చేతులు వదలిపెట్టి బైకు నడుపుతున్న దృశ్యం (ఇన్‌సెట్‌లో) ఆనందరెడ్డి
కనగానపల్లి: వృద్ధుడు చేసిన బైకు విన్యాసం అందరినీ అబ్బురపరిచింది. వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన ఆనందరెడ్డి (72) చేతులు వదలిపెట్టి గంటకు 85 కిలోమీటర్ల వేగంతో బైకు నడిపారు. 25 నిమిషాలలో 36 కి.మీ దూరం చేరుకున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలోని మరూరు టోల్‌గేట్ వద్ద ఆదివారం ఉదయం 9.25 గంటలకు ప్రారంభమై పెనుకొండ సమీపంలోని గుట్టూరు క్రాసింగ్ వరకు కొనసాగింది.
ఆనందరెడ్డి బైకు ఎక్స్‌లేటర్‌ను 85 కి.మీ (ఫిక్స్‌డ్) వేగం మీద పెట్టుకొని, హ్యాండిల్‌ను వదలిపెట్టి ట్రాఫిక్ మధ్యలో సైతం ఎక్కడా తడబడకుండా బైకు నడిపారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం సంపాందించేందుకే తాను ఈ సాహసం చేశానని ఆనందరెడ్డి తెలిపారు. తాను 1963 నుంచి 1970 వరకు ఆర్మీలో పనిచేశానని చెప్పారు. గతంలో ఉన్న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును ( 25 కి.మీ దూరాన్ని 23.54 నిమిషాలలో) అధిగమించాలన్న ఉద్దేశంతో ఈ విన్యాసం చేశానన్నారు.