డెత్ రేస్
♦ చెన్నై నగరంలో మళ్లీ బైక్ రేస్‌లు
♦ ప్రాణాలతో చెలగాటం
♦ భయభ్రాంతులకు గురౌతున్న జనం
♦ నిన్న ఓ యువకుడి దుర్మరణం
♦ ముగ్గురికి తీవ్రగాయాలు
నగరంలో అర్ధరాత్రి జరుగుతున్న బైక్ రేసులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మెరీనా తీరం మెయిన్ రోడ్డుపై కన్నగి విగ్రహం నుంచి లైట్‌హౌస్ వరకు యువత బైక్ రేస్‌కు ఎంచుకునే ప్రదేశం. ఈసీఆర్, బీసెంట్ నగర్ రోడ్లలో కాలేజీ విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి బైక్ రేసులు ఆడుతున్నారు. కాలక్షేపం కోసం ప్రారంభించిన ఈ వికృత క్రీడ యువతకు జూదంలా మారింది. ఇటీవల ప్లస్‌వన్, ప్లస్‌టూ విద్యార్థులు కూడా రేసు మోజులోపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు పది మందికి పైగా మృత్యువాతపడ్డారు. తాజాగా ఆదివారం ఉదయం ముగ్గురు విద్యార్థుల విన్యాసాలకు ఎదురుగా వస్తున్న యువకుడు బలయ్యాడు.
కేకేనగర్ : చెన్నై నగరంలో బైక్ రేస్‌ల్లో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకునే వారి సంఖ్య పెరుగుతోంది. రాయపురంలో మూడు రోజుల క్రితం జరిగిన మోటార్ సైకిల్ ప్రమాదంలో ప్లస్‌టూ విద్యార్థి మృతి చెందాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మెరీనా తీరంలో ముగ్గురు యువకుల రేస్ కారణంగా దాంతో సంబంధం లేని వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ముగ్గురు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో ఒక మోటార్ సైకిల్ పెట్రోల్ ట్యాంక్ పేలడంతో కలకలం రేగింది.
చెన్నై ట్రిప్లికేన్ శివరాజపురం ప్రాంతానికి చెందిన మురుగన్ కుమారుడు ఆదికేశవన్ (21) ఆదివారం ఉదయం మెరీనా కామరాజర్ సాలై మార్గంలో మోటార్‌సైకిల్‌పై ఇంటికి వెళుతున్నాడు. వివేకానందర్ ఇల్లం వద్ద రోడ్డు పక్కన నిలిచి ఉన్న కారు అకస్మాత్తుగా కుడివైపు తిరిగింది. ఆదికేశన్ తన బైక్‌ను కూడా కుడివైపు తిప్పాడు. ఆ సమయంలో ఎదురుగా మరో మోటార్‌సైకిల్ ఆదికేశన్ బైక్‌ను వేగంగా ఢీకొంది. ఆదికేశన్ బైక్ ట్యాంకర్ పేలింది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డార
ఎదురుగా బైక్‌లో వచ్చి ఢీకొన్న ముగ్గురు బాలురు కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు ముగ్గురు యువకులకు రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి, ఆదికేశన్‌ను కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆదికేశన్ మృతి చెందాడు. ఈ ప్రమాదంపై అన్నాసమాధి పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పార్థసారధి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విచారణలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు బారులు ట్రిప్లికేన్‌కు చెందిన వారని, అదే ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో ప్లస్ ఒన్ చదువుతున్నట్టు తెలిసింది. ఆ ముగ్గురూ బైక్‌లో విన్యాసాలు ప్రదర్శించిన కారణంగానే ప్రమాదం సంభించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మెరీనా కామరాజర్ సాలైలో రాత్రి వేళల్లో విద్యార్థులు, యువకులు బైక్ రేస్‌ల్లో పాల్గొంటున్నారని, అందువల్లే అధిక సంఖ్యలో ప్రమాదాలు సంభవిస్తున్నటు పోలీసులు తెలుపుతున్నారు. దీంతో ఆ రోడ్డులో పోలీసులు బారికేడ్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు.