సాక్షి, ఆసిఫాబాద్: ప్రిన్సిపాల్ తీరును నిరసిస్తూ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు బుధవారం రోడ్డెక్కారు. రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసి, కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ సముదాయం వద్ద ధర్నాకు దిగారు. తమ సమ స్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.
ఉదయం అల్పాహారం తినకుండానే పాఠశాల నుంచి బయటకొచ్చారు. ఉదయం 7.30 గంటలకు అంబేడ్కర్ చౌక్ వద్ద రహదారిపై ధర్నా చేశారు. ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి తమను వేధిస్తోందని, సమయానికి భోజనం, వైద్యం అందించడం లేదని, నరకయాతన అనుభవిస్తున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు కాపలాదారులు మద్యం సేవించి విధులకు వచ్చి తమపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని వాపోయా రు.
సమస్యలు పరిష్కరించాలని ప్రిన్సిపాల్‌కు చెప్పి నా పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కినట్లు విద్యార్థినులు వెల్లడించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు పలువురు కలెక్టరేట్ వద్దకు వచ్చి వారికి మద్దతుగా నిలిచారు. ఆరు గంటలపైగా ఎండలోనే బైఠాయించడంతో కొందరు విద్యార్థినులు సొమ్మసిల్లిపడిపోయా రు. టీచర్ల విజ్ఞప్తికి స్పందించి పాఠశాలకు వెళ్లి అక్కడే చెట్ల కింద నిరసన కొనసాగించారు. చివరికి పోలీసులు సర్దిచెప్పడంతో విద్యార్థినులు భోజనాలకు వెళ్లడంతో పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment