కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్ అలుగుపై నుంచి పొర్లుతున్న వరద నీరు
సాక్షి, హైదరాబాద్: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలన్నీ నిండుగా ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని సగానికి పైగా చెరువులు పూర్తిగా నిండి అలుగు దుంకుతున్నాయి. మొత్తం 43,870 చెరువులకు గాను 27 వేల చెరువులు పూర్తిగా నిండి మత్తడి పోస్తున్నాయి. మరో 6,243 వేలకు పైగా ఏ క్షణమైనా నిండి పొంగిపొర్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లంతా స్థానికంగానే ఉండి ఎప్పటికప్పుడు చెరువుల పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.
అలుగు దుంకుతున్నాయి..
ప్రస్తుతం కరీంనగర్, గజ్వేల్, ఖమ్మం, వరంగల్ డివిజన్ల పరిధిలోని చెరువులు పూర్తిగా నిండిపోయాయి. కరీంనగర్ డివిజన్‌లో 2,889 చెరువులకు గానూ 1,500, వరంగల్ జిల్లాలో 2,946 చెరువులకు 1,720 చెరువులు నిండిపోయాయి. ఖమ్మంలో 1,409 చెరువులకు గానూ ఏకంగా 1,400 చెరువులు అలుగు దుంకుతున్నాయి. గజ్వేల్ డివిజన్‌లోని 6,308 చెరువుల్లో 4 వేల చెరువులు నిండాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 1,246 చెరువుల్లో మూడు, నాలుగు చెరువులు మినహా మిగతా చెరువులన్నీ మత్తడి దుంకుతున్నాయి. కృష్ణా బేసిన్‌లో సూర్యాపేట జిల్లాలో 1,314 చెరువుల్లో 985 చెరువులు, నల్లగొండలోని 1,927 చెరువుల్లో 800 చెరువులు నిండినట్లు సాగునీటి శాఖ రికార్డులు చెబుతున్నాయి. చెరువుల కట్టలు తెగకుండా రెవెన్యూ, మున్సిపల్, వాతావరణ శాఖలతో సమన్వయం చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం 12 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం
నిండేందుకు సిద్ధంగా నిజాంసాగర్, సింగూరు
ప్రస్తుత వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా నిండుకోగా, సింగూరు, నిజాంసాగర్‌లు కూడా నిండే అవకాశాలు కన్పిస్తున్నాయి. నిజాంసాగర్‌కు స్థానిక వాగుల నుంచి 26,823 క్యూసెక్కుల మేర వరద కొనసాగుతుండగా, పూర్తిస్థాయి నిల్వ 17.80 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 12.93 టీఎంసీలకు చేరింది. ఇక సింగూరుకు 23,646 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 29.91 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 25.82 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుత వర్షాల నేపథ్యంలో ఈ ప్రవాహాలు మరింత పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. శ్రీరాంసాగర్‌కు 24,510 క్యూసెక్కుల మేర ప్రవాహాలు నమోదవుతుండగా, 44,940 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దీనితో ఎల్లంపల్లికి 86 వేల క్యూసెక్కులు, లోయర్ మానేరుకు 58 వేల క్యూసెక్కుల మేర వరద నమోదవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment