సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట డ్రగ్స్ కేసు నిందితుడు స్టాన్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్‌తో స్టాన్లీ పట్టుబడ్డాడు. ఇక, స్టాన్లీ డ్రగ్స్ లింక్స్.. పోలీసుల కస్టడీ విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 500 మందితో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీఎస్‌న్యాబ్) విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో స్టాన్‌లీకి విదేశాల నుంచి మాదకద్రవ్యాలు చేరవేసే వ్యవహారం అంతా గోవాలోని కోల్వలే జైలు కేంద్రంగా సాగిందని వెల్లడికావడంతో టీఎస్‌న్యాబ్ అటువైపు దృష్టి సారించింది. అక్కడి జైల్లో ఖైదీలుగా ఉన్న నైజీరియన్ ఓక్రాతోపాటు ఆ ముఠాలో కీలకంగా ఉన్న ఫైజల్‌లను తీసుకువచ్చే ప్రయత్నాల్లో తలమునకలైంది. న్యాయస్థానం అనుమతితో ఓ బృందం ఇప్పటికే గోవాకు వెళ్లింది. వారిద్దరినీ విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని అధికారులు భావిస్తున్నారు.
ఇక, గోవా కేంద్రంగా సింథటిక్ డ్రగ్స్‌ను సరఫరా చేయడంలో స్టాన్‌లీ ముఠా ఆరితేరింది. ఆ క్రమంలో హైదరాబాద్‌కు వచ్చిన స్టాన్‌లీ సుమారు రూ.8 కోట్ల విలువైన మాదకద్రవ్యాలతో ఇటీవల టీఎస్‌న్యాబ్‌కు చిక్కాడు. అతడిని విచారించిన క్రమంలో ఈ ముఠాకు యూరోపియన్ దేశాల నుంచి డ్రగ్స్ అందుతున్నట్లు తేలింది. ఆయా దేశాల నుంచి ఓడల్లో తొలుత ముంబైకి సరకు చేరుతున్నట్లు, అక్కడి నుంచి హైదరాబాద్ సహా దేశంలోని ఇతర మెట్రో నగరాలకు సరఫరా అవుతున్నట్టు నిర్ధారణయింది.
కొకైన్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, చరస్, హెరాయిన్, అంపిటమైన్, మారిజువానా, ఓజీ కుష్.. తదితర మాదకద్రవ్యాల్ని ఈ ముఠా తెప్పించి అవసరమైన కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారానికి గోవాలోని కోల్వలే జైలు కేంద్రబిందువుగా ఉన్నట్లు, జైల్లో ఉన్న ఓక్రా, ఫైజల్‌లు సెల్‌ఫోన్ల ద్వారానే డ్రగ్స్ కోసం విదేశాలకు అర్డర్లు పంపిస్తున్నట్లు, సరకు చేరిన అనంతరం సౌరవ్ అనే పెడ్లర్ ద్వారా స్టాన్‌లీ సహా ఇతర డ్రగ్ ముఠాలకు దాన్ని అందజేసేలా ఓక్రా నెట్‌వర్క్‌ను సృష్టించినట్టు విచారణలో స్టాన్‌లీ వెల్లడించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో విచారణలో వెల్లడైన అంశాలను టీఎస్‌న్యాబ్ బృందం ఐదారు రోజుల క్రితం గోవా పోలీసులకు చేరవేసి అప్రమత్తం చేసింది. అనంతరం కోల్వలే జైల్లో అక్కడి అధికారులు తనిఖీలు నిర్వహించగా ఖైదీల వద్ద 16 సెల్‌ఫోన్లు లభించడం కలకలం రేపింది. ఎఫ్‌ఎస్‌ఎల్‌లో సెల్‌ఫోన్లలోని సమాచారాన్ని విశ్లేషించడంపై ప్రస్తుతం గోవా పోలీసులు దృష్టి సారించారు. సదరు కాల్‌డేటాను తెప్పించుకోవడంతోపాటు ఓక్రా, ఫైజల్‌లను ఇక్కడికి తీసుకొచ్చి విచారిస్తే ఈ ముఠా లీలలతోపాటు యూరోపియన్ దేశాల్లో డ్రగ్స్ సరఫరా దందాపై కీలక సమాచారం లభిస్తుందని టీఎస్‌న్యాబ్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment