
ఉరవకొండ: పుట్టింట శుభకార్యాన్ని చూసుకుని సంతోషంగా తిరుగు ప్రయాణమైన దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని మారుతీనగర్‌లో నివాసముంటున్న నాగరాజు, స్వాతి దంపతులకు ఐదేళ్ల వయసున్న కుమారుడు హేమంత్, రెండేళ్ల వయసున్న కుమారుడు భానుప్రసాద్ ఉన్నారు.
ఈ నెల 13న తన పుట్టినిల్లైన కణేకల్లులో నిర్వహించిన ఊరి దేవరకు భర్త, పిల్లలతో కలసి స్వాతి హాజరైంది. శనివారం ఉదయం వీరు ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడుపుతున్న నాగరాజు.. పెన్నహోబిలం వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నాడు. ఘటనలో దంపతులు, పిల్లలు చెల్లాచెదరుగా పడిపోయారు. తలకు తీవ్ర గాయం కావడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
అటుగా వెళుతున్న వారు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా చిన్నారులను అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఉరవకొండ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, విషయం తెలుసుకున్న వెంటనే కణేకల్లు నుంచి స్వాతి కుటుంబసభ్యులు ఆగమేఘాలపై ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మృతదేహాలను చూసి బోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment