మోత్కూరులో తోపుడు బండి మహిళతో మాట్లాడుతున్న ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్
మోత్కూరు/కొడకండ్ల/దేవరుప్పల: తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన అంతమే బీఎస్పీ లక్ష్యమని, ఇందుకు ప్రజలంతా తమతో కలిసి రావాలని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికార యాత్ర బుధవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణానికి చేరుకుంది. పట్టణంలోని అంబేద్కర్, పూలే, మహాత్మాగాంధీ విగ్రహాలకు ప్రవీణ్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం గాంధీనగర్‌లో నిర్వహించిన బహిరంగసభలో ప్రవీణ్‌కుమార్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో రాష్ట్రంలో మార్చి 6న ఖిలాషాపూర్‌లో ప్రారంభమైన యాత్రను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారన్నారు. కాగా, అంతకుముందు బహుజన రాజ్యాధికార యాత్ర 11వ రోజులో భాగంగా జనగామ జిల్లా కొడకండ్లలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.
దేవరుప్పల మండలం కడివెండిలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తమ రాజ్యాధికార యాత్ర ర్యాలీలు, కార్యక్రమాలకు ప్రజలు హాజరుకాకుండా టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కుట్రలు పన్నుతున్నారని, దళితబంధు రాదని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమది ప్రజలకు అండగా నిల్చే పార్టీ అని, రాబోయే 289 రోజుల యాత్రనూ ఇదే తరహాలో ఆదరించాలని కోరారు. దొడ్డి కొమురయ్య కలలు సాకారం చేయాలంటే బడుగుల రాజ్యాధికారం అనివార్యమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment