సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం లభించి శత వసంతాలు పూర్తికి ముందుకు సాగుతున్న ఈ అమృతకాలంలో దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ‘అలయ్–బలయ్’ తోడ్పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఆయన లేఖ రాశారు. అలయ్–బలయ్ ఔన్నత్యాన్ని ప్రధాని కొనియాడారు. దశాబ్దానికి పైగా విజయవంతంగా సాగుతున్న ఈ ఉత్సవం తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు, కళలు, కళాకారులు, విభిన్న రుచులకు ఒక వేదికగా నిలుస్తోందన్నారు.
మన కళాకారులు, జానపద గాయకులు తమ ప్రదర్శనల ద్వారా భిన్నమైన సంస్కృతిని చాటేందుకు దోహదపడుతోందన్నారు. భారత సమాజంలోని విభిన్న వర్గాల ప్రజలు కలిసి వివిధ పండుగలను జరుపుకోవడం ఎంతోకాలంగా ఓ సంప్రదాయంగా వస్తోందని మోదీ తెలిపారు. ఉత్సాహభరిత వాతావరణంలో జరిగే ఈ పండుగలు సామాజిక బంధాలను బలపరుస్తాయని, ఈ ఆలోచనా ధోరణిని అలయ్–బలయ్ తనలో భాగం చేసుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని శుభాశీస్సులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment