![Police Investigating On Renuka Yashwatnth Case](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/45445.jpg.webp?itok=68OnomLe)
కత్తితో యువకుడి ఆత్మహత్యా యత్నం
అడ్డొచ్చిన తల్లిని పొడిచిన తనయుడు
కేసును తప్పుదోవ పట్టించిన సోదరులు
దుండగులు దాడి చేశారని అబద్ధపు సమాచారం
150 సీసీ కెమెరాలు జల్లెడ పట్టిన పోలీసులు
చివరికి బాధితుడే నిందితుడిగా తేలిన వైనం
చిలకలగూడ,హైదరాబాద్: చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడలో ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో దాడి చేసి పొడిచింది కట్టుకథేనని పోలీసులు తేల్చేశారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో కుమారుడు యశ్వంత్ కూరగాయలు కోసే చాకుతో కడుపులో పొడుచుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతుండగా.. వద్దని వారించేందుకు అడ్డొచ్చిన తల్లిని పొడిచినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగులకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించకపోవడం, స్థానికులు అందించిన కీలక సమాచారంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ఇది వేరే వారి పని కాదని, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలే కారణమని నిర్ణయించి అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన తల్లి రేణుక తన ముగ్గురు కుమారులతో కలిసి నివసిస్తోంది. గురువారం మధ్యాహ్నం ఆరుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి చేయగా, తల్లి రేణుక, పెద్ద కుమారుడు యశ్వంత్‌లకు తీవ్ర గాయాలయ్యాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుమారు 150 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా దుండగులకు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ లభించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిన ఆనవాళ్లు లేవని స్థానికులు స్పష్టం చేశారు. గట్టిగా కేకలు వినిపించడంతో వెళ్లిచూడగా లోపల నుంచి తలుపు గడియ పెట్టి ఉందని, కొన్ని క్షణాల తర్వాత తలుపులు తెరుచుకోగా రేణుక, యశ్వంత్ ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారని, అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు.
వినియోగించిన చాకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు..
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వివాహం కాకపోవడం తదితర సమస్యలో తల్లి రేణుక కుమారుడు యశ్వంత్‌ల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని తెలిసింది. మూడు నెలలుగా యశ్వంత్ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన అతను.. కూరగాయలు కోసే చాకుతో కడుపులో పొడుచుకుని ఆత్మహత్యకు యతి్నంచగా, అడ్డుకున్న తల్లిని కూడా పొడిచినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఈ ఘటనలో వినియోగించిన చాకును పోలీసులు స్వా«దీనం చేసుకుని ఫింగర్‌ప్రింట్స్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం.
బాధితుడే.. నిందితుడు...
ఈ ఘటనలో బాధితుడే నిందితుడు కావడం గమనార్హం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యశ్వంత్‌ను బాధితుడిగా పేర్కొన్న పోలీసులు ఇప్పుడు నిందితుడిగా చేర్చనున్నారు. ఆత్మహత్యా యత్నంతో పాటు తల్లిని చాకుతో పొడిచి హత్యాయత్నానికి పాల్పడినందుకు యశ్వంత్‌పై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసును తప్పుదారి పట్టించేలా వ్యవహరించిన యశ్వంత్ సోదరులు యశ్‌పాల్, వినయ్‌లపై కూడా కేసులు నమోదు చేసేందుకు న్యాయనిపుణుల సలహా తీసుకోనున్నట్లు తెలిసింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేణుక, యశ్వంత్‌లు కోలుకుంటున్నారని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. వీరు పూర్తిగా కోలుకున్న తర్వాత వాంగూల్మం నమోదు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment