తొమ్మిది నెలలు నీ ఊపిరితో పెంచావు..
ఎందుకు లోకాన్ని చూడనివ్వలేదు...
గర్భిణి కడుపులో పసికందుకు మాటలొస్తే ఇలానే ప్రశ్నిస్తుందేమో?
సాక్షి, ఆదిలాబాద్: అమ్మ.. ఈ పిలుపులో ఎంతో మాధుర్యం ఉంది. ఈ పిలుపు కోసం.. మాతృత్వపు మాధూర్యాన్ని ఆస్వాదించడం కోసం పెళ్లయిన ప్రతీ మహిళ పరితపిస్తుంది. పెళ్లయి ఏళ్లు గడిచినా గర్భందాల్చక వేలాది మంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ తన కడుపులో పసికందుకు ప్రాణం పోసిన ఆ తల్లి.. నవమాసాలు మోసింది. తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టిందని, మళ్లీ ఆడపిల్లే పుడుతుందేమో అన్న చిన్న అనుమానంతో.. తెల్లారితే లోకం చూడాల్సిన పసికందుతో సహా తనూ ప్రాణం తీసుకుంది. పోస్టుమార్టంలో కడుపులో ఉన్నది మగబిడ్డే అని తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సంబంధిత వార్త: ఆడపిల్ల పుడుతుందని నిండుగర్భిణి ఆత్మహత్య! తీరా పోస్టుమార్టంలో..
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద సంఘటన అందరినీ కదిలిస్తోంది. లోకాన్ని చూడకుండానే.. తల్లి గర్భంలోనే తనువు చాలించి.. తల్లితో కలిసి చితిమంటల్లో కాలి బూడిదైన ఆ పసికందుకు మాటలొస్తే.. తాను చేసిన తప్పేంటని? ప్రశ్నించేదేమో. ‘నీ కడుపులో ఊపిరి పీల్చుకోవడమే నేను చేసిన నేరమా?.. నీ రక్తం పంచుకోవడ మే పాపమా?.. రక్తపు ముద్దగా ఉన్న నాకు అవయవాలు ఇచ్చి రూపం ఇచ్చావు.. తొమ్మిది నెలలు నేను ఎంత ఇబ్బంది పెట్టినా భరించావు.. కడుపులో తంతుంటే సంతోషపడ్డావు కదమ్మా... కేవలం ఆడపిల్ల అన్న అనుమానంతో నాతోపాటు నీ ఊపిరి తీసుకున్నావ్. కానీ నేను మగబిడ్డనే.. లోకం ఆడపిల్ల, మగబిడ్డ అనే తేడా చూస్తుందని నాకు తెలియదు. లోకం తీరు నాకు తెలిస్తే.. దేవుడు నేను ఆడో మగో చెప్పే అవకాశం నాకు ఇస్తే తప్పకుండా నీకు విషయం చెప్పే వాడిని.. ఇప్పుడు నీ ప్రాణం తీసుకుని నా ఊపిరి ఆపేశావు.. అక్కకు నీ ప్రేమను దూరం చేశావ్. ఎందుకమ్మా ఇంత పనిచేశావ్.
Comments
Please login to add a commentAdd a comment