సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఇతర మహా నగరాలకు భిన్నంగా హైదరాబాద్ రోడ్లపై వాహనాల సరాసరి వేగం పెరుగుతోందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. దీన్ని మరింత పెంచడంతో పాటు ప్రమాదాలు తగ్గించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు తిరుమలగిరిలో నేరం నిరోధించడంలో, కోఠిలో ఓ ప్రాణం కాపాడటంతో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ట్రాఫిక్ చీఫ్ విజయ్‌కుమార్‌తో కలిసి బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
►నగరంలో వాహనాల సరాసరి వేగం 2016లో గంటకు 19 కిమీ, 2019లో గంటకు 22 కిమీ ఉండగా.. ఈ ఏడాది అది 25 కిమీకి చేరింది. 2022లో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ ఏడాది సిటీ ట్రాఫిక్ పోలీసులు 36 సందర్భాల్లో లైవ్ ఆర్గాన్లు రవాణా చేయడానికి గ్రీన్ ఛానల్ ఇవ్వడం ద్వారా సహకరించారు. ఈ ఆపరేషన్లు అన్నీ విజయవంతం అయినట్లు వైద్యులు సమాచారం ఇచ్చారు.
►టూ వీలర్‌పై ప్రయాణించే భర్తలతో పాటు భార్యలూ హెల్మెట్ ధరించడం పెరుగుతోంది. ఈ కారణంగా ఈ ఏడాది నాలుగు ప్రమాదాల్లో మహిళలు గాయాలతో బయటపడ్డారు. ►హెల్మెట్ ధరించని వాహనచోదకులపై 2015లో 1.3 లక్షల కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 39 లక్షలకు చేరింది. స్టాప్ లైన్ దాటిన వారిపై గతేడాది 43 వేల కేసులు, ఈ ఏడాది 75 వేల కేసులు నమోదయ్యాయి.
చదవండి: టీఆర్‌ఎస్, ఎంఐఎం సఖ్యత: ఎప్పటివలెనె.. మమ అనిపించారు!
►ఈ ఏడాది ఓవర్ స్పీడింగ్‌పై 76 వేలు, నో ఎంట్రీ ఉల్లంఘనపై 17,359, సిగ్నల్ జంపింగ్‌పై 40,274, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై 34 వేలు, నెంటర్ ప్లేట్ ఉల్లంఘనపై 28,300, మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 21,041 కేసులు నమోదయ్యాయి.
►ఈ ఏడాది మృతులతో కూడిన రోడ్డు ప్రమాదాల్లో సరుకు రవాణా వాహనాల వల్ల 43, ద్విచక్ర వాహనాల వల్ల 24, కార్లతో 14, ఆటోలతో 8, అంబులెన్స్‌లతో 2 జరిగాయి. అంబులెన్స్ డ్రైవర్లనూ అప్రమత్తం చేయనున్నారు.
►మృతులతో కూడిన ప్రమాదాల కారణాలను విశ్లేషిస్తే... ఓవర్ స్పీడ్ వల్ల 178, మద్యం మత్తులో డ్రైవింగ్ వల్ల 13, రాంగ్‌సైడ్ డ్రైవింగ్ వల్ల 10, మైనర్ డ్రైవింగ్ వల్ల 6, నిర్లక్ష్యంగా వాహనం నడపటం వల్ల 24 జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment