మృతులు సలార్ బాషా, భువనచంద్ర(ఫైల్)
అనంతపురం: అతివేగం ఇద్దరిని బలిగొంది. కరిడికొండ శివారు 44వ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, మరొకరు చిరు వ్యాపారి ఉన్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురంలోని కళాకారుల కాలనీకి చెందిన మల్లికార్జున, శశికళ దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం.
చిన్న కొడుకు కురువ భువనచంద్ర (29) హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం స్నేహితుడి బుల్లెట్ బైక్ తీసుకుని అనంతపురం బయల్దేరాడు. ఆటోలో పల్లెలు తిరుగుతూ స్టీలుసామాన్లు, మిక్సీలు విక్రయిస్తూ జీవనం సాగించే బుక్కరాయసముద్రం మండల కేంద్రానికి చెందిన సలార్‌బాషా (55) అర్ధరాత్రి వేళ గుత్తి మండలం కరిడికొండ జాతీయ రహదారి సమీపంలో ఆగాడు.
ఇటు వైపు నుంచి అటువైపు ఉన్న ధాబా వద్దకు వెళ్లేందుకని నడుచుకుంటూ రోడ్డు డివైడర్‌పైకి చేరుకున్నాడు. అక్కడ చెట్ల మధ్య నుంచి కిందకు కాలు పెట్టగానే అల్లంత దూరాన 130 కిలోమీటర్ల వేగంతో బైక్‌పై వస్తున్న భువనచంద్ర వేగాన్ని అదుపు చేయలేకపోయాడు. బైక్ ఢీకొని సలార్‌బాషా వంద అడుగుల దూరం ఎగిరి కిందపడగా.. భువన చంద్ర 50 అడుగుల మేర గాల్లోకి ఎగిరి పడ్డాడు.
స్థానికులు ప్రమాద విషయాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని.. అచేతనావస్థలో ఉన్న ఇద్దరినీ గుత్తి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల్లో సలార్‌బాషాకు భార్య రషీదా, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. భువనచంద్ర అవివాహితుడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మితిమీరుతున్న బైక్ రేసర్ల ఆగడాలు..
గుత్తి శివారు 44వ నంబర్ జాతీయ రహదారిపై బైక్ రేసర్లు పేట్రేగిపోతున్నారు. హైదరాబాద్–బెంగళూరు మధ్య శని, ఆదివారాల్లో వందలాదిమంది బైక్ రేసర్లు మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 250 సీసీ నుంచి 500 సీసీ సామర్థ్యం కలిగిన బుల్లెట్, హోండా, యమహా బైక్‌లను రేసర్లు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో నడుపుతున్నారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఆరు గంటల్లో వెళ్లాలని బెట్టింగ్ వేసుకుని.. వేగంతో పోటీపడుతూ వారితో పాటు ఇతరులనూ ప్రమాదాల్లోకి నెడుతున్నారు. జాతీయ రహదారిపై పోలీసులు నిఘా ఉంచి బైక్ రేసర్ల ఆగడాలను అరికట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment