సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములను సర్వే చేసే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని, సర్వేకు సంబంధించిన ప్ర తిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆ దేశించారు. ‘దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన భూముల సర్వేలను పరిశీలించండి. అత్యాధునిక పరిజ్ఞానంతో సర్వే ఎలా చేయాలన్న దాని పై నివేదిక తయారు చేయండి’అని నిర్దేశించా రు. బుధవారం సచివాలయంలో భూపరిపాల న, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో ఆయన వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు.
భూపరిపాలన, సర్వే విభాగాల అధికారులతో సమీక్ష సందర్భంగా భూముల సర్వే అంశం చర్చకొచ్చింది. ప్రస్తుతం కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో సర్వేలు జరుగుతున్నాయని, ఏపీలో జరుగుతున్న సర్వే మోడల్ సర్వేగా ఉపయోగపడుతుందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇందుకు స్పందించిన పొంగులేటి.. ఏపీలో ఏం జరుగుతోందో పరిశీలించడంతోపాటు మంచి, చెడులను విశ్లేషిస్తూ సమగ్ర నివేదిక రూపొందించాలని చెప్పారు.
భూముల క్రమబద్దీకరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, రెవెన్యూ రికార్డుల్లో దాపరికం ఉండకూడదని చెప్పారు. వీఆర్‌ఏలకు త్వరలోనే ఐడీ కార్డులు, వేతనాలివ్వాలని, ఈ ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షల్లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సీసీఎల్‌ఏ, సర్వే–ల్యాండ్ సెటిల్‌మెంట్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆదాయమెందుకు తగ్గింది?
రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ వృద్ధి గతంతో పోలిస్తే సహేతుకంగా లేదని మంత్రి పొంగులేటి అభిప్రాయపడ్డారు. దీనికి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు స్పందిస్తూ గతంలో పంచాయతీల లేఅవుట్లను కూడా రిజిస్ట్రేషన్ చేసేవారమని, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో అవి పెండింగ్‌లో పడ్డాయని చెప్పారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు తెచ్చిన సవరణలు ఇబ్బందికరంగా మారాయని, ఈ సమస్య నుంచి బయటపడే పరిస్థితి లేకుండా పోయిందన్నారు
. దీనిపై స్పందించిన పొంగులేటి.. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతోనూ తాను మాట్లాడతానని, సుప్రీం తీర్పు ఉల్లంఘన జరగకుండా ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో ఏం చేయాలో నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌తో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment