
సాక్షి, హైదరాబాద్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ నేతృత్వంలో ఆ రాష్ట్ర అధికారుల బృందం గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం ఎర్రవల్లిని సందర్శించనుంది. కాగా బుధవారం రాత్రి భగవత్‌మాన్‌సింగ్ హైదరాబాద్‌కు చేరుకొని సీఎం కేసీఆర్‌ను కలిశారు. మాన్‌సింగ్ బృందం కొండపోచమ్మ సాగర్ జలాశయంతో పాటు ఎర్రవల్లిలోని చెక్‌డ్యాం, పాండవుల చెరువును పరిశీలించనుంది.
గురువారం ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బయల్దేరి.. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి నగరానికి చేరుకోనుంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ (జనరల్) సి.మురళీధర్, గజ్వేల్ ఈఎన్‌సీ హరిరామ్ ఈ పర్యటనలో పాల్గొని.. ఆయా ప్రాజెక్టుల గురించి పంజాబ్ బృందానికి వివరించనున్నారు. కార్యక్రమంలో పంజాబ్ సీఎంతో పాటు ఆ రాష్ట్ర సీఎంవో కార్యాలయ ఐఏఎస్ అధికారులు, నీటిపారుదల శాఖాధికారులు పాల్గొంటారు.