శుభవార్త: రైతు బంధు ఇక ఇంటికే..! | Post Office Will Link E- Services To Rythu Bandhu Farmers | Sakshi
Sakshi News home page

శుభవార్త: రైతు బంధు ఇక ఇంటికే..!

Published Sun, Dec 27 2020 1:25 AM | Last Updated on Sun, Dec 27 2020 4:28 PM

Post Office Will Link E- Services To Rythu Bandhu Farmers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతుల బ్యాంకు ఖాతాలో నేటి నుంచి రైతు బంధు డబ్బు జమ కానుంది.. కానీ, దాన్ని తీసుకోవా లంటే బ్యాంక్‌ ఉన్న పట్టణానికో, ఏటీఎం ఉన్న పొరుగు ఊరికో వెళ్లాలి.. అసలే చలికాలం, ఆపై కరోనా వ్యాప్తి.. పట్టణాలకు వెళ్లాలం టే భయం. మరి డబ్బు తీసుకోవడం ఎలా?. ఇకపై ఇలాంటి ఇబ్బందులేమీ లేకుండా నేరుగా రైతు చేతికే రైతుబంధు సొమ్ము అందనుంది. ఈ మేరకు తపాలా శాఖ పక్కా ఏర్పాట్లు చేసింది. తపాలా కార్యాలయంలో ఖాతా ఉండాల్సిన అవసరం లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

మైక్రో ఏటీఎం సేవలు..
జనానికి మళ్లీ చేరువయ్యేందుకు తపాలా శాఖ ఎన్నో వినూత్న పద్ధతులు చేపడుతోంది. గతంలో ఉత్తరాల బట్వాడాతోనే సరిపుచ్చిన తపాలాశాఖ.. వాటికి కాలం చెల్లుతున్న నేపథ్యంలో కొత్త కార్యాచరణతో ముందుకొస్తోంది. ఈ క్రమంలోనే మైక్రో ఏటీఎం సేవలు ప్రారంభించింది. తపాలా ఉద్యోగి మన ఇంటికే వచ్చి డబ్బు అందజేసి వెళ్తాడు. మన బ్యాంకు ఖాతా నుంచి అంత మొత్తం తపాలాశాఖకు బదిలీ అవుతుంది. బ్యాంకుకో, ఏటీఎంకో వెళ్లాల్సిన పని లేకుండానే సొమ్ము చేతికందుతుంది.

అనారోగ్యంతో ఉన్నవారు, కరోనా విపత్కర పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ సేవలు ఉపయుక్తంగా ఉంటు న్నాయి. ఇప్పుడు తపాలాశాఖ రైతు బంధును దీనితో అనుసంధానించనుంది. రబీ సీజన్‌కు సంబంధించి 59 లక్షల మంది రైతులకు ఆదివారం రైతుబంధు సొమ్ము విడుదల కానుంది. దీంతో సోమవారం నుంచి మైక్రో ఏటీఎం సేవల ద్వారా రైతుబంధు నగదు చెల్లింపును తపాలాశాఖ ప్రారంభించనుంది. చదవండి: (అన్నదాతల ధర్మాగ్రహం)

సొమ్ము అందుతుందిలా..
తపాలాశాఖకు తెలంగాణలో 4,860 పోస్టాఫీసులున్నాయి. చాలా చిన్న గ్రామాల్లో బ్రాంచీలను కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఆయా బ్రాంచీ పోస్టాఫీస్‌లు సహా అన్ని కార్యాలయాలకు ప్రత్యేకంగా ఓ సెల్‌ఫోన్‌ను, బయోమెట్రిక్‌ డివైస్‌ను అందజేశారు. సంబంధిత రైతు ఆ తపాలా కార్యాలయానికి వెళ్లినా లేదా ముందస్తు సమాచారమిస్తే ఆ సిబ్బందే వారి ఇంటికి వెళ్లైనా సరే నగదు అందజేస్తారు. ఆ రైతు బ్యాంకు ఖాతా కచ్చితంగా ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. రైతు తన ఆధార్‌ నంబర్‌ తెలిపి బయోమెట్రిక్‌ డివైస్‌లో వేలిముద్ర వేయగానే అది అతని బ్యాంకు ఖాతాతో అనుసంధానం అవుతుంది. రోజుకు గరిష్టంగా రూ.10 వేల వరకు తన ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ వివరాలను సంబంధిత తపాలా సిబ్బంది మొబైల్‌ ఫోన్‌ ద్వారా నమోదు చేస్తాడు. అప్పుడు రైతు మొబైల్‌కు ఓటీపీ నంబర్‌ వస్తుంది. దాన్ని తపాలా సిబ్బందికి తెలిపితే చాలు.. అతను కావాల్సిన మొత్తాన్ని రైతు చేతికి అందిస్తాడు. 

ఎలాంటి చార్జీలు లేవు..
దీనికోసం సంబంధిత తపాలా కార్యాలయాల్లో అవసరమైన నగదు నిల్వలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే బ్యాంక్‌లు, ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి. మారుమూల గ్రామాలకు చెందిన రైతులు రైతుబంధు సొమ్ము తీసుకోవాలంటే పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ మైక్రో ఏటీఎంల ద్వారా ఇంట్లో కూర్చునే సొమ్ము పొందవచ్చు. తపాలా కార్యాలయంలో ప్రత్యేకంగా పొదుపు ఖాతా ఉండాల్సిన అవసరం లేకుండానే ఈ సేవలు మొదలవుతున్నాయి. ఈ సేవలు పొందినందుకు నయా పైసా ఛార్జీ కూడా లేకపోవడం విశేషం. 

కోవిడ్‌ మహమ్మారి ఆవరించిన కష్ట సమయంలో ఈ సరికొత్త మైక్రో ఏటీఎం సేవను రైతులంతా వినియోగించుకోవాలి. పట్టణాల్లో ఉండే బ్యాంక్‌ల వరకో, ఏటీఎంల వరకో కష్టపడి వెళ్లే పనిలేదు. ఊళ్లో ఉండే పోస్టాఫీస్‌కు వెళ్తే సరిపోతుంది. సంబంధిత సిబ్బందికి ఇంటిమేట్‌ చేస్తే వారే ఇంటికి వచ్చి నగదు అందించే ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవాలి. – పీవీఎస్‌ రెడ్డి, రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్, తపాలాశాఖ హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement