సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ వద్ద బుధవారం ఉదయం ప్లెక్సీలు ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. ఇది జీరాక్స్ సెంటర్.. ఇచట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ పత్రాలు లభించును.. అంటూ నాంపల్లి టీఎస్‌పీఎస్సీ కార్యాలయం సమీపంలో గోడ పత్రికలు వెలిశాయి.
అయితే టీఎస్‌పీఎస్సీ ప్రశ్నా పత్రాలు లీక్ కావడంపై ఆవేదనతో ఒక విద్యార్థిగా ఈ విధంగా నిరసన తెలిపినట్లు ఓయూ జేఏసీ ఛైర్మన్ అర్జున్ బాబు తెలిపాడు. గతవారం రోజులుగా విద్యార్థి లోకాన్ని అయోమయానికి గురి చేసిన టీఎస్‌పీఎస్పీ కార్యాలయం వద్ద తానే ఫ్లేక్సీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాడు.
గోడ పత్రికలో ఆయన ఫొటో కూడా ముద్రించుకున్నాడు. పేపర్లు లీక్ చేసిన టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయకుండా పరీక్షను రద్దు చేయడమేంటని ప్రశ్నించాడు. శిక్ష ఎవరికి వేశారు? బోర్డుకా లేకా విద్యార్థులకా? అని ధ్వజమెత్తాడు.
కస్టడీలో నిందితులు..
టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక సహా మొత్తం 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. గ్రూప్–1 పరీక్ష పేపర్లు చేజిక్కించుకున్న అనుభవంతో ప్రవీణ్, రాజశేఖర్‌లు మిగిలిన పరీక్షల సమయంలోనూ తమ ప్రయత్నాలు కొసాగించారు. గత నెల ఆఖరి వారంలో మరో నాలుగు పరీక్షలకు సంబంధించిన పది క్వశ్చన్ పేపర్లు వీరికి చిక్కాయి. అయితే వాటిని ఎలా విక్రయించాలో అర్థం కాని ప్రవీణ్ తనతో సన్నిహితంగా ఉండే రేణుకను సంప్రదించాడు. తన సమీప బంధువైన కానిస్టేబుల్ శ్రీనివాస్ ద్వారా ఏఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్‌లను రేణుక సంప్రదించింది.
ప్రవీణ్ నుంచి పేపర్ అందగానే భర్త డాక్యాతో కలిసి స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ తండాకు వెళ్లి, రెండురోజుల పాటు తన ఇంట్లోనే నీలేశ్, గోపాల్‌తో చదివించింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు మంగళవారం రేణుక, డాక్యా నాయక్, నీలేశ్, గోపాల్‌లను ఆ తండాకు తీసుకువెళ్లి సీన్ రీ–కన్‌స్ట్రక్షన్ చేశారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ లీకేజ్ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు!
Comments
Please login to add a commentAdd a comment