సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ కోసం పోలీసు బలగాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. ఆయుధాలు, బలగాల పరంగా చూస్తే ఇప్పటివరకు మావోయిస్టులపై పోలీసులదే పైచేయిగా నిలిచింది. అయితే సరిహద్దు దండకారణ్యంలో సంచరించడంలో మాత్రం మావోయిస్టులకే ఎక్కువగా పట్టు ఉంది. దీంతో ఆ సమస్యను అధిగమించేందుకు పోలీసులు అత్యాధునిక డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. తద్వారా మావోయిస్టుల కదలికలపై వీడియోలు, ఫొటోలు తీస్తున్నారు. ఇలా సేకరించిన సమాచారాన్ని కేంద్ర, సరిహద్దు రాష్ట్రాల బలగాలకు సైతం ఇస్తున్నారు.
దీంతో సరిహద్దు రాష్ట్రాల పోలీసులు పక్కాగా సమన్వయం చేసుకుంటూ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, దంతెవాడ, మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఏపీలోని తూర్పుగోదావరి, విశాఖ, ఒడిశాలోని మల్కనగిరి, కోరాపుట్ జిల్లాల్లో సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపులు ఉన్నాయి. ఈ జిల్లాలకు సరిహద్దుగా ఉన్న తెలంగాణలోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లోనూ పలుచోట్ల సీఆర్‌పీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ బేస్ క్యాంపుల నుంచి పోలీసులు దండకారణ్యంపై డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాల మేరకు వీటిని వాడుతున్నారు.
బలగాల వద్ద 250 గ్రాముల బరువు గల నానో డ్రోన్, 250 గ్రాముల నుంచి 2 కిలోల బరువు ఉండే మైక్రో డ్రోన్లు, 2 కిలోల నుంచి 25 కిలోల బరువు కలిగిన స్మాల్ డ్రోన్లు, 150 కిలోల లోపు ఉండే మీడియం డ్రోన్లు, 150 కిలోలకు పైగా బరువు కలిగిన లార్జ్ డ్రోన్లు ఉన్నాయి. వీటిలో నానో, మైక్రో డ్రోన్లను పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఇవి 250 మీటర్ల నుంచి 400 మీటర్ల ఎత్తుతోపాటు దూరం వెళ్లగలుగుతాయి. పక్షులు ఎగురుతున్నట్టుగానే శబ్ధం రాకుండా పనిచేసే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ డ్రోన్లను వాడుతున్నారు. ఇవి పూర్తిస్థాయి నియంత్రణతో ఉండడంతోపాటు ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు బేస్‌క్యాంపుల నుంచి అనుసంధానం చేసి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment