సాక్షి, హైదరాబాద్: రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోతున్నారా? మరీ 11, 12 గంటలు కూడా దాటిపోతోందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఈ అలవాటును మార్చుకోవాల్సిందే. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రిస్తున్న వారిలో గుండె జబ్బులు పెరిగే ప్రమాదం అధికమైనట్లు వైద్య నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. రోజూ రాత్రి 10–11 గంటల మధ్య నిద్రకు ఉపక్రమించడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఈ అలవాటుతో గుండె జబ్బులను చాలావరకు దూరం పెట్టొచ్చునని అంటున్నారు.
రాత్రి 10 గంటలకు ముందు 11 గంటల తర్వాత నిద్రించే వారిలో గుండె జబ్బులు, ఇతర సమస్యలు పెరుగుతున్నట్టుగా ఓ తాజా అధ్యయనం తేల్చింది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటెర్ బిజినెస్ స్కూల్‌లో అంతర్భాగంగా ఉన్న ‘ద ఇనిషియేటివ్ ఇన్ డిజిటల్ ఎకానమీ ఎట్ ఎక్సెటెర్ (ఇండెక్స్), వివిధ దేశాల్లోని పరిశోధకులు నిర్వహించిన పరిశీలనలో ఆయా అంశాలు వెల్లడయ్యాయి.
శరీరంలో గడియారం!
మన శరీరంలో అంతర్గతంగా 24 గంటల గడియారం (సిర్కాడియన్ రిథమ్) పనిచేస్తుందని, అది శారీరక, మానసిక పనితీరు క్రమబద్ధీకరణకు ఉపకరిస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీనిని బట్టి రాత్రి 10–11 గంటల మధ్యకాకుండా ఇతర సమయాల్లో నిద్రకు ఉపక్రమిస్తే ఈ శరీర గడియారం సరిగా పనిచేయక గుండె సంబంధిత ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని తేలింది. యూకే బయోబ్యాంక్‌లోని దాదాపు 90 వేల మందికి సంబంధించిన సమాచారం, వివరాలు ప్రాతిపదికన ఈ పరిశీలన నిర్వహించారు.
వారం రోజుల పాటు వారు నిద్రించిన, మేల్కొన్న సమయాలను వారి ముంజేతిపై ఉండే అక్సిలరోమీటర్ (రిస్ట్‌వార్న్ అక్సిలరోమీటర్) ఆధారంగా పర్యవేక్షించారు. వివిధ సామాజిక నేపథ్యాలు, జీవనశైలి, ఆరోగ్యం, వ్యక్తిగత వివరాలు, తదితర అంశాలతో కూడిన ప్రశ్నల ఆధారంగా తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. దీనితో పాటు గుండె జబ్బులను గుర్తించేందుకు ఒక కొత్త విధానాన్ని అవలంబించడంతో పాటు, గుండెపోటు, గుండె వైఫల్యం, దీర్ఘకాలిక గుండెజబ్బు, తదితర అంశాలను పరిశీలించారు.
ఈ క్రమంలో రాత్రి 10 నుంచి 10.59 నిమిషాల మధ్యలో నిద్రపోని వారిలో అత్యధికంగా గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం హెచ్చుస్థాయిలో ఉన్నట్టుగా గుర్తించారు. ప్రధానంగా వయసు, లింగం, నిద్రపోయే కాలం, నిద్రలో అవాంతరాలు, మధ్యలో లేవడం, త్వరగా నిద్రపోవడం, రాత్రంతా గుడ్లగూబలా మేల్కొనడం, పొగతాగే అలవాటు, బాడీ మాస్ ఇండెక్స్, డయాబెటీస్, రక్తంలో కొలస్టరాల్, సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా నిద్రకు ఉపక్రమణ– గుండె సంబంధిత పని విధానాన్ని ప్రభావితం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
25 శాతం అధికం
►రాత్రి 10–11 మధ్యలో నిద్రపోయే వారితో పోల్చితే ఆ తర్వాత అర్ధరాత్రి నిద్రపోయే వారిలో వివిధ గుండెజబ్బులకు (కార్డియో వాస్క్యులర్ డిసీజెస్) గురయ్యే అవకాశం 25 శాతం అధికంగా ఉండే ప్రమాదం.
►రాత్రి 11–12 మధ్యలో నిద్రపోయే వారు గుండెజబ్బులకు గురయ్యే ప్రమాదంలో 12 శాతం పెరుగుదల
►రాత్రి 10 గంటల లోపు పడుకునే వారిలోనూ 24 శాతం అధికంగా గుండెజబ్బులు పెరిగే అవకాశం
►మహిళల్లో ఈ ప్రమాదం మరింత అధికం
►రాత్రి 10 గంటలోపు నిద్రపోయే పురుషుల్లోనూ ఇది గణనీయంగానే ఉంది.
►అర్ధరాత్రి దాటాక నిద్రపోవడం మరింత ప్రమాదకరం. ఉదయమే సూర్యకాంతిని చూడడం వల్ల శరీర గడియారం ‘రీ సెట్’ అయ్యే అవకాశాలుండగా, అది చూడలేకపోవడం వల్ల నష్టం జరిగే అవకాశం.
మరణాలు నిర్ధారణ కాలేదు
అర్ధరాత్రి, అపరాత్రి నిద్ర వల్ల తీవ్రమైన గుండెజబ్బులువచ్చే ప్రమాదం పెరుగుతుందని వెల్లడైందే తప్ప దాని వల్ల మరణాలు సంభవిస్తాయనేది నిర్ధారణ కాలేదని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటెర్ బిజినెస్ స్కూల్‌కు చెందిన సీనియర్ లెక్చరర్ డాక్టర్ డేవిడ్ ప్లాన్స్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment