Telangana: అయ్యో..మూత ‘బడి’ | Private School Managements Seek Aid To Tide Over Financial Crisis | Sakshi
Sakshi News home page

Telangana: అయ్యో..మూత ‘బడి’

Published Thu, Aug 26 2021 1:29 AM | Last Updated on Thu, Aug 26 2021 1:36 PM

Private School Managements Seek Aid To Tide Over Financial Crisis - Sakshi

ఇది నల్లగొండ పట్టణం శివాజీనగర్‌లోనిసెయింట్‌ ఆంథోనీస్‌ స్కూల్‌.. అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని టులెట్‌ బోర్డు పెట్టారు. ఇదే పట్టణంలోని క్రాంతినగర్‌లో మమత స్కూల్‌ నిర్వాహకులు భవనం అద్దె చెల్లించలేక చేతులెత్తేశారు. దాని యజమాని.. స్కూళ్లకు భవనాన్ని అద్దెకిస్తే లాభం లేదని ఏకంగా భవనాన్నే అమ్మకానికి పెట్టారు. 

సాక్షి, నెట్‌వర్క్‌: కరోనా దెబ్బకు ప్రైవేటు రంగంలోని చిన్నాచితకా బడ్జెట్‌ స్కూళ్లు చతికిలబడ్డా యి. పల్లెలు, మాదిరి పట్టణాల్లోని సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండి పిల్లలకు కాన్వెంట్‌ తరహా విద్యాబుద్ధులు నేర్పిన ఇలాంటి స్కూళ్లు రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో మూతపడ్డాయి. రెండు, మూడు దశాబ్దాలుగా నడుస్తున్నవీ కనిపించకుండాపోతున్నాయి. కొన్ని స్కూళ్లు ఫంక్షన్‌హాళ్లుగా మారి పోగా, మరికొన్ని ‘కార్పొరేట్‌’చేతుల్లోకి వెళ్లిపోయాయి. మరికొన్నింటిని యాజమాన్యాలు అమ్మకానికి పెట్టాయి. ఫలితంగా వీటిపై ఆధారపడిన వేలసంఖ్యలోని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. యాజమాన్యాలతో పాటు ఇన్నాళ్లూ వీటిపై ఆధారపడి, గౌరవప్రదంగా బతికిన టీచర్లు జీవనోపాధికి చిన్నాచితకా పనులు, ఇతర వృత్తులు చేపడుతున్నారు.

ఫీజులు రాక.. చెల్లింపులు భారమై
కరోనా, లాక్‌డౌన్‌ పరిణామాలతో పల్లెల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సమాంతరంగా నడిచిన చిన్నపాటి ప్రైవేట్‌ స్కూళ్లలో ఆన్‌లైన్‌లో బోధించేంత సాంకేతికత లేకపోయింది. మరోపక్క కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న మధ్యతరగతి వర్గాలు పిల్లల స్కూలు ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలామంది తమ పిల్లల్ని ప్రైవేట్‌ స్కూళ్లలో మాన్పించి ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించారు. ఈ పరిణామాలతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి. స్కూళ్లు నడవకున్నా సిబ్బంది జీతాలు, భవనాల అద్దెలు, విద్యుత్‌ బిల్లులు, ఆస్తిపన్నులు, స్కూల్‌ బస్సులపై ఈఎంఐలు చెల్లించక తప్పని పరిస్థితి.. గత విద్యా సంవత్సరం ఏదోలా నెట్టుకొచ్చినా.. ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలో కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభణతో పాఠశాలలు మళ్లీ మూతపడ్డాయి.

బోధన చాలావరకు ఆన్‌లైన్‌లోనే సాగటంతో పూర్తిస్థాయిలో ఫీజలు రాబట్టుకోలేక, అద్దెలు, పన్నులు, వాయిదాలు చెల్లించలేక, అప్పులు తీర్చలేక, సిబ్బందికి జీతాలివ్వలేక చిన్న పాఠశాలల యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. అద్దె చెల్లించాలని లేదా ఖాళీచేయాలని భవన యజమానులు ఒత్తిడి చేస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో కొన్ని యాజమాన్యాలు స్కూళ్లను మూసేశాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ప్రైవేటు స్కూళ్లు 10,912 ఉంటే, వీటిలో 960 వరకు బడ్జెట్‌ స్కూళ్లు మూతపడ్డాయి. మరికొన్నిటిని యాజమాన్యాలు అమ్మకానికి పెడుతున్నాయి. ఇంకొన్ని కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విలీనమవుతున్నాయి. సొంతంగా భవనాలున్న యాజమాన్యాలు.. స్కూలు మూసేసి భవనాన్ని ఇతర వ్యాపారాలకు లీజుకిస్తున్నాయి. ఫలితంగా ఆయా స్కూళ్లలోని బోధన, బోధనేతర సిబ్బంది రోడ్డునపడ్డారు. వీటిల్లో చదివే విద్యార్థులు చెల్లాచెదురైపోయారు.

అయితే అమ్మకం.. లేదంటే అద్దెకు
– కరోనా దెబ్బకు కుదేలైన కామారెడ్డి జిల్లాలోని 9 ప్రైవేటు పాఠశాలల్ని వాటి యాజమాన్యాలు అమ్మకానికి పెట్టాయి. కామారెడ్డిలోని ఓ కార్పొరేట్‌ స్కూలు.. ఏదోలా నెట్టుకొచ్చే యత్నంలో స్కూలు నడవక అద్దె చెల్లించలేని పరిస్థితి నెలకొందని, దీనిపై ఆలోచించాలంటూ కోర్టుకెళ్లింది. దీంతో స్కూళ్లు తెరిచేదాకా అద్దె అడగొద్దని భవన యజమానికి కోర్టు సూచించింది. 

– భద్రాద్రి జిల్లా పాతకొత్తగూడెంలోని అరుణాచలేశ్వర ప్రైవేటు పాఠశాల యాజమాన్యం స్కూలును మూసేసి భవనాన్ని గిరిజన సంక్షేమ శాఖకు లీజుకిచ్చింది. విద్యార్థుల నుంచి రూ.12 లక్షల వరకు ఫీజుల రూపేణా రావాల్సి ఉందని యాజమాన్యం వాపోయింది.

– బాన్సువాడలోని అక్షర స్కూలులో 280 మంది ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులున్నారు. వీరి నుంచి ఫీజులు వసూలు కాకపోవడంతో నెలనెలా బస్సుపై వాయిదా రూ.15 వేలు. భవనం అద్దె నెలకు రూ.30 వేలు చెల్లించడం గగనమైంది. దీంతో స్కూలు యజమాని ఫణీంద్ర కులకర్ణి 80 శాతం వాటాను అమ్మేశారు. 

– పాల్వంచలోని కేఎల్‌ఆర్‌ కిడ్స్‌ పాఠశాల యాజమాన్యం.. కరోనా పరిస్థితుల్లో నిర్వహణ భారమై ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థతో కలిసి స్కూలు నడపడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 

ఇవీ ప్రైవేటు యాజమాన్యాల విన్నపాలు
– ఈ రెండేళ్ల ఆస్తిపన్నును పూర్తిగా రద్దుచేయాలి
– ఆస్తిపన్నును వాణిజ్య కేటగిరీ నుండి శాశ్వతంగా సేవా కేటగిరీలోకి మార్చాలి.
– విద్యుత్‌ బిల్లును వాణిజ్య కేటగిరీ నుండి సాధారణ కేటగిరీకి మార్చాలి
– పాఠశాల బస్సుల రవాణా పన్నును రద్దుచేయాలి.
– ఏప్రిల్, మే, జూ¯న్‌ నెలల్లో ఇచ్చినట్లుగా ఉపాధ్యాయులకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం ఈ విద్యా సంవత్సరమంతా ఇవ్వాలి.

ఇది 35 ఏళ్ల చరిత్ర కలిగిన గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని ఎస్‌వీవీ పాఠశాల. వేలాదిమందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఈ స్కూలు మొన్నటివరకు 1,500 మంది విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులతో కళకళలాడింది. కరోనా దెబ్బకు విద్యార్థుల సంఖ్య 120కి పడిపోయింది. ఫీజులు వసూలుకాక, జీతాలివ్వలేక స్కూలు భవనాన్ని ఫంక్షన్‌హాలుగా మార్చేసినట్టు కరస్పాండెంట్‌ సర్వోత్తమరెడ్డి చెప్పారు.


‘టులెట్‌’బోర్డు కనిపిస్తున్న ఈ భవనంలో శ్రీవాణి ప్రైవేటు పాఠశాల (సంగారెడ్డి) 18 ఏళ్లుగా నడిచింది. కరోనాతో రెండేళ్లుగా బోధన లేదు. ఫీజులూ వసూలుకాలేదు. విధిలేని పరిస్థితుల్లో యాజమాన్యం అద్దె భవనాన్ని ఖాళీచేసింది. దీంతో భవనం యజమాని టులెట్‌ బోర్డు పెట్టారు.

అద్దె ఇవ్వలేం.. ఫర్నిచర్‌ అమ్ముకోండి
ఇది నల్లగొండలోని బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్‌. తరగతులు నడవక, ఫీజులు కట్టలేక 200 మంది విద్యార్థులు మానేశారు. దీంతో ఆదాయంలేక గతేడాది మార్చి నుంచి స్కూలు యాజమాన్యం భవన యజమానికి రూ.8 లక్షల అద్దె బకాయిపడింది. చేసేదిలేక అద్దె కింద సరిపెట్టుకోవాలంటూ ఫర్నిచర్‌ను వదిలేసింది. 

మూతపడిన స్కూలు కార్పొరేట్‌ వశం
ఐరిష్‌ ఎడ్యూవ్యాలీ వరల్డ్‌ స్కూల్‌.. యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్‌లో మూడేళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభమైంది. కరోనా తదనంతర పరిణామాలతో గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు పిల్లల్లేక, ఫీజులురాక మూతపడింది. దీంతో యాజమాన్యం.. ఈసీఐఎల్‌లోని కాల్‌ పబ్లిక్‌ స్కూల్‌ అనే కార్పొరేట్‌ సంస్థకు అమ్మేసింది. 

అపార్ట్‌మెంట్‌లోవాచ్‌మన్‌గా టీచర్‌
ఈయన పేరు బాల్‌రాజు (మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్‌). పీజీ, బీఈడీ చేసిన ఈయన స్థానిక ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేవాడు. భార్య సైతం పీజీ, బీఈడీ పూర్తిచేసి అదే స్కూల్‌లో పాఠాలు చెప్పేవారు. కరోనా పరిస్థితుల్లో స్కూలు మూతపడింది. ఇద్దరి ఉద్యోగాలూపోయాయి. దీంతో బాల్‌రాజు మహబూబ్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా చేరాడు. కులవృత్తి అయిన లాండ్రీ పని కూడా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement