bike race
-
130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బైక్.. క్షణంలో ఇద్దరూ..
అనంతపురం: అతివేగం ఇద్దరిని బలిగొంది. కరిడికొండ శివారు 44వ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగి, మరొకరు చిరు వ్యాపారి ఉన్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురంలోని కళాకారుల కాలనీకి చెందిన మల్లికార్జున, శశికళ దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. చిన్న కొడుకు కురువ భువనచంద్ర (29) హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం స్నేహితుడి బుల్లెట్ బైక్ తీసుకుని అనంతపురం బయల్దేరాడు. ఆటోలో పల్లెలు తిరుగుతూ స్టీలుసామాన్లు, మిక్సీలు విక్రయిస్తూ జీవనం సాగించే బుక్కరాయసముద్రం మండల కేంద్రానికి చెందిన సలార్‌బాషా (55) అర్ధరాత్రి వేళ గుత్తి మండలం కరిడికొండ జాతీయ రహదారి సమీపంలో ఆగాడు. ఇటు వైపు నుంచి అటువైపు ఉన్న ధాబా వద్దకు వెళ్లేందుకని నడుచుకుంటూ రోడ్డు డివైడర్‌పైకి చేరుకున్నాడు. అక్కడ చెట్ల మధ్య నుంచి కిందకు కాలు పెట్టగానే అల్లంత దూరాన 130 కిలోమీటర్ల వేగంతో బైక్‌పై వస్తున్న భువనచంద్ర వేగాన్ని అదుపు చేయలేకపోయాడు. బైక్ ఢీకొని సలార్‌బాషా వంద అడుగుల దూరం ఎగిరి కిందపడగా.. భువన చంద్ర 50 అడుగుల మేర గాల్లోకి ఎగిరి పడ్డాడు. స్థానికులు ప్రమాద విషయాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని.. అచేతనావస్థలో ఉన్న ఇద్దరినీ గుత్తి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల్లో సలార్బాషాకు భార్య రషీదా, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. భువనచంద్ర అవివాహితుడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరుతున్న బైక్ రేసర్ల ఆగడాలు.. గుత్తి శివారు 44వ నంబర్ జాతీయ రహదారిపై బైక్ రేసర్లు పేట్రేగిపోతున్నారు. హైదరాబాద్–బెంగళూరు మధ్య శని, ఆదివారాల్లో వందలాదిమంది బైక్ రేసర్లు మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 250 సీసీ నుంచి 500 సీసీ సామర్థ్యం కలిగిన బుల్లెట్, హోండా, యమహా బైక్‌లను రేసర్లు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఆరు గంటల్లో వెళ్లాలని బెట్టింగ్ వేసుకుని.. వేగంతో పోటీపడుతూ వారితో పాటు ఇతరులనూ ప్రమాదాల్లోకి నెడుతున్నారు. జాతీయ రహదారిపై పోలీసులు నిఘా ఉంచి బైక్ రేసర్ల ఆగడాలను అరికట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. -
అనంతగిరి అడవుల్లో రేసింగ్‌పై స్పందించిన పోలీసులు
సాక్షి, వికారాబాద్: అనంతగిరి అడవుల్లో రేసింగ్‌పై పోలీసులు స్పందించారు. రేసింగ్ నిర్వహించిన వారిలో కొందరిని గుర్తించామని వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మిగిలిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు స్వాతంత్ర్య దినోత్సవం బందోబస్తులో ఉండటంతో రేసింగ్‌కు పాల్పడ్డారని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేస్తామని ఎస్పీ అన్నారు. అనంతగిరి అడవుల్లో జరిగిన కార్, బైక్ రేసింగ్ విన్యాసాలకు సంబంధించిన ప్రాంతానికి వెళ్లి అటవీ శాఖ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు వివరాలు సేకరించారు ఒక కారు నంబర్ ను గుర్తించిన అధికారులు.. హైదరాబాద్ నుంచి ఇద్దరు ఆర్గనైజర్లు, 40 మందితో 16 కార్లు, రేసింగ్ బైకులు తీసుకొచ్చి విన్యాసాలు చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అనంతగిరి అడవుల్లోకి వీరిని ఎవరు తీసుకొచ్చారు. ఎవరు సహకరించారనే విషయాలపై విచారణ చేపట్టారు. రేసింగ్‌లో పాల్గొన్న వాహనాల నంబర్ల ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు. చదవండి: 9 నంబర్లు వస్తే.. లిఫ్ట్ చేయొద్దు -
స్టంట్లు చేస్తున్నారా.. జర జాగ్రత్త! పోలీసులు ఇంటికే వచ్చేస్తారు..
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరిలో కంచన్‌బాగ్–చంద్రాయణగుట్ట రోడ్డులో అర్ధరాత్రివేళ మూడు ఆటోలు విన్యాసాలు చేశాయి. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు ఏడుగురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. గత నెలలో బేగంపేట–ప్రకాష్‌నగర్ మార్గంలో ఏడుగురు యువకులు అర్ధరాత్రి వేళ హల్చల్ చేశారు. రేసింగ్‌తో పాటు వీళ్లు చేసిన ఫీట్లు సోషల్‌మీడియా ద్వారా పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేసిన అధికారులు ఏడుగురిని అరెస్టు చేశారు. సోషల్‌మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో ఈ రెండు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. అయితే బయటపడకుండా నిత్యం అనేక ప్రాంతాల్లో ఈ తరహా స్టంట్లు జరుగుతున్నాయని పోలీసులకు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారిపై నిఘా ఉంచడానికి డ్రోన్లు వినియోగించనున్నారు. ఒక్కో జోన్‌కు ఒక్కో డ్రోన్ చొప్పున సమీకరించుకోవాలని నిర్ణయించినట్లు నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. ఆయా ప్రాంతాల్లో రాత్రి వేళ... నడిరోడ్లపై సాగే ఈ సర్కస్ ఫీట్లలో పాల్గొంటున్న వారంతా యువకులే ఉంటున్నారు. ప్రధానంగా మధ్య, పశ్చిమ, ఉత్తర మండలాల్లోని ఎన్టీఆర్ మార్గ్, పీవీ నర్సింహారావు మార్గ్, మెహదీపట్నం, టోలీచౌకీ, బేగంపేట, బోయిన్పల్లి తదతర ప్రాంతాలతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్‌లోని కొన్ని చోట్ల ఈ విన్యాసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి వేళల్లో సాగుతున్న వీటి వల్ల ఇతరులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు ఆ వాహనచోదకులకు, ఎదుటి వారికీ ప్రమాదహేతువులుగా మారే ప్రమాదం ఉందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితం ఉండట్లేదు. డ్రోన్ల సాయంతో గగనతలం నుంచి... దీన్ని పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు విభాగం ఇలాంటి వ్యవహారాలపై నిఘా ఉంచడానికి డ్రోన్లు వాడాలని నిర్ణయించింది. ప్రతి జోన్‌కు ఒకటి చొప్పున ఉండే శక్తిమంతమైన డ్రోన్లను రాత్రి వేళల్లో రేసర్లను గుర్తించడానికి వాడనున్నారు. ఒక్కో డ్రోన్ గరిష్టంగా 250 మీటర్ల ఎత్తులో, 25 కిమీ పరిధిలో నిఘా ఉంచగలుగుతుందని అధికారులు చెప్తున్నారు. “28ఎక్స్’ వరకు జూమ్ చేసుకునే సామర్థ్యం వీటి కెమెరాలకు ఉంటుంది. ఫలితంగా రాత్రి వేళల్లోనూ కింద ఉన్న వాహనాల నెంబర్ ప్లేట్‌ను కచ్చితంగా చూడగలరు. ఆయా ప్రాంతాల్లో ఉండే డ్రోన్ ఆపరేటర్లు స్టంట్లు చేస్తున్న వాహనాలను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తారు. వాహనాల నంబర్ల ఆధారంగా బాధ్యుల చిరునామాలను గుర్తించి అరెస్టు చేయడానికి ఆస్కారం ఏర్పడనుంది. మూడు సెక్షన్ల కింద కేసులు సాధారణ ప్రజలతో పాటు తోటి ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారే ఈ తరహా రేసింగ్స్, స్టంట్స్‌ను తీవ్రంగా పరిగణించనున్నాం. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై ఐపీసీతో పాటు మోటారు వాహన చట్టం, సీపీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసే ఆస్కారం ఉంది. ఇప్పటికే చంద్రాయణగుట్ట, బేగంపేట కేసుల్లో వీటిని ప్రయోగించాం. డ్రోన్ల సాయంతో వాహనాల నంబర్లు గుర్తించి, వారి ఇళ్లకు వెళ్ళి మరీ పట్టుకుంటాం. నంబర్ ప్లేట్లు సక్రమంగా కనిపించని వాహనాల విషయంలో సీసీ కెమెరాల ఆధారంగా ముందుకు వెళ్తాం. – నగర పోలీసు ఉన్నతాధికారి -
దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రేసింగ్ విన్యాసాలు: ‘క్రిమినల్ కేసు నమోదు’
సాక్షి, విజయవాడ: విజయవాడలో బైక్ రేసర్లు రెచ్చిపోయారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రేసింగ్‌లకు పాల్పడుతూ వాహనదారులకు దడపుట్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఈ బైక్ స్టంట్స్‌పై ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్ సాక్షి టీవీతో మాట్లాడారు. ‘‘మైనర్ విద్యార్థులు ఫ్లైఓవర్‌పై విన్యాసాలు చేస్తున్నారు.. ఇవి అత్యంత ప్రమాదకరం. గత ఏప్రిల్‌లో ఐదుగురు విద్యార్థులును పట్టుకున్నాం. తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చాం. తాజాగా దుర్గగుడి ఫ్లైఓవర్సై స్టంట్లు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు. (చదవండి: చెన్నైలో ఆటో రేసింగ్.. ఒళ్లు గగుర్పొడవడం ఖాయం) ‘‘ఇద్దరు యువకులు స్టంట్లు చేసినట్టు గుర్తించాం. యువకులు టాయ్ గన్ తో విన్యాసాలు చేశారు. బైక్ రేసులు, విన్యాసాలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. బైక్ రేసులు, స్టంట్లు చేసేవారిపై చర్యలు తీసుకుంటున్నాం. సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విజువల్స్ చూశాం. ఇప్పుడు వచ్చిన విజువల్స్‌లో ఉన్న యువకుడిని కూడా అదుపులోకి తీసుకుంటాం. రేసింగ్, స్టంట్లు చేసిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇక నుంచి ఖాళీ రోడ్లు, ఫ్లై ఓవర్లపై నిఘా పెడతాం. యువకుల చేతిలో ఉన్నది డూప్లికేట్ గన్‌గా నిర్ధారించాం’’ అన్నారు. చదవండి: Hyderabad Bike Racer: రికార్డులే రికార్డులు -
ఈ బైక్... చాలా కాస్ట్లీ గురూ..
బంజారాహిల్స్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు బీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా వరకు బైక్ రేసింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కేబీఆర్‌పార్కు చౌరస్తాలో బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు చేపట్టిన తనిఖీల్లో 10 బైక్‌లు మితిమీరిన వేగంతో దూసుకెళ్తూ పట్టుబడ్డారు. ఇందులో ఆరు స్పోర్ట్స్ బైక్స్ ఉన్నట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో ఇన్స్పెక్టర్ ముత్తు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి రేసింగ్‌లకు పాల్పడుతున్న 17 వాహనాలను సీజ్ చేశారు. ఇందులో ఒక కారుతో పాటు 16 బైక్‌లు ఉన్నాయి. తొమ్మిది స్పోర్ట్స్ బైక్స్ కావడం గమనార్హం. ఆదివారం జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పంజగుట్ట ట్రాఫిక్ ఏసీపీ కోటేశ్వర్రావు వివరాలు వెల్లడించారు. మోటారు వాహనాల చట్టం కింద రైడర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయా బైక్‌లపై నమోదైన కేసుల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైడింగ్‌కు పాల్పడ్డ వారిలో కొందరికి లైసెన్సులు లేవని మరికొన్నింటికి నంబర్‌ప్లేట్ లేదని ఇంకొన్ని మాడిఫైడ్ సైలెన్సర్లతో తిరుగుతున్నట్లు తెలిపారు. నిందితులకు బేగంపేటలో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా పట్టుబడిన వారిలో మలక్‌పేట, టోలిచౌకీ, హిమాయత్‌నగర్ ప్రాంతాలకు చెందిన యువకులు ఉన్నట్లు తెలిపారు. ఈ బైక్... చాలా కాస్ట్లీ గురూ బంజారాహిల్స్: ఈ బైక్ ఖరీదు రూ.17 లక్షలు, 1300 సీసీ సామర్థ్యం, సింగిల్ సీట్, గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. లీటర్‌కు 5 కిలోమీటర్ల మైలేజీ, మాడిఫైడ్ సైలెన్సర్ల ఖరీదుకే రూ.1.50 లక్షలు, చెవులు దద్దరిల్లే శబ్ధం. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు శనివారం అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లపై చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పట్టుకున్న ఈ బైక్ మలక్‌పేట్‌కు చెందిన యువ వ్యాపారి సమీర్ అహ్మద్దిగా గుర్తించి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహి ల్స్ రోడ్ నెం.2 కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు వారాంతాల్లో మాత్రమే సదరు యువకుడు ఈ బైక్‌ను బయటికి రేసింగ్‌లో పాల్గొంటాడు. ఒక్కసారి ఈ బైక్ రోడ్డెక్కిందంటే పెట్రోల్ కోసం రూ. 7 వేలు ఖర్చు చేయాల్సిందే. మోటారు వాహనాల చట్టానికి విరుద్దంగా రైడింగ్ చేస్తున్న ఈ బైక్‌ను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. -
బైక్ రేస్‌లకు కళ్లెం వేయాలి
సాక్షి, విశాఖపట్నం: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యువకులు నిర్వహించే బైక్ రేస్‌లకు కళ్లెం వేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పోలీస్, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 31వ తేదీ రాత్రి బైక్ రేస్‌లు జరగకుండా, ప్రమాదాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్డు సేప్టీపై సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో గురువారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 40 కిలోమీటర్ల వేగాన్ని మించి ఎవరూ వాహనాలు నడపకుండా నియంత్రించాలని ఆదేశించారు. పోలీస్, రవాణా శాఖల అధికారులతో స్ఫెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలన్నారు. రోడ్ సేప్టీపై విద్యార్థి దశ నుంచే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కల్పించాలన్నారు. మధురవాడ, బోయపాలెం మధ్య ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ మధ్య ప్రాంతంలో రోడ్డు విభాగిని నిర్మించాలని జీవీఎంసీ నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. మల్కాపురం – యారాడ రహదారిలో రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశ అజెండా అంశాలు వివరించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై నిర్వహించిన చర్యలను వివరించారు. సమావేశంలో రవాణా, ఆర్టీసీ, పోలీస్, జీవీఎంసీ, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
మన్మధ్ మెరిసె...
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో జరిగిన అల్ట్రామ్యాన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం రెబ్బా మన్మధ్ ఆకట్టుకున్నాడు. అమెరికాలోని హవాయిలో జరిగిన అత్యంత కఠినమైన ఈ రేసులో ప్రపంచ వ్యాప్తంగా పలువురు హేమాహేమీలు పాల్గొన్నారు. ఒక్కో రోజు ఒక్కో విభాగంలో జరిగిన ఈ పోటీని పూర్తి చేయడమే ఓ విశేషమైతే మన్మధ్ 26వ స్థానంలో నిలవడం గమనార్హం. ఇది భిన్నమైందే కాదు... కఠినమైంది కూడా! మూడు రోజుల పాటు ‘ట్రయథ్లాన్’గా ఈ అల్ట్రామ్యాన్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తారు. తొలి రోజు స్విమ్మింగ్‌తో చాలెంజ్ మొదలవుతుంది. ఏ వందో, రెండొందల మీటర్లనుకుంటే పొరపాటే. ఏకబిగిన 10 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేయాలి. వెంటనే 145 కిలోమీటర్లకు పైగా బైక్ రేసు ఆ తర్వాత మరో 276 కిలోమీటర్ల బైక్ రేసు, చివరగా 84 కిలోమీటర్ల పరుగు పందెం ఉంటుంది. 40 మందికి పైగా ఇందులో పాల్గొంటే అటుఇటుగా కేవలం సగం మందే ఈ మూడు ఈవెంట్లను పూర్తి చేస్తారు. అలాంటి క్లిష్టమైన ఈ పోటీని అమెరికాలో స్థిరపడిన 39 ఏళ్ల మన్మధ్ 33 గంటల 25 నిమిషాల్లో పూర్తి చేయడం విశేషం. 30 నుంచి 39 ఏళ్ల వయోవిభాగంలో అతను పోటీపడ్డాడు. మొదటి రోజు స్మిమ్మింగ్‌తో పాటు 145 కి.మీ. బైక్ రేసును 10 గంటల 48 నిమిషాల్లో, రెండో రోజు 276 కి.మీ. పోటీని 11 గంటల 53 నిమిషాల్లో, చివరగా పరుగు పందెంను 10 గంటల 43 నిమిషాల్లో అతను పూర్తి చేశాడు. ఈ చాంపియన్‌షిప్‌లో 33 ఏళ్ల థామ్సన్ (22 గంటల 9 నిమిషాలు) విజేతగా నిలిచాడు. మన్మ«ద్‌కు అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఇష్టం. సవాళ్లతో కూడిన ఈవెంట్లలో గతంలోనూ పాల్గొని సత్తాచాటుకున్నాడు. ఐరన్ మ్యాన్, మియామి మ్యాన్, స్ప్రింట్ ట్రయథ్లాన్, ఎస్కేప్ ఫ్రమ్ అల్కట్రాజ్‌లాంటి పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటుకున్నాడు. -
బైక్ రేసింగ్, ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
పాలక్కాడ్, కేరళ : బైక్ రైడింగ్ సరదా యువకుడి ప్రాణాలు బలిగొంది. రేసింగ్‌లో భాగంగా బైక్‌పై వెళ్తున్న యువకుడిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పాలక్కాడ్ జిల్లాకు చెందిన మిధున్ కోశ్(22) నెహ్రూ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్ రైడింగ్ అంటే అతడికి ఇష్టం. బైక్ రేసింగ్లలో పాల్గొనడం అలవాటు. ఇప్పటికే పలు రేసింగ్‌లో పాల్గొన్న మిధున్ అందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుండేవాడు. అదే కోవలో అమెరికాకు చెందిన ‘ఐరన్ బట్ అసోసియేషన్’ నిర్వహించిన రేసింగ్‌లో అతను పాల్గొన్నాడు. ఈ పోటీలో భాగంగా బైక్‌పై 24 గంటల్లో 1600 కిలో మీటర్లు ప్రయాణించాలి. అందుకోసం మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బైక్‌పై బయల్దేరిన మిధున్ కర్ణాటకకు చేరుకోగానే జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పాలక్కాడ్ నుంచి బయల్దేరిన తన కుమారుడు తమిళనాడులోని కోయంబత్తూరు చేరుకోని లక్ష్యాన్ని పూర్తి చేస్తానని చెప్పాడని అతడి తల్లి పేర్కొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతని బ్యాగులో ట్రిప్‌కు సంబంధించిన మ్యాప్ లభించిందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
బైక్‌రేస్‌లో యువకుడి అరెస్ట్
టీ.నగర్: కొత్త సంవత్సర వేడుకల్లో బైక్రేసులో పాల్గొన్న యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీడియో వాట్సాప్‌లో విడుదల చేయడంతో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. చెన్నైలో డిసెంబరు 31వ తేదీ రాత్రి నూతన వేడుకల సందర్భంగా కొందరు యువకులు మెరీనా తీరంలోను, కోట్టూర్‌పురం రోడ్డులోను బైక్రేసు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇలావుండగా ఆరోజు రాత్రి మెరినా కామరాజర్ రోడ్డులో కొందరు యువకులు బైక్‌రేస్‌లో పాల్గొన్నారు. అందులో కొందరు బారికేడ్లను మోటర్బైక్తోపాటు రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు. దీంతో అక్కడ సంచలనం ఏర్పడింది. దీనిగురించి ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అరుణ్ నేతృత్వంలో విచారణ జరిగింది. కొన్ని రోజులుగా వీడియో ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తువచ్చారు. దీనికి సంబంధించి పెరంబలూరుకు చెందిన పీటర్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన యువకుడు పోలీసులను ఫేస్బుక్లో తిడుతూ వీడియో విడుదల చేయడంతో శనివారం పట్టుపడినట్లు తెలిసింది. ఇలావుండగా అరెస్టయిన పీటర్ తన చర్యలకు పోలీసుల క్షమాపణ కోరుతూ మరో వీడియోను విడుదల చేశాడు. ఈ రెండు వీడియోలు ప్రస్తుతం వాట్సాప్‌లలో హల్చల్ చేస్తున్నాయి. -
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్ రేసర్లు
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్‌లో గురువారం బైక్ రేసర్లు రెచ్చిపోయారు. బెంగుళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై జరుగుతున్న రేస్‌ను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్ నరేందర్‌ను బైక్‌తో ఢీ కొట్టాడొ రేసర్. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు పోలీసులు 27 మంది రేసర్లను అదుపులోకి తీసుకున్నారు. 10 బైకులను సీజ్ చేశారు. గాయాలపాలైన కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. అరస్టైన రేసర్ల ఏడుగురు మైనర్లు కూడా ఉన్నారు. దీంతో వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు పోలీసులు. రేసర్లంతా రాజేంద్రనగర్, వట్టేపల్లి, హసన్ నగర్, సులేమాన్ నగర్‌లకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు. -
డెత్ రేస్
♦ చెన్నై నగరంలో మళ్లీ బైక్ రేస్‌లు ♦ ప్రాణాలతో చెలగాటం ♦ భయభ్రాంతులకు గురౌతున్న జనం ♦ నిన్న ఓ యువకుడి దుర్మరణం ♦ ముగ్గురికి తీవ్రగాయాలు నగరంలో అర్ధరాత్రి జరుగుతున్న బైక్ రేసులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మెరీనా తీరం మెయిన్ రోడ్డుపై కన్నగి విగ్రహం నుంచి లైట్‌హౌస్ వరకు యువత బైక్ రేస్‌కు ఎంచుకునే ప్రదేశం. ఈసీఆర్, బీసెంట్ నగర్ రోడ్లలో కాలేజీ విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి బైక్ రేసులు ఆడుతున్నారు. కాలక్షేపం కోసం ప్రారంభించిన ఈ వికృత క్రీడ యువతకు జూదంలా మారింది. ఇటీవల ప్లస్‌వన్, ప్లస్‌టూ విద్యార్థులు కూడా రేసు మోజులోపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు పది మందికి పైగా మృత్యువాతపడ్డారు. తాజాగా ఆదివారం ఉదయం ముగ్గురు విద్యార్థుల విన్యాసాలకు ఎదురుగా వస్తున్న యువకుడు బలయ్యాడు. కేకేనగర్ : చెన్నై నగరంలో బైక్ రేస్ల్లో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకునే వారి సంఖ్య పెరుగుతోంది. రాయపురంలో మూడు రోజుల క్రితం జరిగిన మోటార్ సైకిల్ ప్రమాదంలో ప్లస్‌టూ విద్యార్థి మృతి చెందాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మెరీనా తీరంలో ముగ్గురు యువకుల రేస్ కారణంగా దాంతో సంబంధం లేని వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ముగ్గురు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో ఒక మోటార్ సైకిల్ పెట్రోల్ ట్యాంక్ పేలడంతో కలకలం రేగింది. చెన్నై ట్రిప్లికేన్ శివరాజపురం ప్రాంతానికి చెందిన మురుగన్ కుమారుడు ఆదికేశవన్ (21) ఆదివారం ఉదయం మెరీనా కామరాజర్ సాలై మార్గంలో మోటార్‌సైకిల్‌పై ఇంటికి వెళుతున్నాడు. వివేకానందర్ ఇల్లం వద్ద రోడ్డు పక్కన నిలిచి ఉన్న కారు అకస్మాత్తుగా కుడివైపు తిరిగింది. ఆదికేశన్ తన బైక్‌ను కూడా కుడివైపు తిప్పాడు. ఆ సమయంలో ఎదురుగా మరో మోటార్‌సైకిల్ ఆదికేశన్ బైక్‌ను వేగంగా ఢీకొంది. ఆదికేశన్ బైక్ ట్యాంకర్ పేలింది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డార ఎదురుగా బైక్‌లో వచ్చి ఢీకొన్న ముగ్గురు బాలురు కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు ముగ్గురు యువకులకు రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి, ఆదికేశన్ను కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆదికేశన్ మృతి చెందాడు. ఈ ప్రమాదంపై అన్నాసమాధి పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ పార్థసారధి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు బారులు ట్రిప్లికేన్కు చెందిన వారని, అదే ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో ప్లస్ ఒన్ చదువుతున్నట్టు తెలిసింది. ఆ ముగ్గురూ బైక్‌లో విన్యాసాలు ప్రదర్శించిన కారణంగానే ప్రమాదం సంభించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మెరీనా కామరాజర్ సాలైలో రాత్రి వేళల్లో విద్యార్థులు, యువకులు బైక్ రేస్ల్లో పాల్గొంటున్నారని, అందువల్లే అధిక సంఖ్యలో ప్రమాదాలు సంభవిస్తున్నటు పోలీసులు తెలుపుతున్నారు. దీంతో ఆ రోడ్డులో పోలీసులు బారికేడ్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
ప్రాణం తీసిన వీకెండ్ రేసింగ్
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో ఆదివారం తెల్లవారుజామున బైక్ రేసర్లు రెచ్చిపోయారు. డ్రాగ్ రేసు సందర్భంగా రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఓ రేసర్ ఢీ కొట్టాడు. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న గోపాల్ అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, రేసర్ నదీమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రేసర్ నదీమ్ పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
రేసింగ్ కుర్రాళ్లకు బేడీలు
డెంకాడ (విజయనగరం) : బైక్‌లపై వీర విహారం చేస్తూ ఆ మార్గంలో వచ్చిపోయే వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకులపై పోలీసులు కొరడా ఝళిపించారు. ఆదివారం విశాఖ నుంచి విజయనగరం జిల్లా పైడి భీమవరం వరకు జాతీయ రహదారిపై కుర్రాళ్లు బైక్ రేసింగులకు దిగారు. సమాచారం అందుకున్న విజయనగరం జిల్లా డెంకాడ పోలీసులు రంగంలోకి దిగి ఆరుగురు యువకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. -
భీకర బైక్ రేస్.. నలుగురు దుర్మరణం
బెంగళూరు: ఓ అనాలోచిత చర్య నాలుగు నిండు ప్రాణాలను బలిగొంది. బైక్ రేసింగ్ సరదా నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగిసేలా చేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదూ ఏకంగా నలుగురు విద్యార్థులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బెంగళూరు విమానాశ్రయం మార్గంలో భీకర బైక్ రేస్ కారణంగా జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం చెందారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చే దానిని చూసిన వారికి గుండె దడపుట్టించేలా ఉంది. ఆ నలుగురు యువకుల చేతిలో ఉంది లక్షలు పోసి కొన్న స్పోర్ట్స్ బైక్సే కావడం.. అవి గాలికంటే వేగంగా దూసుకెళ్లి అంతే వేగంతో ప్రధాన రహదారిపై పడి వారిని కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో ఓ స్థాయిలో నిప్పులు చెలరేగాయి. ఈ క్రమంలో వారి నలుగురి ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి. అసలు రేస్ ఎలా మొదలైందంటే... బెంగళూరుకు చెందిన నలుగురు యువకులు... టైం : అర్థరాత్రి.... ప్లేస్ : బెంగళూరు ఏయిర్‌పోర్ట్‌కు వెళ్లే దారి.... బైక్ రేస్ మొదలయ్యింది.... రయ్ మంటూ దూసుకెళ్లారు.... ఒకరిని మించి మరొకరు.... టార్గెట్‌ను రీచ్ కావటానికి పోటీపడ్డారు.. కానీ... టార్గెట్‌కు చేరుకునేలోపే లైన్ మిస్ అయ్యాడు ఓ రేసర్... రేసర్స్ ముందు వీడియో రికార్డ్ చేస్తున్న కారును ఢీ కొట్టాడు.. తగిలిన క్షణమే అల్లంత దూరంలో పడిపోయాడు ఆ రేసర్.. అతడి వెనుక ఉన్న మరో రేసర్.. తరువాత మరొకరు.. ఇలా అంతా హైస్పీడ్‌లో కిందపడిపోయారు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. ఈ రేస్‌లో వారు చేసిన తప్పులు మొదటి తప్పు రేసింగ్‌కు సిద్దమైన వారెవరూ హెల్మెట్ ధరించలేదు రెండోది.. ఎలాంటి శిక్షణ తీసుకోకుండా హైస్పీడ్ బైక్స్‌పై రేసింగ్ కు దిగడం మూడోది.. అర్థరాత్రి బైక్ రేసింగ్‌కు దిగటం నాలుగోది.. అత్యంత రద్దీగా ఉండే ఏయిర్పోర్ట్ వెళ్లేదారిని ఎంచుకోవటం ఐదో తప్పు రేసింగ్ సమయంలో ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చర్యలు అందుబాటులో లేకపోవటం -
ప్రాణాలు తీసిన బైక్ రేస్
చెన్నై, సాక్షి ప్రతినిధి: ముగ్గురు యువకుల బైక్‌రేస్ వ్యామోహం మరో ముగ్గురి జీవితాలను చిదిమేసింది. నిండు వయస్సులో ఉన్న ఇద్దరు మహిళలు బైక్ చక్రాల కింద నలిగిపోయారు. మరో వ్యక్తికి అతను పడుకున్న మంచాన్నే యమపాశంగా మార్చేశారు. చె న్నైలో బైక్రేసులకు అడ్డూ అదుపులేదనేందుకు బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోరకలే తార్కాణం. చెన్నై ప్యారిస్‌లోని పాత తిరువళ్లూర్ బస్‌స్టేషన్ పరిసరాల్లో పగటివేళ వ్యాపారాలు చేసుకుని, రాత్రి వేళ ఫుట్‌పాత్‌లే పట్టెమంచంగా భావించి నిద్రబోయే అభాగ్యులు ఎందరో ఉన్నారు. రోడ్లపై తోపుడుబళ్లు, పూల బడ్డీలు పెట్టుకుని వ్యాపారం ముగించుకున్న తరువాత రోడ్లకు ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌లపై పడుకోవడం అలవాటు. ఎప్పటిలానే ఫ్లాట్‌ఫారాలపై కొందరు పడుకోగా, మంగళవారం రాత్రి వర్షం పడడంతో బర్మాబజార్ ఫ్లాట్‌ఫారంపై మరికొందరు నిద్రించారు. తెల్లవారుజాము 2.30 గంటల సమయంలో ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై అతివేగంగా ముత్తుస్వామి ఫ్లైవోవర్ బ్రిడ్జి మీదుగా హార్బర్ వద్దకు వస్తుండగా ప్యారిస్ కూడలి వద్ద పోలీసు తనిఖీలను గమనించారు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో అదేవేగంతో బైక్‌ను పక్కసందులోకి దారిమళ్లించే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పగా ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారిపైకి దూసుకెళ్లింది. బైక్ ఢీకొట్టిన వేగానికి ఇనుపమంచం వేసుకుని నిద్రిస్తున్న అప్పు గాల్లోకి ఎగిరాడు. మంచం ముక్కలుచెక్కలై నిలబడగా అప్పు అదే మంచంపై పడడంతో అందులోని ఇనుక కమ్మీ కడుపులోకి గుచ్చుకోగా విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ అప్పు హిజ్రా అని తెలుస్తోంది. అయినా వేగం తగ్గించని యువకులు ఫ్టాట్ఫారంపైనే నిద్రిస్తున్న చిన్నపొన్ను, రుక్మిణి, మణిలపైకి ఎక్కింది. మంచి నిద్రలో ఉన్నవారు బిగ్గరగా కేకలు పెట్టారు. అప్పటికీ వెనక్కుతగ్గని యువకులు బైక్‌ను అదేవేగంతో మరింత ముందుకు పోనివ్వగా శకుంతల (70) అనే మహిళ తలఛిద్రమై ప్రాణాలు విడిచింది. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోగా పక్క ఫ్లాట్‌ఫారాలపై నిద్రిస్తున్న జనం మేల్కొని బైక్‌లతో వీరంగం సృష్టించిన ముగ్గురు యువకుల వెంటపడ్డారు. వీరికి దొరక్కుండా పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ముగ్గురు యువకుల రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఇంతలో ఆ పరిసరాల్లో ఫ్లాట్‌ఫారాలపై నిద్రిస్తున్న జనం ముగ్గురు యువకులను ఒడిసి పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనేక బైక్‌లలో వస్తున్న మరికొందరు యువకులు ఈ దారుణాన్ని దూరం నుంచి గమనించి వెనక్కు పారిపోయారు. ఇంతలో సమాచారం అందుకున్న ఫ్లవర్‌బజార్ ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదంలో శకుంతల (70), చిన్నపొన్ను (60) అనే ఇద్దరు మహిళలు, అప్పు అనే హిజ్రా (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితులు ఐస్హౌస్కు చెందిన సాదిక్ (18), ట్రిప్లికేన్కు చెందిన మన్సూర్ (19), రసూద్ (18)లుగా గుర్తించారు. సెల్‌ఫోన్ షాపులో పనిచేసే ఈ ముగ్గురు మంగళవారం రాత్రి రాయపేట దర్గాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న తరువాత ఈ వికృత క్రీడకు పాల్పడినట్లు సమాచారం. బైక్రేసుల వ్యామోహంతో ముగ్గురు ప్రాణాలను తీయడమేగాక వారు వారు ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. ముగ్గురిలో సాధిక్ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి, తీవ్రగాయాలకు గుైరె న కారణంతో స్టాన్లీ ఆసుపత్రిలో చేర్పించారు. బైక్ రేసులు షరామామూలే: చెన్నైలో రాత్రివేళ గుట్టుగా సాగుతున్న బైక్రేసు లపై ప్రజల నుంచి ఎన్ని ఫిర్యాదులు అందుతున్నా అదుపుచేసే నాథుడే కరువయ్యాడు. మౌంట్‌రోడ్డు, ఉత్తరకోట ప్రాంతాల్లో ఎక్కువగా బైక్రేసులు జరుగుతున్నట్లు సమాచారం. ఆరు నెలల క్రితం రాజాఅన్నామలై మన్రం వద్ద పూలవ్యాపారం చేసుకుంటున్న మహిళ ఫ్లాట్‌ఫారంపై నిద్రిస్తుండగా వాహనం కింద నలిగి చనిపోయింది. మరో సంఘటనలో మన్నాడీ తండిశెట్టి వీధిలో ఒక చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి చెందారు. చెన్నైలో బైక్రేసుల చరిత్రలో మరోపేజీ బుధవారం రక్తసిక్తమైంది. -
72 ఏళ్ల వయసులో అద్భుత విన్యాసం
కనగానపల్లి: వృద్ధుడు చేసిన బైకు విన్యాసం అందరినీ అబ్బురపరిచింది. వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన ఆనందరెడ్డి (72) చేతులు వదలిపెట్టి గంటకు 85 కిలోమీటర్ల వేగంతో బైకు నడిపారు. 25 నిమిషాలలో 36 కి.మీ దూరం చేరుకున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలోని మరూరు టోల్గేట్ వద్ద ఆదివారం ఉదయం 9.25 గంటలకు ప్రారంభమై పెనుకొండ సమీపంలోని గుట్టూరు క్రాసింగ్ వరకు కొనసాగింది. ఆనందరెడ్డి బైకు ఎక్స్‌లేటర్‌ను 85 కి.మీ (ఫిక్స్డ్) వేగం మీద పెట్టుకొని, హ్యాండిల్‌ను వదలిపెట్టి ట్రాఫిక్ మధ్యలో సైతం ఎక్కడా తడబడకుండా బైకు నడిపారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం సంపాందించేందుకే తాను ఈ సాహసం చేశానని ఆనందరెడ్డి తెలిపారు. తాను 1963 నుంచి 1970 వరకు ఆర్మీలో పనిచేశానని చెప్పారు. గతంలో ఉన్న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును ( 25 కి.మీ దూరాన్ని 23.54 నిమిషాలలో) అధిగమించాలన్న ఉద్దేశంతో ఈ విన్యాసం చేశానన్నారు. -
ఎమ్మెల్యే బోండా ఉమా కుమారుడి దాదాగిరి
-
టిడిపి ఎమ్మెల్యే కుమారుడి దౌర్జన్యం
గుంటూరు: తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుమారులు దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి. అధికారంలో ఉన్నాంగదా అని రెచ్చిపోతున్నారు. నిన్న అనంతపురంలో టిడిపి ఎమ్మెల్సీ శమంతకమణి కుమారుడు అశోక్ సాక్షి ప్రతినిధులపై దాడి చేశాడు. ఈరోజు విజయవాడ సెంట్రల్ టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు కుమారుడు మీడియా ప్రతినిధులపై దౌర్జన్యం చేశాడు. స్థానికుల కథనం ప్రకారం గుంటూరు జిల్లాలో కొందరు యువకులు బైకు రేసులు యధేచ్ఛగా సాగిస్తున్నారు. ఈరోజు తాడేపల్లి వద్ద యువకులు బైకు రేసులు నిర్వహించారు. ఈ రేసుల్లో టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమ కుమారుడు కూడా పాల్గొన్నాడు. రేసులు అడ్డుకున్న స్థానికులపై యువకులు దౌర్జన్యం చేశారు. ఆ ఘటనలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై బొండా ఉమ కుమాడు దౌర్జన్యం చేశాడు. బైకు రేసులు, యువకుల ఆగడాల విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
హైదరాబాద్‌లో అర్థరాత్రి బైక్ రేస్‌లు