ఫైల్ ఫోటో
సాక్షి, కరీంనగర్: బాలింతను భూతవైద్యుడు వైద్యం పేరిట చిత్రహింసలు పెట్టిన ఘటనలో రజిత ప్రాణాలు కోల్పోయింది. భూతం ఆవహించిందని, చేతబడికి గురైందన్న నెపంతో చిత్రహింసలకు గురి చేయడంతో సృహతప్పి పడిపోయిన రజిత కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గతవారం రోజుల క్రితం రజితకు దైయ్యం పట్టిందని అత్తవారి ఇంటివద్ద మంచిర్యాల జిల్లా కుందారంలో కుటుంబ సభ్యులు భూత వైద్యం చేయించారు. వైద్యం పేరుతో దొగ్గల శ్యామ్ తలవెంట్రుకలు లాగుతు, విచక్షణ రహితంగా కొట్టి మంచంపై పడేయడంతో తలకు గాయమయ్యింది. సృహతప్పి పడిపోవడంతో అత్తింటి వారు రజితను కరీంనగర్ లోని ప్రతిమ ఆసుపత్రికి తరలించారు. ఐదురోజులుగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు.
భూత వైద్యుడు శ్యామ్‌తో పాటు అతనికి సహకరించిన రజిత బాబాయి రవీందర్‌ను మూడురోజుల క్రితం జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అత్తింటి వారిపై కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు. రజిత స్వగ్రామం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక కాగా తల్లిదండ్రులు లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం మల్లేష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వారికి నాలుగు నెలల పాప ఉంది. పెళ్లయిన కొద్ది రోజుల నుంచి అనారోగ్యం పాలైన రజితకు దెయ్యం పట్టిందని భూతవైద్యుడి తో వైద్యం చేయించారు. భూతవైద్యుడు కొట్టిన దెబ్బలకే రజిత ప్రాణాలు కోల్పోయిందని రజిత పుట్టింటి వారు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment