సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరిలో కంచన్‌బాగ్–చంద్రాయణగుట్ట రోడ్డులో అర్ధరాత్రివేళ మూడు ఆటోలు విన్యాసాలు చేశాయి. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు ఏడుగురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. గత నెలలో బేగంపేట–ప్రకాష్‌నగర్ మార్గంలో ఏడుగురు యువకులు అర్ధరాత్రి వేళ హల్‌చల్ చేశారు. రేసింగ్‌తో పాటు వీళ్లు చేసిన ఫీట్లు సోషల్‌మీడియా ద్వారా పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేసిన అధికారులు ఏడుగురిని అరెస్టు చేశారు.
సోషల్‌మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో ఈ రెండు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. అయితే బయటపడకుండా నిత్యం అనేక ప్రాంతాల్లో ఈ తరహా స్టంట్లు జరుగుతున్నాయని పోలీసులకు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారిపై నిఘా ఉంచడానికి డ్రోన్లు వినియోగించనున్నారు. ఒక్కో జోన్‌కు ఒక్కో డ్రోన్ చొప్పున సమీకరించుకోవాలని నిర్ణయించినట్లు నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.
ఆయా ప్రాంతాల్లో రాత్రి వేళ...
నడిరోడ్లపై సాగే ఈ సర్కస్ ఫీట్లలో పాల్గొంటున్న వారంతా యువకులే ఉంటున్నారు. ప్రధానంగా మధ్య, పశ్చిమ, ఉత్తర మండలాల్లోని ఎన్టీఆర్ మార్గ్, పీవీ నర్సింహారావు మార్గ్, మెహదీపట్నం, టోలీచౌకీ, బేగంపేట, బోయిన్‌పల్లి తదతర ప్రాంతాలతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్‌లోని కొన్ని చోట్ల ఈ విన్యాసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి వేళల్లో సాగుతున్న వీటి వల్ల ఇతరులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు ఆ వాహనచోదకులకు, ఎదుటి వారికీ ప్రమాదహేతువులుగా మారే ప్రమాదం ఉందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితం ఉండట్లేదు.
డ్రోన్ల సాయంతో గగనతలం నుంచి...
దీన్ని పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు విభాగం ఇలాంటి వ్యవహారాలపై నిఘా ఉంచడానికి డ్రోన్లు వాడాలని నిర్ణయించింది. ప్రతి జోన్‌కు ఒకటి చొప్పున ఉండే శక్తిమంతమైన డ్రోన్లను రాత్రి వేళల్లో రేసర్లను గుర్తించడానికి వాడనున్నారు. ఒక్కో డ్రోన్ గరిష్టంగా 250 మీటర్ల ఎత్తులో, 25 కిమీ పరిధిలో నిఘా ఉంచగలుగుతుందని అధికారులు చెప్తున్నారు. “28ఎక్స్’ వరకు జూమ్ చేసుకునే సామర్థ్యం వీటి కెమెరాలకు ఉంటుంది. ఫలితంగా రాత్రి వేళల్లోనూ కింద ఉన్న వాహనాల నెంబర్ ప్లేట్‌ను కచ్చితంగా చూడగలరు. ఆయా ప్రాంతాల్లో ఉండే డ్రోన్ ఆపరేటర్లు స్టంట్లు చేస్తున్న వాహనాలను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తారు. వాహనాల నంబర్ల ఆధారంగా బాధ్యుల చిరునామాలను గుర్తించి అరెస్టు చేయడానికి ఆస్కారం ఏర్పడనుంది.
మూడు సెక్షన్ల కింద కేసులు
సాధారణ ప్రజలతో పాటు తోటి ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారే ఈ తరహా రేసింగ్స్, స్టంట్స్‌ను తీవ్రంగా పరిగణించనున్నాం. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై ఐపీసీతో పాటు మోటారు వాహన చట్టం, సీపీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసే ఆస్కారం ఉంది. ఇప్పటికే చంద్రాయణగుట్ట, బేగంపేట కేసుల్లో వీటిని ప్రయోగించాం. డ్రోన్ల సాయంతో వాహనాల నంబర్లు గుర్తించి, వారి ఇళ్లకు వెళ్ళి మరీ పట్టుకుంటాం. నంబర్ ప్లేట్లు సక్రమంగా కనిపించని వాహనాల విషయంలో సీసీ కెమెరాల ఆధారంగా ముందుకు వెళ్తాం. – నగర పోలీసు ఉన్నతాధికారి
Comments
Please login to add a commentAdd a comment