంద్ దృష్ట్యా ఏజెన్సీలో ప్రత్యేక బలగాలను మోహరింపజేసి కూంబింగ్ చేపట్టారు. స్పెషల్ పార్టీ బలగాలతో పాటు ఈ దఫా గ్రేహౌండ్స్ దళాలతో సరిహద్దు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నెల 3వ తేదీన తెల్లారుజామున భద్రాద్రి కొత్తగూడెం– ములుగు, మహబూబాబాద్ జిల్లాల సరిహద్దు దేవాళ్లగూడెం– దుబ్బగూడెం మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దూది దేవాలు అలియాస్ శంకర్ ఏరియా కమిటీ సభ్యుడు, కమాండర్ స్థాయిలో ఉన్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. సుమారు ఏడేళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన శంకర్ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ జగన్‌కు అంగరక్షకుడుగా కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
ఏరియా కమిటీ సభ్యుడుగా, దళ నేత శంకర్ బయటకు రావటం, పోలీసులకు చిక్కి ఎన్‌కౌంటర్‌లో హతమవ్వటం మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునేందుకు దుశ్చర్యకు పాల్పడే అవకాశం ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బలగాలరె పెద్ద ఎత్తున మోహరించి కూంబింగ్‌ను ఉధృతం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని అధికార పార్టీ నేతలను, ప్రజా ప్రతినిధులను అలర్ట్ చేశారు. ఊహించినట్లే మావోయిస్టు బంద్ ప్రభావం లేకపోవటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బంద్ దృష్ట్యా ముందస్తుగా ఏజెన్సీని జల్లెడ పడుతుండటంతో ఎక్కడ ఏం జరుగుతుందోనని గిరిజన గూడెంలలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఎన్‌కౌంటర్‌లో కీలక నేతను కోల్పోయిన మావోయిస్టులు జాగ్రత్తలతో ఉంటారని, పక్కా సమాచారంతోనే పోలీసులకు దొరికే చాన్స్ ఉంటుందని కొంతమంది అంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అడవులు దట్టంగా పెరగటం, అంతటా నీరు లభిస్తుండటం మావోయిస్టులు సునాయసంగా తప్పించుకునే అవకాశం ఉంటుందని ఇతర విప్లవ గ్రూపులు పేర్కొంటున్నాయి.
ఇదే క్రమంలో ఆదివారం తెల్లారుజామున గుండాల మండలం శంభునిగూడెం ఏరియాలో ఎనిమిది రౌండ్ల వరకు కాల్పుల శబ్ధాలు వినిపించినట్లు ప్రచారం జరిగింది. కానీ అక్కడి గ్రామాల ప్రజలు, పోలీసులు కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపడేశారు. దూది దేవాలు 2013లో మావోయిస్టు పార్టీలో చేరాడని మావోయిస్టు పార్టీ ప్రకటించగా వైద్యం కోసం వెళ్లి దొరికినట్లు వెల్లడించిన మావోయిస్టులు ఏ పట్టణానికి వెళ్లింది, ఎక్కడ పోలీసులకు చిక్కింది వెల్లడించలేదు. అయితే మునుపెన్నడూ లేనంతగా మావోయిస్టు కమిటీల పేరుతో ప్రకటనలు గుప్పించి బంద్‌కు పిలుపునిచ్చిందని, ఉనికిని చాటుకునే యత్నం చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment