
అనంతపురం: ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం నగర శివారులోని రుద్రంపేటకు చెందిన హరినాథరెడ్డి (23), ప్రవీణ్‌తేజ (22) శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో హరినాథరెడ్డి కొనుగోలు చేసిన నూతన ద్విచక్ర వాహనానికి పూజ చేయించేందుకు సోమవారం ఉదయం ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఇద్దరూ చేరుకున్నారు.
పూజల అనంతరం తిరుగు ప్రయాణమైన వారు కూడేరు మండలం ముద్దలాపురం సమీపంలో వేగాన్ని నియంత్రించుకోలేక ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న ప్రవీణ్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. హరినాథరెడ్డి తలకూ బలమైన గాయమైంది. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక సోమవారం రాత్రి ఆయన కూడా మృతి చెందాడు. ఘటనపై కూడేరు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment