సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్ పిటిషన్‌ను లోయర్‌కోర్టు తిరస్కరించడం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన కేసులో విచారణ ఈ నెల 25కు వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్, రాజాసింగ్ తరపున సీనియర్ న్యాయవాది దామోదర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
లోయర్‌కోర్టు రిమాండ్‌ను తిరస్కరించిన మరుసటిరోజే... రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ మోపి జైలుకు పంపారని, 77 రోజులు కారాగారంలో ఉంచారని దామోదర్‌రెడ్డి తెలిపారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేయడం ఆక్షేపణీయమన్నారు. 41ఏ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని లోయర్ కోర్టు తప్పుబట్టిందని వివరించారు.
పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు కూడా ఇది విరుద్ధమని నివేదించారు. అనంతరం ఏజీ వాదనలు వినిపిస్తూ.. ప్రతీ కేసులో 41ఏ కింద నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇదే తరహాలో ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసుపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ సాగుతోందని, ఆ కేసులో 41ఏ నోటీసులకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే ఉత్తర్వుల మేరకు ఈ కేసులోనూ ముందుకు పోవచ్చని చెప్పారు. ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసు విచారణ సుప్రీంకోర్టులో సోమవారం ఉన్నందున.. రాజాసింగ్ రిమాండ్ కేసును వాయిదా వేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment