TS: టీచర్ల పదోన్నతులు, బదిలీలు షురూ | Promotions and transfers of teachers | Sakshi
Sakshi News home page

తెలంగాణ టీచర్ల పదోన్నతులు, బదిలీలు షురూ

Published Sat, Sep 2 2023 3:46 AM | Last Updated on Sat, Sep 2 2023 4:02 PM

Promotions and transfers of teachers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ రూపొందించింది. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. 6, 7 తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో నేరుగా అందించాల్సి ఉంటుంది. ఈ నెల 12, 13 తేదీల్లో అన్ని జిల్లాల్లోనూ సీనియారిటీ జాబితాలను ప్రదర్శిస్తారు.

సెప్టెంబర్15న ఆన్‌లైన్‌లోనే ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపడతారు. ఆ తర్వాత వరుసగా అన్ని కేటగిరీల ఉపాధ్యాయుల బదిలీల ఆదేశాలు జారీ చేస్తారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఏక కాలంలో చేపడతారు. అయితే, ముందుగా హెచ్‌ఎంలను బదిలీ చేస్తారు. ఈ విధంగా అయిన ఖాళీల్లో స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతుల కల్పించి, బదిలీలు చేస్తారు.

తర్వాత స్కూల్‌ అసిస్టెంట్లు పదోన్నతుల ద్వారా భర్తీ అయిన స్థానాల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పదోన్నతులు కల్పించి, వారిని బదిలీలు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం అక్టోబర్‌ 3వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అక్టోబర్‌ 5 నుంచి 19 వరకూ బదిలీలు, పదోన్నతులపై అభ్యంతరాలుంటే అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. సీనియారిటీ జాబితా రూపొందించేందుకు అవసరమైన మార్గదర్శకాలను విద్యాశాఖ విడుదల చేయాల్సి ఉంది. 

జనవరి షెడ్యూల్‌కు స్వల్ప మార్పులు 
ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన షెడ్యూల్‌కు స్వల్ప మార్పులు చేశారు. ఒకే స్థానంలో మూడేళ్ళు పనిచేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. టీచర్లు గరిష్టంగా 8 ఏళ్ళు, హెచ్‌ఎంలు 5 ఏళ్ళు ఒకేచోట పనిచేస్తే విధిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ సర్విస్‌ కటాఫ్‌ తేదీ గతంలో ఫిబ్రవరి 1గా ఉండేది. ఇప్పుడు దీన్ని సెపె్టంబర్‌ 1గా నిర్ణయించారు. ఈ కారణంగా మరికొంతమంది బదిలీలకు అర్హులవుతారు.

రిటైర్మెంట్‌కు 3 ఏళ్ళలోపు సర్వీస్‌ ఉంటే బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. కటాఫ్‌ తేదీ మారడంతో ఈ విభాగంలోనూ కొత్తగా వచ్చే సర్విస్‌ను పరిగణనలోనికి తీసుకుంటారు. ఆన్‌డ్యూటీ పొందే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సీనియారిటీలో పది పాయింట్లు ఇవ్వడాన్ని కోర్టు వ్యతిరేకించింది. దీంతో ఈ ఆప్షన్‌ తొలగించి కొత్త సీనియారిటీ జాబితాను రూపొందించాల్సి ఉంది. 

సీనియారిటీ దగ్గరే తికమక 
ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో జిల్లా అధికారులు టీచర్ల సీనియారిటీ జాబితాను రూపొందిస్తున్నారు. దాదాపు 10 వేల మంది పదోన్నతులకు, 58 వేల మంది బదిలీలకు అర్హులని లెక్కగట్టారు. అయితే, సినియారిటీ జాబితా రూపకల్పన చేయాలని అధికారులు ఆదేశించినా, అందుకు తగిన మార్గదర్శకాలు ఇవ్వలేదని డీఈవోలు అంటున్నారు. ఈ కారణంగా అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.

స్కూల్‌ అసిస్టెంట్ల సీనియారిటీని పదోన్నతి కోసం రూపొందించడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఎస్‌ఏల్లో ఫిజిక్స్, మేథ్స్‌.. ఇలా వివిధ సబ్జెక్టుల బోధకులు ఉంటారు. కేటగిరీ వారీగా సీనియారిటీని తీసినప్పుడు ఒకరి కన్నా ఎక్కువ మంది తేలినప్పుడు ఎవరిని మొదటి స్థానంలో ఉంచాలని, ఎవరికి హెచ్‌ఎం పదోన్నతి కల్పించాలనేది ఇబ్బందిగా ఉందని డీఈవోలు చెబుతున్నారు. హెచ్‌ఎం పోస్టులు మల్టీ జోనల్‌ అయినప్పుడు 14 జిల్లాల ఎస్‌ఏ సీనియారిటీని తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ సందర్భంలో ఉద్యోగి చేరిన తేదీ, డీఎస్సీలో వచ్చిన మార్కులను పరిగణనలోనికి తీసుకుని సీనియారిటీ రూపొందిస్తారు. అప్పటికీ ఒకరికన్నా ఎక్కువ ఉంటే, డీఎస్సీలో ప్రతీ సబ్జెక్టులో వచ్చిన మార్కులు, జాయినింగ్‌ తేదీ, ఇంకా కావాలంటే పుట్టిన తేదీని పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మార్గదర్శకాలు వస్తే తప్ప ఇది సాధ్యం కాదని డీఈవోలు అంటున్నారు. వికలాంగుల విషయంలోనూ ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదు.  40 శాతం అంగవైకల్యాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని కోర్టు తెలిపింది. గత షెడ్యూల్‌లో 70 శాతం వైకల్యాన్ని అర్హతగా పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement