సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు వస్తున్నాయంటే సర్వేలు నిర్వహించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా సర్వేలు నిర్వహించి పార్టీల బలాబలాలు అంచనా వేసి చెబుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో పార్టీలు, వ్యక్తులు కూడా సర్వేలు జరిపిస్తుంటారు. తమతో పాటు ప్రత్యర్థుల బలాబలాలు తెలుసుకునేందుకు, ఓటర్ల నాడిని పసిగట్టేందుకు ఈ విధమైన సర్వేలు నిర్వహిస్తుంటారు. ప్రత్యేకంగా నియమించుకున్న సిబ్బందితో ఈ విధమైన సర్వేలు జరిపిస్తుంటారు. సర్వేల ఫలితాలను బట్టి, వ్యూహాలను మార్చడం, అవసరమైన కార్యాచరణ చేపట్టడం వంటి చర్యలు పార్టీలు చేపడ తాయి. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక తెరపైకి రావడంతో.. పదుల సంఖ్యలో సంస్థలు, యూట్యూబ్ చానళ్లు సర్వేలు, ఒపీనియన్ పోల్స్‌లో నిమగ్నమయ్యాయి.
సంస్థను బట్టి ప్యాకేజీ...
ప్రస్తుతం మార్కెట్‌లో పదుల సంఖ్యలో సర్వే సంస్థలున్నా యి. వీటిల్లో కొన్ని మునుగోడులో రంగంలోకి దిగాయి. పార్టీలు, అభ్యర్థుల బలాలను అంచనా వేసే పనిలో ఉన్నా యి. ఈ సర్వేలు పూర్తయిన తర్వాత ఆయా సంస్థలు సదరు పార్టీకి లేదా అభ్య ర్థికి సర్వేల్లో వ్యక్తమైన అభిప్రాయాలను క్రోడీకరించి వివరాలను నివేదిక రూపంలో సమర్పిస్తాయి. ఇందుకు గాను ఒక్కో సర్వే సంస్థ తమకున్న విశ్వసనీయత ను బట్టి సంబంధిత పార్టీ, అభ్యర్థుల నుంచి ప్యాకేజీ తీసు కుంటున్నాయి. మూడు, నాలుగు ఎన్నికల్లో పనిచేయడంతో పాటు ఆయా ఎన్నికల్లో సర్వే సంస్థ అంచనాలు నిజమైన పక్షంలో సదరు సర్వే సంస్థకు విశ్వసనీయత పెరుగుతుంది.
రూ.5 లక్షల నుంచి మొదలు...
రాష్ట్రంలో ఉన్న ఓ ఎనిమిది సర్వే సంస్థలు మునుగోడు ఎన్నికల్లో పనిచేస్తున్నాయి. వీటిలో నాలుగు సంస్థలు బీజేపీకి పనిచేస్తుండగా, ఒకటి కాంగ్రెస్‌కు, మరో మూడు టీఆర్‌ఎస్‌కు పనిచేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సంస్థలు మునుగోడులోని అన్ని వర్గాలు, అన్ని వయస్సుల వారి నుంచి కులాలు, మతాల వారీగా అభిప్రాయాలను తీసుకుంటున్నాయి. మునుగోడులో 2.18 లక్షల మంది ఓటర్లున్నారు. సర్వే సంస్థలు ఇందులో 1 శాతం లేదా 2 శాతం జనాభాను శాంపిల్ కింద తీసుకొని అభిప్రాయాలను సేకరిస్తాయి. ప్రజలను గుచ్చిగుచ్చి లోతుగా ప్రశ్నించడం ద్వారా వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేట్టుగా చేస్తారు. వారు వెల్లడించిన అంశాల మేరకు నివేదికలు తయారు చేసి క్లయింట్లకు అందజేస్తారు. ఇందుకు ఒక్కో సంస్థ రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్యాకేజీ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
పని మొదలెట్టిన 6 చానళ్లు..
మునుగోడులో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏయే సమస్యలున్నాయి, ఏయే అభ్యర్థి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ పార్టీకి అనుకూల వాతావరణం ఉందన్న అంశాలను పలు యూట్యూబ్ చానెళ్లు అభిప్రాయ సేకరణ పేరుతో సర్వేలు చేస్తున్నాయి. ఇలా ప్రధానంగా 6 చానళ్లు మునుగోడులో పనిచేస్తున్నాయని తెలిసింది. ఆయా చానళ్ల వారు వివిధ సమస్యలపై స్థానికులతో మాట్లాడింపజేస్తున్నారు. వారి అభిప్రాయాలను రికార్డు చేస్తున్నారు. ప్రతి మండలం నుంచి కనీసం 50 మందితో మాట్లాడి మొత్తంగా 350 మంది ఒపీనియన్ పోల్‌ను తమ తమ క్లయింట్లకు అందజేస్తున్నాయి ఒక్కో యూట్యూబ్ చానల్ వారికున్న విశ్వసనీయతతో పాటు వారికున్న సబ్‌స్క్రైబర్ల సంఖ్యను బట్టి ప్యాకేజీ తీసుకుంటున్నాయి. చానెళ్లు తక్కువలో తక్కువ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్యాకేజీగా స్వీకరిస్తున్నట్టు తెలిసింది.
రేటింగ్.. విశ్వసనీయతకోసం..
చానళ్లు, సర్వే సంస్థలు కాకుండా కొన్ని సంస్థలు కేవలం తమ విశ్వసనీయతను పెంపొందించుకునేందుకు, రేటింగ్ కోసం మునుగోడులో పనిచేస్తున్నాయి. ఏ పార్టీకి సంబంధం లేకుండా, అభ్యర్థికి వత్తాసు పలకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిద్వారా సబ్‌స్క్రిప్షన్ పెంచుకోవడంతో పాటు భవిష్యత్‌లో పార్టీలు తమను సంప్రదించే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈ విధంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment