సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల వారీగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అన్ని పురపాలికల కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రజల నుంచి జనవరి 6వ తేదీ వరకు ఆరు గ్యారంటీలకు సంబంధించిన అభయహస్తం దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా అధికారులు, సిబ్బందిని నియమించారు. ఒక్కోరోజు ఒక్కో బస్తీ చొప్పున నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు స్థానిక కార్పొరేటర్లను ఆహ్వానించాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం వీటిల్లో పాల్గొననున్నారు. పట్టణాల్లో జరిగే ప్రజాపాలనలో మునిసిపల్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు విద్య, విద్యుత్ విభాగాలకు చెందిన ఉద్యోగులు కూడా పాల్గొంటారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment